స్వతంత్ర్య భారతదేశానికి నాందీప్రస్తావన చేసిన కాంగ్రెస్ పార్టీ, చరిత్ర మరువని నాయకుల్ని ప్రపంచానికి పరిచయం చేసిన కాంగ్రెస్ పార్టీ, భారత చరితేతిహాసపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రస్థానం గల కాంగ్రెస్ పార్టీ నేడు దయనీయ స్థితిలో డీలాపడింది.
దుష్యంతుడి సంతానమైన భరతుడితో మొదలైన మహాభారతకథ శ్రీకృష్ణుడు వంటి ఇతిహాసపురుషుడి కథ చెప్పి, ఎన్నో గొప్ప కథలు దాటి జనమేజయుడి దగ్గర ఆగినట్టు…గాంధీ, నెహ్రూలతో మొదలైన కాంగ్రెస్ కథ ఎన్నో విజయాలు దాటుకుని ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఆగింది. ఇది అంతమేనా? ఇంకా కాంగ్రెస్ కథ ఉందా అంటే ఏం చెప్పగలం!
మొన్నటికి మొన్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ అందులో భాగంగా తాను కాంగ్రెసులో చేరుతున్నాడన్న వార్త పెద్ద విషయంగా చలామణీ అయింది. అదేదో పార్టీ భవితవ్యాన్ని మారుస్తుందని కొందరు సో కాల్డ్ మేథావులు కూడా నమ్మారు. మొత్తానికి ఆ ప్రతిపాదన వీగిపోయినా అసలు కాంగ్రెస్ కి కావల్సింది ప్రశాంత్ కిషోర్ లాంటివాళ్లా?
ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే కాంగ్రెస్ తొలి రోజుల్లోకి తొంగి చూడాలి.
అసలా పార్టీకి అంతటి గౌరవం, ప్రజాభిమానం రావడానికి గల కారణం అదొక పోరాటయోధుల పార్టీ కావడం. గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్ ఇలా అందరూ జైలు కూడు తిన్నవాళ్లే. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎటువంటి సోషల్ మీడియా లేని రోజుల్లోనే దేశం మొత్తానికి వినిపించేలా స్వతంత్ర భేరి మోగించి చైతన్యాన్ని నింపిన వారే. తమని కొట్టినా, తిట్టినా, బ్రిటీష్ పోలీసులు లాఠీలు ప్రయోగించినా శాంతియుతంగా పోరాడి ప్రత్యర్థుల మెడలు వంచినవారే.
ఒకరు కాదు ఇద్దరు కాదు…అందరూ యోధులే. వారు వేసిన పునాదుల మీద లేచిన పార్టీ ఇన్నాళ్లుగా నిలబడింది.
ఇప్పుడు మళ్లీ అటువంటి యోధుడు కావాలి. ఉన్నాడా? రోడ్డు మీద పొడుకుని ప్రజాప్రయోజనార్థమైన ఉద్యమాలు చేయగలిగే నాయకుడున్నాడా? ప్రస్తుతానికైతే కనిపించట్లేదు.
ఇప్పుడు కనిపిస్తున్నదల్లా సెంటు కొట్టుకుని ఏసీ గదుల్లో కూర్చుని పార్టీ మీటింగుల్లో ప్రత్యర్థిని పడగొట్టడానికి గెరిల్లా యుద్ధం ఎలా చేయలన్న పథకాలు రచించేవారే. వారివల్ల దేశం కాంగ్రెస్ వైపు చూస్తుందా? ఎందుకొచ్చిన భ్రమలు?!
కేవలం వ్యూహాలతో పనులు జరగవు. 2014లో వ్యూహకర్త సాయం తీసుకున్నా నరేంద్రమోదీ తన వాక్చతుర్యంతో కాంగ్రెస్ పాలనపై ఉద్యమాన్ని నడిపాడు. దానికి దేశం యావత్తూ కదిలింది. అటువంటి వక్త ఇప్పుడు కాంగ్రెసులో ఎక్కడ?
2014-19 వరకు ఆంధ్రప్రదేశులో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థుల చేతుల్లో దెబ్బ తింటూనే ఉన్నాడు. “కొట్టారు..కొట్టించుకున్నాం..మాకు టైమొస్తుంది..తిరిగి కొడతాం” అంటూ తన ఉద్యమాన్ని మరింత జోరుగా నడిపాడు తప్ప కాలయాపన చేయడమో, దాసోహమనడమో చేయలేదు. అందుకే తిరుగులేని మెజారిటీతో సీయమ్మయ్యాడు.
ఇక్కడ చెప్పేదేమిటంటే కాంగ్రెసుకి ఒక యోధుడు కావాలి. ఆ లక్షణాలు రాహుల్ గాంధీలో కానీ, ప్రశాంత్ కిషోర్ లో కానీ, కపిల్ సిబాల్ లో కానీ, శశి థరూర్ లో కానీ బూతద్దమేసి చూసినా లేవు. కనుక కాంగ్రెస్ గతి అధోగతే. ఏదో మహత్యం జరిగితే తప్ప పునరుత్థానం మాట సత్యదూరమే.
– హరగోపాల్ సూరపనేని