జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థికి చిక్కులు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ వీఎం థామ‌స్‌కు చిక్కులు త‌ప్పేలా లేవు. థామ‌స్ క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించార‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు శుక్ర‌వారం వెలుగు చూశాయి. దీంతో అత‌నికి ఎస్సీ…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ వీఎం థామ‌స్‌కు చిక్కులు త‌ప్పేలా లేవు. థామ‌స్ క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించార‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు శుక్ర‌వారం వెలుగు చూశాయి. దీంతో అత‌నికి ఎస్సీ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌ద‌ని కొన్ని హిందూ సంఘాలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. వీరి పోరాటానికి బ‌లం చేకూర్చేలా త‌మిళ‌నాడులో థామ‌స్ మ‌త‌మార్పిడికి సంబంధించిన గెజిట్ ఆధారాలు ల‌భ్య‌మైన‌ట్టు చెబుతున్నారు.

వడింగాడు ప్రకాశ్‌ కుమారుడైన వడింగాడు మునస్వామి అయిన తాను క్రిస్టియన్ మతం స్వీకరించి వి ఎం థామస్ గా పేరు మార్చుకున్నారు. 2011 జూన్ 10న‌ మతము, పేరు మార్చుకున్నట్టు, 2012 అక్టోబర్ 17 న తమిళనాడు ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించారు. తాను 1974 జూన్ 28 న చెన్నైలో జన్మించినట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. మతం మార్పిడిపై కొందరు విమర్శలు చేయటంతో ఆయ‌న‌ జాగ్రత్త పడ్డారు.

ఈ నేప‌థ్యంలో 2024 ఫిబ్రవరి 23న వీఎం థామస్ అయిన తన పేరును వడింగాడు మునస్వామి థామస్‌గా పిలువ వచ్చని మళ్ళీ గెజిట్ లో ప్రకటించారు. దీనిని అడ్డం పెట్టుకుని తాను గెజిట్ లో పేరు మాత్రమే మార్చుకున్నానని, మతం మార్చుకోలేదంటూ ఆయ‌న బుకాయించార‌ని ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. చివ‌రికి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులకు కూడా త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. క్రైస్తవ మతం స్వీకరించిన ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని జై హింద్ పార్టీ నాయకుడు అక్కిలిగుంట మధు హై కోర్టులో కేసు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చిత్తూరు కలెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

థామస్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. థామస్ వ్యవహారం జిల్లాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నామినేష‌న్ల ప‌రిశీల‌న స‌మ‌యంలో ఆధారాల‌న్నీ స‌మ‌ర్పించి ఆయ‌నపై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు అధికార పార్టీ ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకెళుతోంది.