టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాద ఘంటికలు?

రాజకీయాల్లో అంచనాలు చాలా సార్లు తప్పుతూంటాయి. తప్పకుండా గెలుస్తామన్న సీటు చేజారవచ్చు. దానికి అతి ధీమా ప్రధాన కారణం. అంతా బాగుంది అనుకుంటే తెలియకుండా ఏదో మూల నుంచి లోటు కనిపిస్తుంది. అదే కొంప…

రాజకీయాల్లో అంచనాలు చాలా సార్లు తప్పుతూంటాయి. తప్పకుండా గెలుస్తామన్న సీటు చేజారవచ్చు. దానికి అతి ధీమా ప్రధాన కారణం. అంతా బాగుంది అనుకుంటే తెలియకుండా ఏదో మూల నుంచి లోటు కనిపిస్తుంది. అదే కొంప ముంచుతుంది.

అందుకే రాజకీయాల్లో అప్రమత్తత చాలా అవసరం. అయితే విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుకు తన గెలుపు మీద నమ్మకం ఎక్కువైందా అన్న దాని మీద అంతా చర్చించుకుంటున్నారు. ఆయన మూడు సార్లు వరసగా గెలిచారు విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. అలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఈసారి కనుక గెలిస్తే విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర సృష్టించిన వారు అవుతారు. 2026 నాటికి మరోసారి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. అపుడు తూర్పు కూడా విభజించబడుతుంది. తూర్పు ఈ రూపులో ఉండగా కనుక వెలగపూడిని ఓడించకపోతే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శాశ్వతంగా ఆయన పేరే ఉంటుంది. ఆ రికార్డు కోసమే రామక్రిష్ణబాబు చూస్తున్నారు. ఈసారి కూడా తన విజయం నల్లేరు మీద నడకే అని ఆయన భావిస్తున్నారు. అయితే చాప కింద నీరులా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ తూర్పులో దూసుకుని పోతున్నారు.

ఆయనది ఒక్కటే నినాదం మూడు సార్లు ఎమ్మెల్యేగా వెలగపూడికి చాన్స్ ఇచ్చారు. ఈ ఒక్కసారి నాకు ఇవ్వండి అని అంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పదిహేనేళ్ళలో ఆయన ప్రజలకు ఏమైనా చేశారా అని ఎంవీవీ ప్రశ్నిస్తున్నారు. ఎంవీవీ అంగబలం అర్ధబలంతో దూకుడు మీద ఉన్నారు. దాంతో ఈసారి ఎలక్షనీరింగ్ కొత్త పుంతలు తొక్కనుంది అని అంటున్నారు.

ప్రతీసారి వెలగపూడికి అంతా అనుకూలం అయ్యేది. ఈసారి మాత్రం ఎంవీవీ రూపంలో అసలైన సవాల్ వెలగపూడిని ఎదురుకానుంది. ఎంవీవీని తట్టుకుని నిలబడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో జనం మార్పు కోరుకుంటే కనుక వెలగపూడి మాజీ అవుతారు అని అంటున్నారు.

ప్రస్తుతానికైతే ఎంవీవీ జోరు పెంచేశారు. ఆయన గత ఎనిమిది నెలలుగా జనాలకు చేరువ అవుతూ వస్తున్నారు. ఈసారి తూర్పులో మార్పు తధ్యమని ఎంవీవీ ధీమాగా ప్రకటిస్తున్నారు అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు ప్రమాద ఘంటికలు మోగినట్లే అంటున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా గడప గడపకూ టీడీపీ అభ్యర్ధి కూడా రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.