ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికే పార్సిల్ …!

పక్కా లోకల్ నే ఎపుడూ గెలిపించే అనకాపల్లి ఎంపీ సీట్లో ఎన్నో జిల్లాలు దాటుకుని టీడీపీ కూటమి తరఫున సీఎం రమేష్ వచ్చి పోటీ చేస్తున్నారు. బీజేపీకి  బలం లేని చోట ఆయన జెండా…

పక్కా లోకల్ నే ఎపుడూ గెలిపించే అనకాపల్లి ఎంపీ సీట్లో ఎన్నో జిల్లాలు దాటుకుని టీడీపీ కూటమి తరఫున సీఎం రమేష్ వచ్చి పోటీ చేస్తున్నారు. బీజేపీకి  బలం లేని చోట ఆయన జెండా పాతాలని చూస్తున్నారు. ఆయన ఏమైనా లోకల్ నా ఆయనకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎల్లలు తెలుసా అంటున్నారు ప్రత్యర్ధులు. ఆయనకు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సమస్యలు ఏమైనా తెలుసా అంటున్నారు వైసీపీ నుంచి అనకాపల్లికి ఎంపీగా పోటీ చేస్తున్న ప్రత్యర్ధి బూడి ముత్యాలనాయుడు.

కనీసం పేరు పెట్టి ఒకరిద్దరిని అయినా ఆయన పిలవగలరా అని సవాల్ చేస్తున్నారు కూటమి ఎందుకో తెలియదు కానీ ఆయనను పోటీకి దించింది. బీజేపీ వీక్. క్యాండిడేట్ నాన్ లోకల్. ఎపుడూ బీసీలను గెలిపించే సీటులో ఓసీని పోటీకి దించి రాజకీయ సామాజిక ప్రాంతీయ సమీకరణలను అన్నింటినీ కూటమి పక్కన పెట్టేసింది అని అంటున్నారు.

అందుకే వైసీపీ అభ్యర్ధి బూడి ధీమాగా ఉన్నారు. తన విజయం ఖాయమని ఆయన అంటున్నారు. ఎంపీగా నెగ్గేది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కానీ పదవి కోసం కానే కాదని ఆయన అంటున్నారు. సీటు గెలవాలన్న ఆరాటం తప్ప కూటమికి వేరే లక్ష్యం లేదని అన్నారు.

తన ప్రత్యర్ధి సీఎం రమేష్ ది ధన బలం అని ఆయన విమర్శించారు. ఆయన దాన్ని చూసుకుని అనకాపల్లి దాకా వచ్చారని సెటైర్లు వేశారు. ఆయనకు ధన బలం ఉంటే తనకు జన బలం ఉందని ఆయన చెప్పారు. తానేంటో అనకాపల్లి ఎంపీ పరిధిలోని ప్రజలు అందరికీ తెలుసు అన్నారు.

తనను జెడ్పీటీసీ నుంచి అంతా చూస్తున్నారు అని ఆయన అంటున్నారు. తన రాజకీయ జీవితం ఒకేసారి ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేదని ఆయన అన్నారు. ఎన్నో మెట్లు ఎక్కి ఆ స్థానానికి చేరుకున్నాను అన్నారు.

తన ప్రతీ విజయం వెనక ప్రజలు ఉన్నారని అన్నారు. ఎంపీగా కూడా తనను గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బూడి ఎపుడూ ఏ ఎన్నికల్లోనూ ఓటమి పాలు కాలేదు. ఆయనకు ఆ పేరు ఉంది. ఎంపీగా కూడా ఆయన విజయం తధ్యమని అంటున్నారు. బూడి అయితే సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పార్సిల్ చేసి పంపిస్తామని అంటున్నారు. అనకాపల్లిలో ఢీ అంటే ఢీగా మారిన ఎంపీ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఓసీ, బీసీ కార్డుల మధ్యనే అసలైన పోరు సాగనుంది అంటున్నారు.

నియోజకవర్గం సమస్యలు తెలిసిన వారిని పోటీకి పెట్టాలి కానీ ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుని పోటీ చేయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కూటమికి అదే అసలైన షాక్ గా మారుతుందని అంటున్నారు.