45 ఏళ్లుగా చూస్తున్నా చిరంజీవి బోర్ కొట్టడం లేదు. సినిమా కోసం ఎంత కష్టపడతారో! ఆ గ్రేస్, డ్యాన్స్, ఎనర్జీ లెవెల్స్ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. చిరంజీవి బోర్ కొట్టడు కానీ, ఆచార్య బోర్ కొడుతుంది. నక్సలిజం, అమ్మవారి మహత్యం, గిరిజన సంక్షేమం, ఆయుర్వేదం అన్నీ ఉగాది పచ్చడిలా కలిపి వడ్డించారు. పచ్చడి నాలుక రుచికే తప్ప ఆకలి తీర్చడానికి కాదు. చిరంజీవి వీరాభిమానులు కూడా విజిళ్లకి బదులు హాహాకారాలు చేసే స్థితి.
నేను దశాబ్దాలుగా చిరంజీవి సినిమాలు ఫస్ట్ డే చూస్తున్నా. ఆయన సినిమా 30 శాతం థియేటర్ (ఎం క్యూబ్‌మాల్ అత్తాపూర్ ఉదయం 10-15 ఆట) ఖాళీగా ఉండగా చూసింది ఇదే మొదలు. ఎందుకో జనానికి ఆచార్య మీద ఆసక్తి లేదు.
సినిమా స్టార్టింగ్‌కి ముందు మహేశ్‌బాబు వాయిస్ ఓవరే అర్థం కాదు. ధర్మస్థలి, పాదఘట్టం, జీవధార, గుడి, అమ్మవారు ఇలా ఏదో మాట్లాడ్తాడు కానీ, కన్ఫ్యూజన్. సినిమా మొత్తం ఇదే. సాహోకి కూడా ఇలాగే వాయిస్ ఓవర్ వుంటుంది. చివరికి ఎవరు ఎవరికి డానో, ఎవరికి అనుచరుడో అర్థం కాక బాబోయ్ అని అరిచారు.
ఒక వూరు, ఒక విలన్. వాడిని ఎదిరిస్తే పీకలు కోస్తాడు. అమ్మవారి గుడి కూడా వుంటుంది. ఒక గురుకులం, దాంట్లో విద్యార్థులు కూడా వుంటారు. ఆ వూరి పేరు ధర్మస్థలి. అక్కడికి సమీపంలోని నదిని దాటితే పాదఘట్టం అనే ఇంకో వూరు. ఆ వూరు వాళ్ల దేవతే ధర్మస్థలి గుడిలోని ఘట్టమ్మ. పాదఘట్టం వాళ్లు (ఈ పేరు, ధర్మస్థలి పేరు ఒక వందసార్లు సినిమాలో వినపడుతుంది) విలన్ అరాచకాల్ని భరిస్తూ కూడా ధర్మస్థలికి ఆయుర్వేద వైద్యం చేస్తుంటారు.
గుడి ముందరే మర్డర్లు జరుగుతుంటాయి కాబట్టి అమ్మవారు తన మహిమ చూపి తీరుతుందని పూజారి తనకెళ్ల భరణి నమ్మకం. ఒకరోజు రానే వస్తుంది. ఆచార్య ధర్మస్థలికి వస్తాడు. కాకపోతే ఆయన నక్సలైట్ (ఇపుడైతే మావోయిస్టులని పిలవాలి. సినిమా కథా కాలం ఎప్పుడో తెలియదు. కొన్నేళ్ల క్రితం అనుకుంటే నక్సలైటే కరెక్ట్).
మతం మత్తు మందు అంటాడు మార్క్స్. మార్క్సిజం తాత్విక పునాది ఆధారంగానే నక్సలైట్ ఉద్యమం వచ్చింది. 1967లో డార్జిలింగ్ సమీపంలోని నక్సల్‌బరిలో మొదటి పోరు మొదలైంది. తర్వాత వాళ్లు అనేక గ్రూపులుగా చీలిపోయారు. మన ఆచార్య ఏ గ్రూపో తెలియదు. ఆచార్య ఆలయ రక్షణతో పాటు పాదఘట్టం రక్షణ కూడా చేస్తాడు.
పాదఘట్టంలోని ఖనిజ సంపదపై కన్నేసి వూరిని ఖాళీ చేయించాలనుకునే ఇంకో విలన్. రొటీన్ కథ, మొనాటనీ ఫైటింగ్‌లతో సాగుతున్న కథలోకి ఒక ఉపకథ కూడా వస్తుంది. అది రామ్‌చరణ్ కథ.
చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరూ చేసేది ఊరి సంరక్షణే. కనీసం వేర్వేరు కథలైనా కొంచెం ఆసక్తి వుండేది. విలన్ మనుషుల్ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతుల్లో కొట్టే సినిమాల్ని చాలా చూసేశాం. కథలో ఏదో కీ పాయింట్ మిస్ అయ్యింది. పూజాహెగ్డే పాత్ర ఎందుకుందో అర్థం కాదు. ఈ మధ్య వచ్చిన RRRలో ఆలియాలా మిగిలిపోయింది.
నక్సలైట్ల బృందం మధ్య రెజీనా ఐటం సాంగ్ కూడా ఉంది. ఆమె ఆడుతూ వుంటే ఎప్పటిలాగా మగాళ్లు ఆకలిగా చూస్తుంటారు. పాపం నక్సలైట్లు!
ఈ సినిమాని 3 భాగాలుగా వర్గీకరణ చేయొచ్చు.
1.నక్సలైట్లు – హీరో నక్సలైట్, చిన్న హీరో కూడా నక్సలైట్లలో చేర్చబడతాడు. హీరో కల్లు తాగి నక్సలైట్ బృందంతో ఐటం గర్ల్‌తో డ్యాన్స్ చేస్తాడు. ఇద్దరు హీరోలు ఐటం గర్ల్ లేకుండా ఇంకో డ్యాన్స్ చేస్తారు. తుపాకి కాల్పులు, ఫైట్స్ అదనం.
2.అమ్మోరితల్లి – పెద్ద ఆలయం, విగ్రహం, భజన బృందంతో పాట, రథోత్సవం, పల్లకీసేవ, చివర పౌర్ణమి పూజ క్లైమాక్స్.
3.ఆయుర్వేదం – మందుల తయారీ, మందుల కల్తీ, శత్రువుకైనా వైద్యం చేయడం
సెట్టింగులు, గడ్డాలు, మీసాలున్న బోలెడు మందిని ఫ్రేమ్‌లో నిలబెట్టడంతో పాటు కథాకథనాలపై కొంచెం శ్రద్ధ పెడితే ఎమోషన్ పండేది. కొరటాల శివ సమర్థుడే కానీ, అనవసరంగా నక్సలిజాన్ని మెడకి తగిలించుకుని బుల్లెట్ లేని తుపాకీని పేల్చాడు.
జీఆర్ మహర్షి