నేను కిరణ్ పట్ల వలపక్షం చూపిస్తున్నానని కొందరు అనుకుంటున్నారు. కిరణ్ స్థానంలో మిమ్మల్ని వూహించుకుని చూస్తే ఆయన పరిమితులేమిటో, సమైక్య ఉద్యమాన్ని నిర్వహించడం, అర్థవంతంగా మలచుకోవడం ఎంత కష్టమో అర్థమవుతాయి. అసలు సమైక్యఉద్యమం అన్నదే చాలా లేటుగా, బస్సు వెళ్లిపోయిన తర్వాత రెడ్ సిగ్నల్ వేసినట్టు మొదలైంది. అస్తవ్యస్తంగా నడుస్తోంది. ఒక్కోళ్లు ఒక్కోలా మాట్లాడతారు. హై కమాండ్ ఒక్కొక్కరికి ఒక్కోటి చెప్పి వారి చేత పలురకాలుగా మాట్లాడించి, విడగొట్టింది. కిశోర్ చంద్రదేవ్ రాయలసీమ విడగొట్టి పారేసి, వైజాగ్ రాజధాని చేయండి అంటారు, పోలవరం ప్రాజెక్టు అక్కరలేదంటారు. డొక్కా మాణిక్యం రాయల తెలంగాణ అంటారు, చిరంజీవి, కావూరి, పురంధరరేశ్వరి విభజించండి కానీ హైదరాబాదు యుటి చేస్తే చాలంటారు. పనబాక లక్ష్మి అయితే ఘోరాతిఘోరం. ఏమీ యివ్వకపోయినా ఫర్వాలేదు, అధిష్టానం ఏం చెపితే అదే అంటారు.
అధిష్టానం వారు రాయల తెలంగాణ పేరు చెప్పి సమైక్య ఉద్యమం తీవ్రంగా జరిగిన కర్నూలు, అనంతపురం జిల్లా నాయకులను వెర్రివాళ్లను చేసి ఆడించారు. పంచాయితీ సమితుల నుండి లేఖలు పట్టుకురమ్మనమని అధిష్టానం చెప్పగా వేలాది లేఖలు సేకరించి వెళితే 'అసలు రాయల తెలంగాణ అని ఎప్పుడు చెప్పాం?' అని అడిగారు చిదంబరం. ఈలోపుగా వాళ్లు 'మాకు తెలంగాణ వాళ్లతోనే బాంధవ్యం, కోస్తా వాళ్లతో పడలేం' అంటూ ప్రకటించి సమైక్యం నుండి దూరంగా జరిగిపోయారు – నీళ్లు, హైదరాబాదు దక్కించుకోవాలనే తాపత్రయంతో! తలో దిక్కుకి వెళ్లిపోయే యీ మందకు ఎవరైనా నాయకత్వం వహించగలరని అనుకుంటే అంతకంటె మూర్ఖత్వం వుండదు. ఇలాటి సైన్యంతో ఢిల్లీతో యుద్ధం చేయగలనని అనుకుంటే అతన్ని మరో డాన్ క్విక్సోట్ అనుకోవాలి. సమైక్య నినాదం యీ థలో యింత గట్టిగా వినబడుతోందంటే దానికి కారణం – సీమాంధ్ర ప్రజల చైతన్యమే. వాళ్లు కూడా రిప్ వ్యాన్ వింకిల్‌లా ఏళ్ల తరబడి నిద్రపోయి యిప్పుడు లేచారు. 'మన నాయకులు మహా గడుసువాళ్లు, ఏదో ఒకటి చేసి విభజన ఆపేస్తారు' అని విర్రవీగి, యిప్పుడు నడుం విరిగి, తమ నాయకులను తరిమేసి వాళ్లే ఉద్యమిస్తున్నారు. కానీ సకాలంలో పడని వర్షం ఫలాల్ని, ఫలితాలను యివ్వనట్టే యిదీ యిచ్చే సూచనలు లేవు.
ప్రజల ఆందోళనను అర్థం చేసుకుని, దాన్ని సరైన మార్గంలో దేశప్రజలకు కనబరిచే ప్రయత్నం చేస్తున్నారు కిరణ్. అంతకుమించి ఆయనా, నేనూ చేయగలిగేది ఏమీ లేదు. తెలంగాణ బిల్లు వచ్చినరోజునే అసెంబ్లీకి పంపడమేమిటి? వారం రోజుల తర్వాత పంపి వుండాల్సింది. బిల్లు కాపీలు కనబడకుండా ఎక్కడో దాచేయాల్సింది, కావాలనే ప్రొరోగ్ చేయించలేదు, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయకుండా వుండాల్సింది, ఏర్పాటు చేసినా తన సహచరుల చేత అల్లరి చేయించాల్సింది – యిలాటివన్నీ నేను గతంలో చెప్పినట్టు పెళ్లి ఆపడానికి సన్నికల్లు దాచేసే ప్రయత్నాలే! ఇలాటి కుటిలయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటారు. ఫలితం లేదు కూడా. విషయం లేనివాళ్లే యిలాటి పనులకు దిగజారతారు. అంతకంటె ధైర్యంగా బిల్లును చర్చించి, తిరస్కరించి పంపడమే హుందా అయిన పని.
తిరస్కరించిన తర్వాత కూడా బిల్లు పాస్ చేసేందుకు పార్లమెంటుకు హక్కు వుందని చిన్నపిల్లలకు సైతం తెలుసు. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం పార్లమెంటు వెళ్లనక్కరలేదు అన్నారు కానీ వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి తీరాలని కూడా అనలేదు. మెజారిటీ సభ్యులు వ్యతిరేకించారు అని రిజిస్టర్ కావడమే ముఖ్యం. ఎందుకు వ్యతిరేకించారు అన్నది పార్లమెంటు సభ్యులను విచారించి, పునరాలోచనలో పడేస్తుంది. వాళ్లు దీనిపై దృష్టి సారించి కావలసిన సవరణలు ప్రతిపాదించవచ్చు. ఎవరో కొంతమంది గోల చేసి అసెంబ్లీ నడవకుండా చేసినంత మాత్రాన మెజారిటీ సభ్యులు వ్యతిరేకించారన్నదానికి సాక్ష్యంగా దాన్ని చూపడానికి లేదు. వ్యతిరేకించేవాళ్లు కూడా దానికి సహేతుకమైన కారణాలు చెప్పాలి. మూకబలం వుంది కదాని మేం ఒప్పుకోం అని ఏకవాక్య తీర్మానం చేస్తే చాలదు. బిల్లు తిరక్కొట్టేస్తున్నాం అని మొండిగా వ్యవహరించినా బాగుండదు. బిల్లులో ఫలానా అంశాలు బాగా లేవు అని స్పష్టంగా చెప్పాలి.
'నేను వున్నంతకాలం విభజన జరగదు. విభజన జరిగితే నేనుండను.' అని కిరణ్ అనడంలో అర్థమేమిటి? విభజన ఖాయమైతే తను పదవి వదులుకుంటానని, లేదా తనను పదవిలోంచి పీకేస్తారని! ఆ ముచ్చట యీ నెలలోనే జరగబోతోందని అందరం అనుకుంటున్నాం. అందులో వింత ఏమీ లేదు. విభజన ఆపే విషయంలో ఆయనకు తన అధిష్టానంపై ఆశ ఏమీ లేదు. వెళ్లి నెత్తీ, నోరూ కొట్టుకున్నా వినడం లేదు. బిల్లును యీ థలో ఆపగలిగే సత్తా వున్నది బిజెపికి మాత్రమే! తెలంగాణకు కట్టుబడి వున్నాం అని రోజుకి మూడుసార్లు చెప్పే బిజెపి ఎందుకు ఆపుతుంది? ఏ పరిస్థితుల్లో ఆపుతుంది? సీమాంధ్ర ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని చాలా బాధ పడుతున్నారని, భయపడుతున్నారని, బిల్లుకి మద్దతు యిచ్చే వారందరినీ అసహ్యించుకుంటారని వాళ్లకు తోస్తే అప్పుడు 'మేం అధికారంలోకి వచ్చాక సవ్యమైన బిల్లు పెడతాం' అనే వాదనతో ప్రస్తుత బిల్లుకు ఆమోదం తెలపకుండా వుంటారు. బిల్లు వీగిపోతుంది.
అందువలననే కిరణ్ సీమాంధ్రులతో 'తుపాను ఆపలేను, విభజనను ఆపగలను – మీ సహకారం వుంటే..' అన్నారు. సహకారం అంటే బిల్లుపై స్తబ్దంగా వుండకుండా ఆందోళన చేయడం. ఆందోళన జరగడానికి తన చేతిలో వున్నదంతా చేశాడాయన. తెలంగాణ ఆందోళన పట్ల కఠినంగా వ్యవహరించినా, సమైక్య ఆందోళనను కిడ్గ్లవ్స్తో హేండిల్ చేశాడు. కేసులు పెద్దగా పెట్టలేదు. ప్రజలు పెద్దగా యిబ్బంది పడకుండా, టైమ్‌టేబుల్ ప్రకారం ఆందోళన చేస్తూ చాలాకాలం కొనసాగించారు. కానీ ఎంతచేసినా అధిష్టానం కదలకపోవడంతో ఎల్లకాలం ఆందోళన చేయలేరు కాబట్టి, ఆపడం జరిగింది. అసెంబ్లీలో చర్చ ఘాటుగా జరిగి, అనేక సవరణలు ప్రతిపాదిస్తే అప్పుడైనా సీమాంధ్రుల అసంతృప్తి లోకానికి వెల్లడవుతుంది. పార్లమెంటులో విభిన్న పక్షాలకు చెందినవారికి యిది మార్గసూచకంగా వుంటుంది. చర్చకు కావలసిన సమాచారాన్ని శాసనసభ్యులకు అందిస్తున్నారు. ఎవరేం మాట్లాడాలో రిహార్సల్స్ జరుతున్నాయి. ప్రణబ్ ముఖర్జీ యిచ్చిన వెసులుబాటుతో ప్రతీ సవరణపై ఓటింగు సౌకర్యం కూడా వుంది. ఫైనల్ బిల్లుపై ఓటింగు జరిగినా జరగకపోయినా, కనీసం ఎన్ని సవరణలు సవ్యంగా వున్నాయి, ఎన్ని అధ్వాన్నంగా వున్నాయి అన్నది తేటతెల్లమౌతుంది. ఇది ఒక ఆర్గనైజ్డ్, ఆర్కస్ట్రేటెడ్ ప్రొటెస్ట్లా తీర్చిదిద్దుతున్నారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)