లోక్‌పాల్‌ బిల్లుకై సంతోషించాలా?

46 ఏళ్ల తర్వాత పాసయిన లోక్‌పాల్‌ బిల్లును కాంగ్రెసు, బిజెపి రెండూ ఆహ్వానించాయి. దానికై ఉద్యమించిన అన్నా హజారే సంతోషం వ్యక్తం చేశారు. ఆయన (ఒకప్పటి) శిష్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ దాన్ని జోక్‌పాల్‌ బిల్లు…

46 ఏళ్ల తర్వాత పాసయిన లోక్‌పాల్‌ బిల్లును కాంగ్రెసు, బిజెపి రెండూ ఆహ్వానించాయి. దానికై ఉద్యమించిన అన్నా హజారే సంతోషం వ్యక్తం చేశారు. ఆయన (ఒకప్పటి) శిష్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ దాన్ని జోక్‌పాల్‌ బిల్లు అన్నారు. ఈ బిల్లు అమలైతే పోలీసు కానిస్టేబుల్‌ కూడా ప్రధానమంత్రిని అరెస్టు చేసే పరిస్థితి ఏర్పడతుందని నిరసిస్తూ ములాయం వాకౌట్‌ చేశారు. ఇంతకీ యీ బిల్లు విషయంలో జరిగినదేమిటి? అన్నా అడిగినదేమిటి? అరవింద్‌ పట్టుబట్టినదేమిటి? ఫైనల్‌గా అందరూ సమ్మతించినదేమిటి?

ఈ విషయాలను క్లుప్తంగా పరామర్శిస్తే – లోక్‌పాల్‌ నియామకం గురించి చెప్పాలంటే అన్నా, అరవింద్‌ ఏడుగురు సభ్యుల కమిటీ ఎంపిక చేయాలన్నారు. ఫైనల్‌గా ఐదుగురు చాలని బిల్లు చెపుతోంది. ప్రధాని, చీఫ్‌ జస్టిస్‌, లోకసభ స్పీకరు, ప్రతిపక్ష నాయకుడు – యీ నలుగురూ కలిసి ఇంకో సభ్యుణ్ని ఎంపిక చేసి దేశాధ్యకక్షుడికి సిఫార్సు చేస్తారు. ఆయన దాన్ని ఆమోదిస్తాడు. 2011లోని డ్రాఫ్టు బిల్లులో ఐదో సభ్యుణ్ని దేశాధ్యకక్షుడే  నియమిస్తారని చెప్పారు. ఇప్పుడు యీ నలుగురికీ సిఫార్సు చేసే పని పెట్టారు. ఐదో సభ్యుడుగా ఎన్నికయ్యే వ్యక్తి పేరున్న న్యాయమూర్తి అయి వుండాలని షరతు పెట్టారు. ఈ ఐదుగురు కలిసి లోక్‌పాల్‌ని ఎంపిక చేస్తారు. లోక్‌పాల్‌కు రాజకీయ అనుబంధం వుండకూడదని అందరూ ఒప్పుకున్నారు. అలా ఎన్నికైన లోక్‌పాల్‌ 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి తను చైర్మన్‌గా వుంటాడు. 8 మంది సభ్యుల్లో సగం మంది న్యాయమూర్తులై వుండాలి. సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ, మహిళా సభ్యులై వుండాలి. ఏ సభ్యుణ్నయినా తీసేయాలంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలని అన్నా, అరవింద్‌ అంటే – కాదు, 100 మంది ఎంపీలు కలిసి ఫిర్యాదు చేస్తేనే తీసేయాలని బిల్లు అంది. సిబిఐ డైరక్టరు నియామకం సెంట్రల్‌ విజిలెన్సు కమిషన్‌ సిఫార్సుపై జరుగుతుంది కాబట్టి సిబిఐ పూర్తిగా ప్రభుత్వానికి లోబడి పనిచేయనక్కర లేదు. లోక్‌పాల్‌ చూస్తున్న కేసులను విచారిస్తున్న సిబిఐ అధికారులను లోక్‌పాల్‌కి చెప్పకుండా బదిలీ చేయడానికి వీల్లేదని బిల్లులో చెప్పారు. 

దేశానికి లోక్‌పాల్‌ ఏర్పడిన ఏడాదిలోగా రాష్ట్రాలన్నీ తమ స్థాయిలో లోకాయుక్తలను నియమించాలి. ఇలా నియమించి తీరాలన్న నిబంధన డ్రాఫ్టు బిల్లులో లేదు. రాష్ట్రాల యిష్టానికి వదిలేశారు. ఇప్పడు యీ బిల్లులో లోకాయుక్తలను నియమించాలి అన్నారు కానీ వాళ్లు లోక్‌పాల్‌ వ్యవహరించే తీరులోనే వ్యవహరించాలని నిబంధన పెట్టలేదు. పెట్టాలని అన్నా, అరవింద్‌ అడిగినా పెట్టలేదు. లోక్‌పాల్‌ ప్రజాధనం స్వీకరించే సంస్థలు, ట్రస్టులు అన్నీ లోక్‌పాల్‌ పరిధిలోకి వస్తాయి. వీరిపై ఎవరైనా ఫిర్యాదు చేసినా లోక్‌పాల్‌ లెక్కలోకి తీసుకోవచ్చని అన్నా, ఫిర్యాదు లేకపోయినా తనంతట తానే కేసు పెట్టవచ్చని అరవింద్‌ అంటే – ఫైనల్‌గా బిల్లులో 'యిరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే కేసు గురించి ఆలోచించాలని' వుంది. కేసు ఎంక్వయిరీ 6 వారాల్లో, ఇన్వెస్టిగేషన్‌ 6 నెలల్లో ముగించాలని అన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసినవారికి లక్ష రూపాయల జరిమానా వేస్తే చాలు అని అన్నా, అరవింద్‌ అంటే బిల్లులో ఏడాది జైలు కూడా చేర్చారు. తప్పుచేసినవారికి 10 ఏళ్ల శిక్ష వేయాలని అన్నా, అరవింద్‌ అంటే ఏడేళ్ల నుండి 10 ఏళ్ల వరకు అని బిల్లులో పెట్టారు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]