ఒడిశాలో దక్షిణ కొరియా కంపెనీ తలపెట్టిన పోస్కో స్టీల్ ఫ్యాక్టరీకి వీరప్ప మొయిలీ జనవరి 7 న అనుమతి యివ్వడం వివాదాస్పదం అయింది. పర్యావరణ అనుమతులు లేక యీ ప్రాజెక్టు ఎనిమిదేళ్లగా పెండింగులో వుంది. దక్షిణ కొరియా అధ్యకక్షుడు పార్క్ గ్యెన్హే జనవరి 15 నాటి పర్యటనకు వారం ముందుగా దీనికి అనుమతి యివ్వాలని నిశ్చయించుకున్న యుపిఏ ప్రభుత్వం జయంతీ నటరాజన్ స్థానంలో మొయిలీని పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంట్ అండ్ ఫారెస్ట్స్)కు తెచ్చారు. జయంతి పర్యావరణ అనుమతులపై చురుగ్గా వ్యవహరించడం లేదని, ఆమె లంచగొండితనం కారణంగా అనేక ప్రాజెక్టులు పెండింగులో పడి, కార్పోరేట్లు ఆమెతో విసుగు చెందాయని వార్తలు పుట్టించారు. ఆ తర్వాత ఆమె సేవలను పార్టీ పనికి వినియోగించుకోవడానికి మంత్రి పదవి నుండి తొలగించారని అన్నారు. ఆమె అవినీతిపరురాలని మోదీ కూడా ధృవపరుస్తూ 'జయంతి టాక్స్' వసూలు చేస్తుందని చమత్కరించారు. జయంతిని పక్కకు పెట్టి మొయిలీని తేగానే ఆయన మూడు వారాల్లో పోస్కోతో సహా రూ. 1.80 లక్షల కోట్ల 73 ప్రాజెక్టులకు అనుమతి యిచ్చేశారని చెప్పుకుంటున్నారు. ఆ శాఖ మాత్రం 28టికే అనుమతి యిచ్చాం అని చెప్తోంది. మూడువారాలంటే 15 పనిదినాలే కదా. 15 పనిదినాల్లో 28 అనుమతులంటే మొయిలీ అత్యంత సమర్థుడని, జయంతి యిన్నాళ్లూ దేశప్రగతికి అడ్డుపడిందని అనుకోవాలి. పోస్కో పూర్వాపరాలు తరచిచూసేముందు జయంతి కథ చూడాలి.
పార్టీ పనులకోసమే జయంతిని తీసేశారనుకుంటే నెలన్నర గడిచినా ఆమెకు పార్టీ పని ఏదీ అప్పగించలేదు. ఇక మంత్రిగా ఆమె దక్షత చూడబోతే – ఆవిడ ఆ శాఖలో 2011 జులై నుండి 2013 డిసెంబరు వరకు పనిచేసింది. బొగ్గుగనుల ప్రాజెక్టులు 2012లో 98 పరిశీలనకు వస్తే 57కి అనుమతులు లభించాయి. 2013లో 81 వస్తే 46టికి అనుమతి లభించింది. థర్మల్ ప్రాజెక్టులు 2012 లో 49 పరిశీలనకు వస్తే 27కి అంగీకారం, రెంటిడికి తిరస్కారం లభించింది. 2013లో 52 వస్తే 14టికి అనుమతి లభించింది. 2013 ఏప్రిల్‌నుండి డిసెంబరు వరకు హైడ్రోపవర్ ప్రాజెక్టులు 86 పరిశీలనకు వస్తే 75టికి అనుమతి లభించింది. అనుమతి రాని కేసుల్లో అదనపు సమాచారం కోసం అడగడం జరిగింది. పర్యావరణ సంబంధిత అనుమతులను పరిశీలించే సామాజిక సంస్థల అభిప్రాయం ప్రకారం జయంతి పనితీరు చక్కగానే వుంది. మన్మోహన్ సింగ్ కూడా ఆమె చాలా సమర్థురాలని కితాబు యిచ్చారు. మరి మోదీ ఆరోపణ మాటేమిటి? అంటే దాని వెనక అదాణీ గ్రూపు కథ వుంది.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా పోర్టు వద్ద అదాణీ గ్రూపు సెజ్ పెట్టుకుంది. 1994లోనే భూమి సేకరించి 1998 నాటికి ఒక బెర్త్ పూర్తి చేసింది. క్రమేపీ విస్తరిస్తూ పోయింది. ఇలా చేయడంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసిందన్న ఫిర్యాదు రావడంతో పర్యావరణ మంత్రిగా వచ్చిన జయంతీ నటరాజన్ 2012లో సునీతా నారాయణ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీ వేసింది. ఆ కమిటీ అదాణీ కంపెనీ పరిరక్షిత ప్రాంతమైన 75 హెక్టార్ల చెట్లు (మాన్‌గ్రోవ్స్)ను, అనేక సముద్రపు కయ్యలు (క్రీక్స్) ధ్వంసం చేసిందని నివేదిక యిచ్చింది. దానిపై పర్యావరణ శాఖ 2013 సెప్టెంబరులో ఆ గ్రూపుపై రూ.200 కోట్ల జరిమానా విధించింది. ఎన్వైర్మెంట్ రిస్టోరేషన్ ఫండ్ అని ఒక ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేయాలంది. ఈ అదాణీ సెజ్‌కు తమ పశుగ్రాసపు భూములను మోదీ ప్రభుత్వం కట్టబెట్టిందంటూ అక్కడి రైతులు గుజరాత్ హైకోర్టుకి వెళ్లారు. గత నెలలో కోర్టు మోదీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ, అదాణీ సెజ్ పర్యావరణ అనుమతులు లేకుండా తన కార్యకలాపాలు ప్రారంభించిందని వ్యాఖ్యానించింది. ఈ అదాణీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదాణీ నరేంద్ర మోదీకి సన్నిహితుడు. అందుకే మోదీ జయంతిపై మండిపడ్డాడు. యుపిఏ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు విరాళాలు పోగు చేయాలి కాబట్టి పెట్రోలియం మంత్రిగా వున్న మొయిలీకి యీ శాఖ కూడా కట్టబెట్టారు. అసలు ఆ రెండు శాఖలకూ చుక్కెదురు. రెండూ ఒకరికే యిస్తే పర్యావరణం 'గంగ'పాలే! మొయిలీ ప్రాజెక్టులకై అప్లయి చేసుకున్న కార్పోరేట్లకు ఎడాపెడా – రోజుకి 2 నుండి 5 అనుమతులు యిచ్చేస్తున్నాడు. వాటిలో ఒకటి – పోస్కో!
ఒడిశా తీరప్రాంతమైన జగత్సింఘ్పూరులో రూ. 52000 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ స్టీలు ఫ్యాక్టరీ పెట్టడానికి దక్షిణ కొరియా స్టీల్ దిగ్గజం పోస్కో కంపెనీ 2005లో ముందుకు వచ్చింది. ఒడిశా ప్రభుత్వంతో ఎమ్ఓయు (ఒప్పంద పత్రం)పై సంతకం పెట్టింది. దానికే అంకితమైన ఖండధార్ గని, ఎగుమతుల కోసం విడిగా పోర్టు (పారాదీప్ నౌకా కేంద్రం యిప్పటికే రద్దీగా వుంది) యిస్తామని ప్రభుత్వం హామీ యిచ్చింది. పోస్కో 4 ఎంపిటిఏ (ఏడాదికి 4 మిలియన్ల టన్నులు) కెపాసిటీ ప్లాంటు పెడతామంటూ పర్యావరణ శాఖకు చెప్పి ఆ మేరకు ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ (ఇఐఏ) రిపోర్టు యిచ్చి, ప్రజా దర్బారులో కూడా అలాగే చెప్పారు. అయితే తర్వాత మాట మార్చి 12 ఎంపిటిఏ కెపాసిటీ ప్లాంట్ పెడతామనడం సాగించారు. 2007లో మన్మోహన్ సింగ్ పర్యావరణం చూస్తున్నపుడు కెపాసిటీని 12 నుండి 4 ఎంపిటిఏలకు తగ్గించాం అన్నారు. 12 ఎంపిటిఏ కైతే 4004 ఎకరాలు కావాలి. 4 ఎంపిటిఏ కైతే 2752 చాలు. ఈ జనవరి 7 న మొయిలీ యిచ్చిన ఆర్డర్లో '12 ఎంపిటిఏ కెపాసిటీతో పోస్కో పెడతానన్న ఒరిజినల్ ప్లానులో ఏ మార్పులూ లేవు' అని అబద్ధం చెప్పింది. సేకరిస్తున్న భూమిలో 90% ప్రభుత్వందే. తక్కినది గిరిజనులది. వారు అక్కడ తమలపాకు, జీడి వంటి వాణిజ్యపంటలు, రొయ్యల చెరువులు వేసుకుని బాగా ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం యివ్వచూపే నష్టపరిహారం వారికి నచ్చడం లేదు. ప్రభుత్వం ఎకరాకి రూ.11.5 లక్షలు యిచ్చి, తర్వాత కుటుంబసభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా నెలకు రూ.2250 ఎలవెన్సు యిస్తానంటోంది. వాళ్లు ఎకరాకు 17 లక్షలు, 4500 ఎలవెన్సు అడుగుతున్నారు. ఇప్పటివరకు 52 కుటుంబాలను తరలించారు. వారి కోసం కట్టిన క్యాంపులు చాలా యిరుగ్గా వున్నాయి.
పోస్కో కంపెనీ యింత పెట్టుబడి పెట్టడానికి కారణం లేకపోలేదు – ఖండధార్లో సూపర్ గ్రేడ్ ఐరన్ టన్ను రూ.1200-1300కు దక్కుతుంది. ఓపెన్ మార్కెట్ ధరతో పోలిస్తే అక్కడే దాదాపు రూ.2500 లాభం. మొత్తం స్టీలు తయారు చేసి ఆర్జించే లాభం అది పెట్టే మొత్తం పెట్టుబడికి రెండింతలు వుంటుంది. ఇంత ప్లాను చేసినా ఏదీ అనుకున్నట్టు జరగలేదు. థలవారీగా చూస్తే – 2008లో అటవీ భూమిని మామూలు భూమిగా మార్పిడి (ఫారెస్ట కన్వర్షన్) చేయడానికి సుప్రీం కోర్టు ఓకే అంది. 2009లో ఖండదార్ గనుల్లో 2500 హెక్టార్ల ప్రాంతంలో ఖనిజం తవ్వుకునే లైసెన్సు పోస్కోకు యిమ్మనమని ఒడిశా ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దానిపై ఎవరో హై కోర్టుకి వెళితే 2010లో ఒడిశా ప్రభుత్వం ఓడిపోయింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం చాలా ఉల్లంఘనలు జరిగాయని సక్సేనా కమిటీ తేల్చడంతో పర్యావరణ శాఖ భూమి సేకరణను ఆపేయమంది. తొలిథలో పోస్కో పట్ల ఉత్సాహం చూపిన నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టు పట్ల గ్రామపంచాయితీల వ్యతిరేకత చూసి ఆ తర్వాత చల్లబడ్డారు. అందుకే పర్యావరణ శాఖ పోస్కో భూమి సేకరణను 2010లో ఆపించేసినప్పుడు ఒడిశా ప్రభుత్వం వూరుకుంది. కానీ అదే శాఖ రాహుల్ గాంధీ అభ్యంతరం కారణంగా వేదాంత అల్యూమినియం కంపెనీ వారి నియమ్‌గిరి మైనింగ్ ప్రాజెక్టుకు ఫారెస్టు క్లియరెన్సు యివ్వకపోతే మాత్రం తిరుగుబాటు చేసింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)