అమెరికా చదువంటే ఒకప్పుడు చాలా గొప్ప. ఊరికి ఒకరో ఇద్దరో అన్నట్టుగా ఉండేది. వాళ్లు అమెరికా వెళ్తున్నారంటే పెద్దవార్త. అమెరికా నుంచి సెలవలకి వచ్చారంటే చంద్రమండలం నుంచి వచ్చిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని చూడ్డానికి వెళ్లినట్టు వెళ్లేవారు. అయితే అదంతా దశాబ్దాల క్రితం నాటి మాట. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.
ఇంజనీరింగ్ కాలేజీలకి అటానమస్ స్టేటస్ ఎప్పుడైతే వచ్చేసిందో, ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పుడైతే వెలసాయో ముందుగా ఇంజనీరింగ్ అంటే చీపైపోయింది. ఒకప్పటికి బీకాం చదువుకి ఇప్పటి ఇంజనీరింగ్ చదువుకి పెద్ద తేడా కనిపించడం లేదు.
ఎంసెట్లో ఏ ర్యాంకొచ్చినా ఎక్కడో అక్కడ సీటైతే వచ్చేస్తోంది. డబ్బుండి కొనుక్కోగలిగితే చెత్త ర్యాంకొచ్చినా ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోవచ్చు.
ఇదొక ఎత్తైతే ఇదివరకు ఇంజనీరింగ్ పాసవ్వడమే కష్టంగా ఉండేది. ప్రెజర్ తట్టుకోలేక,మార్కులు రాక మధ్యలో డ్రాపౌట్లయ్యే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉండేవాళ్లు. ఇప్పుడలా కాదు. మూడో ఏడు వరకూ బ్యాక్ లాగులున్నా నాలుగో ఏట అన్నీ గట్టెక్కేసే మార్గాలు కూడా చూపుతున్నాయి పలు కాలేజీలు.
ఆ విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా కలల్ని సాకారం చేసుకోవాలనుకునే వాళ్లే అగ్రభాగం విద్యార్థులు, వారి తల్లిదండ్రులూను! అయితే ఆ కలలు పీడకలలు కావడానికే ఇప్పుడు చాన్సెక్కువగా ఉంది.
ఏదో రకంగా ఇంజనీరింగ్ గట్టెక్కిన వాళ్లకి ఇండియాలో ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకంటే మంచి కాలేజీ అయ్యుండి అందులో మంచి స్కోర్లు వస్తే తప్ప క్యాంపస్ ప్లేస్మెంట్లు రావు. పోనీ కాలేజీ అటు ఇటు అయినా మంచి పర్సెంటేజ్ లేకపోతే ఒక మోస్తరు కంపెనీలో జాబ్స్ లేవు. అందుకే ఏదో ఒకటి చేసి ఎడ్యుకేషన్ పేరుతో అమెరికా చెక్కేస్తే ఇక అక్కడే ఉద్యోగం దొరికేస్తుందనే పగటి కలలు కంటున్నారు పాపం చాలామంది.
తప్పులేదు…తమ పిల్లలు అమెరికాలో స్థిరపడి డాలర్లు సంపాదించాలనుకోవడం మంచి కోరికే!!
తమ ఇరుగు పొరుగు వారిలాగానో, బంధువుల పిల్లల్లాగానో తమ పిల్లలు కూడా “అమెరికా విద్యార్థులు” అనిపించుకోవాలని తల్లిదండ్రులు అనుకోవచ్చు!!
కానీ ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన లేకుండా ఆ కలల్ని కనడం పొరబాటే అవుతుంది.
అమెరికా యూనివర్సిటీ నుంచి సీటొచ్చేస్తే తమ పిల్లల్ని అద్భుతమైన విద్యార్థులుగా అమెరికా గుర్తించిందని అస్సలు సంబరపడక్కర్లేదు. అసలది ఏ యూనివర్సిటీయో, ఏ కాలేజో తెలుసుకోవాలి. అలాంటి కాలేజీల్లో ఎలాంటి జంక్ విద్యార్థులు చేరతారో అవగాహన ఉండాలి. అవకతవక కాలేజీల్లో అడ్మిషన్ అంటే గతంలో స్టూడెంట్ వీసా దొరికేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. అమెరికాకి విద్యార్థుల ఫీజుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని వదులుకోలేక ప్రతి అడ్మిషన్ కి ఇంచుమించు వీసా ఇచ్చేస్తోంది అమెరికన్ కన్సులేట్.
కానీ అసలు కష్టాలు అమెరికాలో దిగాకే మొదలవుతాయి. తాజా పరిణామాలైతే మరీ దారుణంగా ఉన్నాయి. అమెరికాలో చాలా చోట్ల గంజాయి వాడకాన్ని లీగలైజ్ చేసారు. ఎడిబుల్స్ పేరుతో చాక్లెట్ల రూపంలో ఉండే గంజాయి బిళ్లలని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అదేంటో ఒకసారి రుచి చూద్దామని కొని డోసేజ్ తెలీక ఎక్కువ వేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నవాళ్లున్నారు.
కొందరైతే డ్రగ్స్ వల్ల మైండ్ పాడయ్యి ఉన్మాదంలోకి దిగుతున్నారు. కొందరు ఈ డ్రగ్ ప్రభావంలో ఏ కార్ డ్రైవింగో చేసి ప్రమాదానికి గురౌతున్నారు.
ఇదంతా ఒకెత్తైతే చెడు సావాసాలతో చేయకూడని పనుల్లోకి కూడా దిగుతున్నారు. సంపాదన కోసం ఆడ, మగ తేడా లేకుండా తప్పుదోవ పడుతున్న భారతీయ విద్యార్థులుంటున్నారనే సత్యాన్ని విస్మరించకూడదు.
ఈ విద్యార్థుల్ని అక్కడ ఉన్న కొన్ని తెలుగు కన్సెల్టన్సీ కంపెనీలు అవాంఛనీయ కార్యకలాపాలకి, ఫేక్ జాబ్స్ కి వాడుకుంటున్నారు. దొరికితే వీళ్లని కటకటాల వెనక్కి పంపి వాళ్లు చేతులు దులిపేసుకుంటారు. ఈ ప్రమాదాల మీద గతంలో నే ఒక వీడియో చేయడం జరిగింది గ్రేటాంధ్రా.
https://www.youtube.com/watch?v=3DkeoeYx0Ns&t=20s
ఒకప్పుడు ధనికులకే పరిమితమైన అమెరికా చదువు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఫెసిలిటీల వల్ల సమాన్యుడికి కూడా ఈజీ అయిపోవడంతో అది పురోగతి అనుకుంటున్నారు .కానీ తిరోగతికి, అధోగతికి కారణమవ్వబోతున్నాయి చదువు పేరిట చేస్తున్న పలు అమెరికా ప్రయాణాలు.
వెళ్లిన విద్యార్థులు పై కారణాల వల్ల ఇబ్బందుల్లో పడడం ఒకెత్తైతే, చదువు పూర్తైనా ఉద్యోగం రాక..దాంతో మరో కోర్సుకి ఫీజు కట్టి విద్యార్థిగా కొనసాగుతూ ఆడ్ జాబ్స్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. నాలుగేళ్ళైనా ఇంటికి రాని పిల్లలు ఎందరో ఉన్నారు ఇండియాలోని తల్లిదండ్రులకి. ఉద్యోగం వచ్చినా ఏదో టెంపరరీ జాబ్ వచ్చి మూడు నాలుగు నెలల్లో ఊడిపోయేవి వస్తున్నాయి.
అమెరికాకి వెళ్లేదే డాలర్ల మీద మోజుతో కాబట్టి జాబ్ రావట్లేదన్న ఫ్రస్ట్రేషన్లో కొందరు పిల్లలు తప్పుడు పనులకి కూడా సిద్ధపడిపోతున్నారు. పిలల్లు ఆ పరిస్థితుల్ని తల్లిదండ్రులకి చెప్పరు కానీ తెలిస్తే వాళ్ల హృదయాలు పగులుతాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే గల్ఫులో తెలుగు కూలీల కష్టాల గురించి పలు వార్తలొచ్చేవి. ఇప్పటికీ అడపా దడపా వింటూంటాం. అలాంటి వార్తలు ఇప్పుడు అమెరికాలో తెలుగు విద్యార్థుల గురించి వినాల్సొస్తోంది.
అమెరికాలో ల్యాండయ్యి నెల తిరగకుండానే ఇద్దరు తెలుగు విద్యార్థులు తమ ఇంట్లోనే ప్రాణాలు విడిచారు. కారణాలేమైనా సరే అది ఇండియాలోని తల్లిదండ్రులకి ఎంత గుండెకోత! తమ వద్ద ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని వాళ్లు అనుక్షణం వేదన చెందుతూనే ఉంటారు కదా! మంచి భవిష్యత్తు కోసం కోరి అమెరికాకి పంపి, నెల పూర్తవకుండా కొడుకు మృతదేహం కోసం వేచి చూడడం ఎంతటి హృదయవిదారకం!
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అమెరికా పంపే దాకా ఆరాటపడుతున్నారు. తర్వాత ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా ఉలిక్కిపడి పిల్లల క్షేమం కోసం హైరానపడుతున్నారు.
నిజానికి మొన్నటి వరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం అమెరికా వెళ్లిన ఐదుగురిలో ఒక విద్యార్థికి ఉద్యోగం దొరకడం కూడా కష్టమే! ఆ ఐదుగురిలో ఒకడు తమ సంతానమే ఉంటుందని తల్లిదండ్రులు ఊహించుకోవడం సరికాదు. తమ పిల్లల టాలెంటెంతో ముందుగా బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ వలయంలో చిక్కుకుని ఎప్పుడో అప్పుడు ఇండియా తిరిగొచ్చి పుచ్చుకున్న ఎడ్యుకేషన్ లోన్ తీర్చడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది పిల్లలకి.
ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా చదువు ఇప్పుడు రిస్కే! కేవలం టాప్ స్కోర్లు తెచ్చుకుని టాప్ 50 యూనివర్సిటీల్లో హై డిమాండున్న డిగ్రీలు చదివే మెరిట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాంపిటీషన్ ఆ రేంజులో ఉంది.
గాలివాటంగా చదివేసి, గుంపులో గోవింద కింద అమెరికా వెళ్లిపోవాలనే కలల కంటే ఉన్న చోటే చక్కగా చదువుకుని మంచి ఎమ్మెన్సీలోనో, కనీసం ఒక మోస్తరు కంపెనీలోనో జాబ్ సంపాదిస్తే నెమ్మదిగా కంపెనీ ఖర్చుతో ఆన్సైట్ వర్క్ మీద అమెరికా వెళ్లే కల తీర్చుకోవచ్చు.
ఆ మార్గాన్ని వదిలి చదువు కోసం అమెరికా వెళ్లడం అందరు విద్యార్థులకి సరైన నిర్ణయం అనిపించుకోదనే సత్యాన్ని గ్రహించాలి.
హరగోపాల్ సూరపనేని