తను 'శుంఠ' అనే పదాన్ని వ్యంగ్యంగానే అన్నానని చెప్పి జయపాల్ తప్పుకుంటున్నారు. 'శుంఠ' అనే పదంలో వ్యంగ్యం వుందని నాకెన్నడూ తెలియదు. తెలిసి వుంటే చిన్నపుడు మా టీచర్లు 'చదువురాని శుంఠా, అడుక్కుతినిపోతావ్' అన్నపుడు అంత బాధపడిపోయి వుండేవాణ్ని కాను. ''మాయాబజారు'' సినిమాలో శకుని లంబూజంబూలను చూసి 'పెళ్లిపెద్దలంటూ శుద్ధ శుంఠలు తయారయ్యారు' అని అన్నపుడు దాన్ని వియ్యాల వారి మధ్య సరసాలగా అనుకోలేదు చిన్నమయ్య. 'అగ్గీబుగ్గీ కాకు సామీ' అంటూ శకునిని బతిమాలాడు. చిన్నప్పటి నుండి యింటా, బయటా అనేకమంది పెద్దల చేత 'శుంఠ' అనిపించుకున్నవాణ్ని. అది కోపంతో తిట్టే తప్ప దానిలో వ్యంగ్యం ఏమీ లేదని బాగా తెలుసు కాబట్టి జయపాల్ ఎంత మేధావి అయినా బుకాయిస్తే నమ్మడానికి నేను రెడీగా లేను. దానికి సంబంధించిన వ్యంగ్యం ఎక్కడైనా వుందా అంటే 'పండితపుత్ర' అనడంలో వుంది. ఎందుకంటే 'పండితపుత్రః పరమ శుంఠః' అనే సామెత వుంది కాబట్టి! అందుచేత ఎవరినైనా పండితపుత్రులు మీరు అని అంటే 'నువ్వు శుంఠవు' అనే వ్యంగ్యంగా చెపుతున్నామన్నమాట.
ఈ మధ్య ఓ టీవీ చర్చలో అంబటి రాంబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్ వాదించుకుంటున్నారు. 'మీరు నీతులు చెపుతూంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది' అన్నారు ద్రోణంరాజు. అంబటి తన సహజమైన వ్యంగ్యధోరణిలో 'మేం దెయ్యాలమైతే పోనీ పండితులు మీరు వల్లించండి, వింటాం' అని వెటకరించారు. ద్రోణంరాజు బ్రాహ్మణుడు కాబట్టి పండితశబ్దం వాడడంలో ఎత్తిపొడుపు మరింత పండింది. అయితే ద్రోణంరాజు వెంటనే 'నేను పండితుణ్నీ కాను, పండితపుత్రుణ్నీ కాను..' అంటూ తిప్పికొట్టారు. పండితుణ్ని కాననడంలో వినయమూ వుంది, పండితపుత్రుణ్ని కాదనడంలో 'నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నేను శుంఠను కాను సుమా' అనే హెచ్చరికా వుంది. వ్యంగ్యప్రయోగాలంటే యిలా వుంటాయి.
ఓ సారి ఒకాయన వాపోయాడు – 'నేను పండితుణ్ని కాను కానీ, మా అబ్బాయి ప్రోగ్రెస్ కార్డు చూస్తే మాత్రం నన్ను పండితుణ్ననే అంటారండి..' అని. ఒకసారి మా వరప్రసాద్ రఘురామ్ అనే తన కొలీగ్‌ను పరిచయం చేస్తూ 'హాస్యం అంటే యిష్టం. మంచి టేస్టుంది… పండితపౌత్రుడు' అన్నాడు. వాళ్ల తాతగారు పండితుడట. కానీ ప్రత్యేకంగా ఎత్తిచెప్పడంలో యీయన పండితపుత్రుడు (అనగా శుంఠ) కాడు అని నొక్కి చెప్పి, నువ్వేదైనా చమత్కారంగా మాట్లాడినా విని ఆస్వాదించగలడు అనే సూచన వుంది. అదీ మాటలు వాడే తీరు. ఆ రోజు జయపాల్‌గారు వ్యంగ్యంగా మాట్లాడడానికి తగినంత అవకాశం అంతకుముందు వాక్యంలోనే వుంది. 'పట్టాభిగారి వంటి పండితులు..' అన్నపుడు ఆ వాక్యంలోంచే 'అలాటి చోట యిప్పుడు పండితపుత్రులు పుట్టుకుని వచ్చారు' అంటూ పండితపుత్ర శబ్దానికి సులభంగా లీడ్ తీసుకోవచ్చు. మళ్లీ విడిగా శుంఠ మాట వాడనక్కరలేదు.
సమయానికి జయపాల్గారికి యీ మాట తట్టి వుండదు అంటే నేనొప్పను. మాట బరువు, తూకం తెలిసినాయన ఆయన. స్టూడెంటు లీడరుగా వున్న రోజుల నుండి బ్రహ్మానందరెడ్డిగారికి ఘోస్ట్ రైటర్‌గా వుండేవారని ప్రతీతి. ఈ ఘోస్ట్ వ్యవహారాలు ఎప్పటికీ బయటకు రావు కాబట్టి యితమిత్థంగా చెప్పలేం. జయపాల్ సమయస్ఫూర్తి, భాషాపరిజ్ఞానం గురించి ఒక ఉదంతం చాటి చెపుతుంది. లోకసభలో బోఫోర్స్ గురించి ఘాటు చర్చ జరుగుతోంది. రాజీవ్ భార్యకు సన్నిహితుడైన ఖత్రోచీ మధ్యవర్తిగా వ్యవహరించాడని, బోఫోర్స్ ముడుపులు 'లోటస్ యిన్వెస్ట్‌మెంట్స్' అనే కంపెనీకి మళ్లించారనీ పేపర్లలో వచ్చేసింది. ఆ లోటస్ యిన్వెస్ట్‌మెంట్స్ రాజీవ్ స్నేహితుడైన అమితాబ్ బచ్చన్దని బిజెపి ఆరోపిస్తోంది. కాంగ్రెసు వాళ్లు ఆ ఆరోపణలు తిప్పికొట్టడానికి 'లోటస్ అంటే కమలం. మీ ఎన్నికల గుర్తు కమలం. అందువలన బిజెపి పార్టీ వారే ఆ కంపెనీ పెట్టి వుంటారని తేలిపోతోంది.' అని వైల్డ్ గెస్ చేశారు. అప్పుడు రాజీవ్‌కు వ్యతిరేకిగా, ప్రతిపక్ష నాయకుడిగా వున్న జయపాల్ లేచి నిలబడి 'రాజీవ్ అనే సంస్కృతపదానికి యింగ్లీషు అర్థం లోటస్. ఆ కంపెనీ రాజీవ్ పేరే పెట్టి వుండవచ్చు' అన్నారు. పార్లమెంటులో అందరూ నిర్ఘాంతపోయారు. అది నిజంగా రాజీవ్‌దా కాదా అన్నది వేరే విషయం (ఇప్పుడు జయపాల్ని అడిగితే కాదనే అంటారు) కానీ సమయానికి రాజీవ్ అన్న పదానికి అర్థం గుర్తుకు తెచ్చుకుని, దాన్ని లోటస్‌కు సంధానం చేయడం అద్భుతమైన చాకచక్యం. చాలా పేర్లు వింటాం కానీ, అర్థాలు వెతకం. వెతికినా అవి మనసులో నాటుకోవు. ఆ రోజు జయపాల్ చూపిన సమయస్ఫూర్తికి ప్రత్యర్థులు సైతం అబ్బురపడ్డారు.
అలాటి జయపాల్ 'పండితపుత్ర' అనే పదాన్ని వాడి తన చాకచక్యాన్ని ప్రదర్శించకుండా 'శుంఠ' అని డైరక్టుగా తిట్టడం దేనికి..? దేనికంటే 'కసితో..' అనే జవాబు వస్తుంది. ఎందుకంటే మూర్ఖుడు, తెలివితక్కువవాడు అని తిట్టాలంటే 'చవట' అని కూడా అనవచ్చు. అంటే కసి తీరదు. 'ట' అంటే తేలిగ్గా పోతోంది. గట్టిగా వత్తు పెట్టి 'ఠ' అంటేనే కసి తీరుతుంది. ఇదేదో నేను కనిపెట్టిన సూత్రం కాదు. ''దొంగరాముడు'' సినిమాలో రేలంగి వేసిన షావుకారు పాత్ర ద్వారా రచయిత, దర్శకుడు చెప్పించారు. దొంగతనం చేయడానికి వచ్చిన హీరోని పట్టుకుని 'ఏమనుకున్నావురా, నేను మామూలు భద్రయ్యను కాను, వీ..ర భద్రయ్యను' అని మీసం మెలేస్తాడు. హీరో ఎప్పుడైతే బొడ్లోంచి కత్తి తీసి చూపించాడో జావకారిపోయి, '..అబ్బే వట్టి బద్రయ్యనే, బకు వత్తు లేదు..' అంటాడు. 'బ-కు వత్తులేదు' అనడంలోనే వుంది స్వారస్యం. వత్తు తీసేస్తే పవరు పోయినట్టే. ఎంఫసిస్ కోసం వత్తులు పెడుతూ వుంటాం. ఓ సారి నాకు కాళీపట్నం రామారావుగారు ఉత్తరం రాస్తూ 'నేను ఓట్ఠి పాఠకుణ్ని మాత్రమే..' అని రాశారు. ఒట్టి పాఠకుణ్ని అని రాసి వూరుకోవచ్చు. తన సామాన్యతను చాటిచెప్పడానికి పాఠకుడిలో 'ఠ'తో సంబంధం వుండేటట్లు 'ఓట్ఠి' అని మార్చి వాడారు. అలాగ జయపాల్‌గారు విభజన మంచిదని తను చెప్పినా వినని, అర్థం చేసుకోని సీమాంధ్రులపై విసుగు, కోపం, కార్పణ్యం ప్రతిఫలించేట్లు 'శుంఠ' పదం వాడారు. ఆయన ఆ మాట అన్నాక సభలో వచ్చిన స్పందన కూడా టీవీల్లో వచ్చింది. ఆయన తృప్తిగా చిరునవ్వు నవ్వి, ముందుకు సాగినట్టు కూడా..!
ఆ మాటకొస్తే తెలంగాణ వుద్యమకారులు విభజన తప్పదని, ఆయన వచ్చి నాయకత్వం వహిస్తే తప్ప వ్యవహారం ఒ కొలిక్కి రాదని థాబ్దకాలంగా చెపుతూ వచ్చినా జయపాల్గారూ అర్థం చేసుకోలేదు. మరి ఆయన గురించి ఉద్యమకారులు కూడా యిదే పదాన్ని వుపయోగించి వుండవచ్చు. మన మాట వినని ప్రతీవాడూ మన దృష్టిలో శుంఠే. జయపాల్‌గారు సమైక్యవాదిగా వున్నంతకాలం సమైక్యవాదులు ఆయన దృష్టిలో పండితులే. ఆయన విభజనవాదంవైపు మళ్లాక కూడా యింకా సీమాంధ్రులు సమైక్యవాదం పట్టుకుని వేళ్లాడడం చేత వాళ్లు ఆయన దృష్టిలో శుంఠలయిపోయారు. తెలంగాణ ఉద్యమానికి ఛాంపియన్‌గా చెప్పుకుంటూ ముఖ్యమంత్రి పదవికి ఆయన పోటీ పడుతున్న యీ తరుణంలో సీమాంధ్రులు సమైక్యవాదం, మరో వాదం అంటూ ఆయన సిరికి మోకాలు అడ్డితే ఆయనకు కోపం రాదా?
ఇలా తిట్టే సమయంలో ఆయనకు ప్రకాశం పంతులుగారు, పట్టాభి సీతారామయ్య గొప్పవాళ్లగా తోచారు. సమైక్యవాదులను తిట్టడానికి వాళ్లను గొప్పవాళ్లగా చెప్పారా, లేక మొదటినుండీ వారిపై యీయనకు గౌరవం వుందా అన్నదానిపై సందేహం వుంది. ఎందుకంటే కెసియార్ యిటీవలే 'ఆంధ్రప్రాంతంలో పుట్టినవాళ్లందరూ రాక్షసులే' అన్నారు. ఒకసారి కాదు పదేపదే నొక్కి వక్కాణించారు. అప్పుడు యీ జయపాల్ మహాశయుడు ఒక్కసారి కూడా 'నాయనా కేసియారూ, అందరూ రాక్షసులు కాదు, ఒకటి రెండు మినహాయింపులు వున్నాయి' అని సరిదిద్దలేదు. ఆ మాట కొస్తే కెసియార్ తెలంగాణ కాంగ్రెసు వాళ్లను తిట్టినన్ని తిట్లు వేరెవరూ తిట్టలేరు. దద్దమ్మలతో మొదలుపెట్టి చాలాదూరం వెళ్లిపోయారు. అన్ని మాటలు పడినవాళ్లు పండితులో, పండితపుత్రులో, లేక పండితకుటుంబంలో పుట్టని ఒరిజినల్ శుంఠలో జయపాల్‌గారు చెప్పాలి. ఆయనా తెలంగాణ కాంగ్రెసు నాయకుడే కాబట్టి ఆ కాటగిరీ ఏమిటో ఆయన వంటి ఆత్మజ్ఞానికి బాగా తెలుస్తుంది.
జయపాల్‌గారు పెద్దమనిషిగా అందరి చేతా సంభావింపబడినవారు. ఇటీవలే యిరుప్రాంతాల నాయకుల్ని కూర్చోబెట్టి మధ్యవర్తిగా వ్యవహరించి సమన్వయం చేస్తానని ఆఫర్ కూడా యిచ్చారు. ఆయన అలా అన్నపుడు ఏ సీమాంధ్ర నాయకుడూ 'ఏడిశావులే' అనలేదు. ఆ మర్యాద అలా కాపాడుకోవాలంటే వృద్ధాప్యపు చాపల్యాన్ని జయించి, ఆ పెద్దమనిషి ముసుగు అలాగే కంటిన్యూ చేసుకోవాలి. విజయం ముంగిట వున్నవేళ సంయమనం పాటించాలని, ఓడినవారిని రెచ్చగొట్టకూడదనీ అందరికీ ఆయన చెపుతున్నారు. ఆ సంయమనం ఆయనా పాటించి అవతలివాళ్లని శుంఠలని, తెలివితక్కువ వాళ్లని వెటకారాలు ఆడకూడదు. వ్యంగ్యంగా మాట్లాడానని ఆయనను ఆయన బుకాయించుకున్నా సమయం, సందర్భం లేకపోవడం చేత ఆ వ్యంగ్యం విపర్య పరిణామాలకు, వ్యాఖ్యలకు దారి తీసింది. హ్యూమర్‌కి టైమింగ్ ముఖ్యం. అకాలవ్యంగ్యంతో జయపాల్‌గారు – ఉండవల్లి చెప్పినట్టు – కెసియార్ స్థాయికి పడిపోయారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)