కడపలో బలప్రదర్శనకు షర్మిల ప్లాన్!

అందరూ అనుకున్నట్టే వైఎస్ షర్మిల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథి అయ్యారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు గురించి అధిష్ఠానం పెట్టుకునే అంచనాలను అందుకోవడం ఆమెకు ఇప్పుడు కత్తిమీద సాము. అందుకు ఆమె…

అందరూ అనుకున్నట్టే వైఎస్ షర్మిల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథి అయ్యారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు గురించి అధిష్ఠానం పెట్టుకునే అంచనాలను అందుకోవడం ఆమెకు ఇప్పుడు కత్తిమీద సాము. అందుకు ఆమె చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితం దక్కుతుందో లేదో తెలియదు. అందులో మొదటి అడుగుగా.. వైయస్ షర్మిల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తనకు అపారమైన బలం ఉన్నది అని నిరూపించుకునే ప్రయత్నంలో పడుతున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సాంప్రదాయ పద్ధతినే పాటించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లోని తనకంటే సీనియర్లు అయిన నాయకులు కూడా పీసీసీ సారథిగా తన నాయకత్వాన్ని ఆమోదించి, లొంగి నడచుకోవాలంటే… పెద్దస్థాయిలోనే బలప్రదర్శన అవసరం అని ఆమె అనుకుంటున్నారు. అందుకోసం తమ కుటుంబానికి పట్టున్న కడప జిల్లాని బలప్రదర్శనకు తొలి వేదికగా మార్చుకోబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

పీసీసీ సారథిగా బాధ్యతలు స్వీకరించే ముందు వైఎస్ షర్మిల తొలుత ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సార్ సమాధిని దర్శించుకుని, ఆయనకు నివాళి అర్పించి తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. ఆ సందర్భంలో కడపకు వచ్చినప్పుడే భారీస్థాయిలో బలప్రదర్శన, విమానాశ్రయంలోని భారీ ఎత్తున స్వాగతం, వందల వాహనాలు, వేలకొద్దీ అభిమానుల సందోహంతో ప్రదర్శనగా ఇడుపులపాయకు వరకు వెళ్లడం వంటివి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కడప జిల్లాకు చెందిన వారే. కడప జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ మొత్తం జగన్ వెంట వెళ్లిపోయినప్పటికీ.. ఇంకా ఆనవాళ్లుగా మిగిలిన వారు కొందరున్నారు. వారందరినీ కూడా బలసమీకరణలో కలుపుకుంటున్నారు.

అలాగే కేవలం కడప జిల్లానుంచి మాత్రమే కాకుండా.. ఈ సందర్భంలో పొరుగున ఉన్న చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేయడానికి వ్యూహరచన సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే.. షర్మిల కడపకు వచ్చే సందర్భమే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవ స్థితి రాబోతున్నదని అభిప్రాయం కలిగించేలా ఉండాలని వారు ప్లాన్ చేస్తున్నారు.

ఒక కార్యక్రమానికి జనసమీకరణ పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ.. ఎన్నికల్లో విజయం అంత ఈజీగా దక్కుతుందా అనేదే ప్రజల సందేహం.