‘ఈ సినిమా హిట్ అవుతుందా?’ ‘ఏముందండీ ఇందులో…?’ ‘ఎన్ని సినిమాల్లో చూసేసాం ఇదంతా’ ‘మరీ కిచిడీలా ఉంది. జనం చూస్తారంటారా?’ ఇవీ… ‘ఎవడు’ చూసినపుడు ఎక్కువ మంది విమర్శకులు వ్యక్తం చేసిన అనుమానాలు. ‘1’ని ఈ శతాబ్ధపు అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి అని లెక్కించే వాళ్లయితే తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇదే గతి… ఇలాంటివే మీకు దిక్కు అంటూ శపించేసారు. తమ అక్కసుని, కసిని తీర్చుకున్నారు. అయినా కానీ… ‘ఎవడు’ ఎందుకలా ఆడేస్తోంది. ఎప్పుడూ చూడని సినిమా చూసినట్టుగా ప్రేక్షకులు ఎందుకలా ఎగబడిపోతున్నారు? సంక్రాంతి పండక్కి కుటుంబ సమేతంగా ఎందుకని థియేటర్లపై అలా మూగిపోతున్నారు?
ఫేస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే కాంప్లెక్స్ సబ్జెక్ట్‌ని తీసుకుని దర్శకుడు దానిని వీలయినంత సింప్లిఫై చేసాడు. లాజిక్కుల జోలికి పోకుండా సినిమాని చూసేసేటట్టుగా వేగవంతమైన కథనంతో కట్టి పడేసాడు. ముఖం మార్చేస్తే… గొంతు ఎలా మారిపోయింది? అనేది ఎవరికైనా తట్టాల్సిన మొదటి ప్రశ్న. దానికి ఆన్సర్ కోసమని అతని వోకల్ కార్డ్స్ కూడా దెబ్బతిన్నాయని ఒక డైలాగ్ చెప్పించారు. అంటే వోకల్ కార్డ్స్ కూడా రీప్లేస్ చేసారని మనం అనుకోవాలి. కానీ మెడికల్‌గా అది ఇంపాజిబుల్. కళ్లని రీప్లేస్ చేసినట్టుగా, వోకల్ కార్డ్స్ మార్పిడి చేయడం జరగదు. ఇలాంటి లాజిక్స్ జోలికి పోతే ‘ఎవడు’ ఫార్సు వ్యవహారంలా అనిపిస్తుంది. అందుకే దర్శకుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా తన హీరోని కార్యోన్ముఖుడిని చేసి దుష్ట శిక్షణ కోసం వెంటనే పంపించేస్తాడు.
తన ప్రేయసి చనిపోవడానికి, తన ముఖం మారిపోవడానికి కారణమైన వారిపై హీరో వరుసగా పగ తీర్చుకోవడం ఫస్ట్ హాఫ్‌లోని మెయిన్ కంటెంట్. రెండో భాగంలో కామిక్ రిలీఫ్‌కి చోటు లేదని దర్శకుడికి తెలుసు కాబట్టి ఏమైనా కామెడీ ఉంటే గింటే ఇక్కడే ఉండాలని అతను రియలైజ్ అయ్యాడు. అందుకే ఈ రివెంజ్ సీన్స్ మధ్య బ్రహ్మానందాన్ని, ఓ హీరోయిన్ని ఇరికించాడు. అంత పగతో రగిలిపోతున్న వాడు తనకి చేటు చేసిన వాడు దొరికితే మంచీ చెడూ మర్చిపోయి దాడి చేసేస్తాడు. కానీ ఇక్కడ తాపీగా సినిమా షూటింగ్ నాటకం కూడా ఆడతాడు. లాజిక్‌కి అతీతమైన విషయమిది. కాకపోతే ఇంటెన్స్ రివెంజ్ సీన్స్ మధ్య రిలీఫ్ దొరుకుతోంది కాబట్టి ప్రేక్షకుడి తరఫునుంచి నో కంప్లయింట్స్. అన్ని హత్యలు చేసేసిన తర్వాత ఇక హీరోకి ఏం పని ఉంటుంది? కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అసలు చరణ్ ఎందుకు చనిపోయాడనే విషయం తట్టాలి. కానీ ఎక్కువమందిని ఆ దిశగా ఆలోచించకుండా చేయడం వల్ల ఇంటర్వెల్ ట్విస్ట్ పండింది.
చరణ్ చనిపోయాడు… ఇదైతే క్లియర్‌గా తెలుసు. కానీ ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఆసక్తిగా చూడ్డానికి కావాల్సిన లాక్ అయితే పడింది. ఇక ఆ సీన్ వరకు ఆసక్తి సన్నగిల్లకుండా కథని నడిపించే బాధ్యత దర్శకుడిది. ఇక్కడ్నుంచి కమర్షియల్ సినిమా సూత్రాల్ని తు.చ. తప్పకుండా ఫాలో అయ్యారు. ఒక బస్తీ, దానిపై కన్నేసిన ఒక రౌడీ, ఆ కారణంగా స్నేహితుడ్ని కోల్పోయిన హీరో.. విలన్‌తో హీరో కాన్‌ఫ్రంటేషన్‌కి కావాల్సిన ఫౌండేషన్ సరిగ్గా పడింది. అంతా ఎక్కడో చూసేసిందే. కానీ ఇల్లు కట్టడానికి ఎప్పుడూ అదే ఇసుక, అదే ఇటుక, అదే సిమెంట్ వాడాలి. అవి లేకుండా ఇల్లు కట్టడం అసాధ్యం. ఇక దానిని ఎంత అందంగా, ఎంత కొత్తగా మలచడం అనేది సదరు ఇంజినీర్ లేదా మేస్త్రీ సామర్ధ్యం. సినిమా కూడా అంతే. బేసిక్ ఎమోషన్స్ అన్నీ ఒకటే. వాటిని ఎంత బాగా వాడుకుని రక్తి కట్టించాడనేది దర్శకుడి ప్రతిభపై డిపెండ్ అవుతుంది. సినిమా రొటీన్‌గా సాగిపోతున్నా కానీ గ్రాఫ్ పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా ఏ క్షణంలో డౌన్ అయినా కానీ నిట్టూర్పులకీ, నీరసానికీ తావిచ్చినట్టే.
దర్శకుడు వంశీ పైడిపల్లి పతాక సన్నివేశం ముందు వరకు సినిమా గ్రాఫ్ పడిపోకుండా చూసుకున్నాడు. ఎమోషన్స్‌ని బాగా పండించి, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూసుకున్నాడు. ఫలితంగా క్లయిమాక్స్‌లో అసలు హీరో ఫైట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. క్లయిమాక్స్ పిచ్చ వీక్‌గా ఉంది. కానీ అప్పటికే పైసా వసూల్ అయిపోయింది. సోకాల్డ్ కామెడీ ఇందులోను లేదు. కానీ జనం ఎంటర్‌టైన్ అవుతున్నారు. కారణం… ఎమోషనల్‌గా తన కథలో, తన క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ని ఇన్‌వాల్వ్ చేసాడు దర్శకుడు.
సినిమా చూసేసి బయటకి వచ్చాక తిరిగి ఆలోచించుకుంటే… ‘అంతా ఎప్పుడో ఎక్కడో చూసేసిందే’ అనేది అర్థమవుతుంది. కానీ థియేటర్లో ఉన్నంతసేపు ఆ ఆలోచనలు రాకుండా బిగి సడలకుండా కథని నడిపాడు దర్శకుడు. తీసుకున్న పాయింట్‌ని విశ్లేషించుకుంటే, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే… అసలిది జరిగే పనేనా అనిపిస్తుంది. కానీ ఆ ఆలోచనలు రాకుండా, లాజిక్స్ గురించి పట్టించుకోకుండా ప్రేక్షకుడి మైండ్‌ని అరెస్ట్ చేయడం కూడా ఒక ఆర్టే. మెడికల్‌గా సాధ్యం కాని ఒక ఫిక్షన్ పాయింట్‌ని తీసుకుని దాని చుట్టూ కమర్షియల్ ఫార్ములాతో మాస్ ఎంటర్‌టైనర్ తీయడం, దానిని జనం యాక్సెప్ట్ చేసేట్టు చేయడం అనిపించినంత సులభమేం కాదు. బేసిక్స్ కరెక్ట్‌గా ఉంటే ఆపై కొన్ని తప్పులు పొరపాట్లు ఉన్నా కానీ ఫార్ములాని నమ్ముకున్నప్పుడు పాస్ అయిపోవచ్చు. ఇలాంటి సినిమాల్ని చిన్నచూపు చూడాలంటే కొత్తగా ఆలోచించే వాళ్లు స్ట్రాంగ్ ఛాలెంజ్ విసరాలి. కానీ వాళ్లెప్పుడైతే ఫెయిల్ అవుతారో… ఈ తరహా రొటీన్ ట్రీట్‌మెంట్‌కి ఏనుగంత బలం వచ్చేస్తుంది.
ఎవడు సక్సెస్‌కి దీనికున్న బలంతో పాటు ప్రత్యర్థి బలహీనత కూడా కలిసొచ్చింది. అందుకే ఈ చిత్ర విజయం ద్విగుణీకృతమైంది. అదే సమయంలో ఇదే చిత్రాన్ని మరింత పెద్ద రేంజ్‌కి చేర్చే అవకాశాన్ని కూడా ఎవడు రచయితలు, దర్శక బృందం చేజార్చుకుంది. ఫార్ములాని విడిచిపెట్టకుండానే కొంచెం తెలివిగా సన్నివేశాలు రాసుకున్నా, కాస్త కొత్తదనం చూపించినా ఈ చిత్రానికి అప్పీల్ మరింత పెరిగేది. ప్రథమార్థంలో ఆ రివెంజ్ సీన్స్ అన్నీ అంత ఫ్లాట్‌గా లేకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, ద్వితీయార్థంలో సింగిల్ ఎమోషన్ మాత్రమే కాకుండా ఇంకాస్త వేరియేషన్ చూపించినా కానీ దీని రెంజ్ పెరిగుండేది. సినిమా సక్సెస్‌కి ఎల్లలు లేకుండా చేయడం, ఒక పరిధికి పరిమితం చేయడం కూడా దర్శకుడి చేతిలోనే ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా… ఎవడు విజయం కూడా దర్శకుడు పిండుకున్న దాని మేరకే పరిమితమవుతుంది. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌కి దర్శకుడు కాస్త ఇంటిల్లిజెన్స్ జోడించి ఉంటే మరింత హెల్ప్ అయ్యేది. మొత్తానికి ఈ సంక్రాంతికి ఒక సినిమాలో తెలివితేటలు అవసరానికి మించిపోయాయి. ఒకదాంట్లో అవసరానికంటే తక్కువయ్యాయి. కాకపోతే ‘ఒకడు’ బేసిక్స్‌ని విస్మరించి పరాజయం పాలైతే… ‘ఎవడు’ మూలాల్ని మర్చిపోకుండా మూస బాటలో సక్సెస్‌ఫుల్‌గా గమ్యం చేరిపోయాడు.
– గణేష్ రావూరి