భారతరత్న అందుకున్న సచిన్‌

మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన వెంటనే సచిన్‌కి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఆయనతోపాటు రసాయన శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలతో…

మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన వెంటనే సచిన్‌కి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఆయనతోపాటు రసాయన శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సిఎస్‌ఆర్‌రావు కూడా ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పలువురు ప్రముఖులు భారతరత్న పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సచిన్‌ టెండూల్కర్‌, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే.

భారత క్రికెట్‌లోనే కాక, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సచిన్‌ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. సచిన్‌ని క్రికెట్‌ అభిమానులు ‘దేవుడు’ అని పిలుచుకుంటుటారు. క్రికెట్‌లో అతను సాధించిన ఘనతకు ఏనాడో భారతరత్న దక్కాల్సి వుందనే అభిప్రాయాలు సచిన్‌ అభిమానుల్లో వ్యక్తమవుతాయి.

అయితే, సచిన్‌ని తొలుత రాజ్యసభకు ఎంపిక చేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఆ తరువాత భారతరత్న ప్రకటించడం పట్ల సచిన్‌ అభిమానులూ ఒకింత నిరాశ చెందారు. రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నా తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కానంటాడు సచిన్‌. ఏదిఏమైనా, భారతరత్న అందుకున్న సచిన్‌ని మరోమారు దేశమంతా అభినందిస్తోంది.