పంచేయండి భూములు.. రైతులవేగా

కబుర్లు వినడం కాదు, ఊహించుకోవడం కాదు. ఒక్కసారి ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి, లేదా ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడి రేట్లను పరిశీలించండి. వైట్ కార్డు వాళ్లకి తక్కువ రేట్లకు చేస్తారు…

కబుర్లు వినడం కాదు, ఊహించుకోవడం కాదు. ఒక్కసారి ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి, లేదా ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడి రేట్లను పరిశీలించండి. వైట్ కార్డు వాళ్లకి తక్కువ రేట్లకు చేస్తారు అనే విషయాన్ని అలా వుంచి మిగిలిన వారికి అందించే చికిత్సల రేట్లు, పరీక్షలకు వసూలు చేసే ఫీజులు, రూమ్ రెంట్లు వగైరా అన్నీ, అన్నీ ఒక్కసారి తెలుసుకోండి.

మహా మహా కమర్షియల్ ఆసుపత్రులకు ఇవేమన్నా తీసిపోతాయా? లేదా? అన్నది పరిశీలించండి. అప్పుడు అర్థం అవుతుంది. అసలు విషయాలు అన్నీ. ఈ సంస్థలనే కాదు, ప్రభుత్వ సహాయం పొందుతున్న లేదా ప్రభుత్వం దగ్గర నుంచి భూములు పొందుతున్న సంస్థల వ్యవహారాలు అన్నింటిపై ఓ స్వచ్ఛంధ నివేదికను తయారు చేయించండి.

మధ్య తరగతి ప్రజలకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయేమో పరిశీలించండి. అప్పుడు తెలుస్తుంది ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో? అదే విధంగా ఇలాంటి సంస్థలన్నీ పొందుతున్న విరాళాలు, వస్తున్న ఆదాయాలు, పెడుతున్న ఖర్చులు, మిగులుతున్న లాభాలు వంటి వాటిని బహిరంగంగా వెల్లడించమనండి.

ఎందుకంటే ఇలాంటి సంస్థలు ప్రభుత్వాల నుంచి సహాయాలు పొందుతున్నాయి కాబట్టి, ప్రతీదీ ప్రజలకు తెలియచేయాల్సి వుంది. హైదరాబాద్ లో భూములు తీసుకున్నాయి. విజయవాడలో తీసుకున్నాయి, విశాఖలో తీసుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అమరావతిలో తీసుకుంటున్నాయి. గోపీచంద్ అకాడమీ కావచ్చు, కిమ్స్ ఆసుపత్రి కావచ్చు ఇలా ప్రభుత్వ భూములు పొందుతున్న సంస్థలు ఎన్నో.

కొత్తగా అమరావతి దగ్గర ప్రభుత్వం నామినల్ ధరలకు స్థలాలు కేటాయిస్తున్న వివరాలు కొన్ని చూడండి.

ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి 125ఎకరాలు – కిమ్స్ ఆసుపత్రి 40ఎకరాలు – ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రి 20ఎకరాలు – బిఆర్ శెట్టి మెడికల్ కాలేజీ 100ఎకరాలు – పుల్లెల గోపీచంద్ అకాడమీ 12ఎకరాలు.

ఇలా ఎకరాలు ఇవ్వడం వల్ల మధ్యతరగతి ప్రజానీకానికి ఒరిగింది ఏమిటి? వాళ్లకు వ్యాపారాలు జరిగి, రాజధాని దగ్గర జనం కళకళ లాడతారు అంటే సరే అనుకోవచ్చు. కానీ ఇలా తక్కువ ధరలకు రైతుల భూములు వాళ్లకు కట్టబెట్టడం వల్ల జనానికి ఒరిగేది ఏమిటి?