టికెట్ ఎవ‌రికైనా ఇచ్చుకోని.. నేను మాత్రం త‌గ్గేదే లే!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇక్క‌డ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు పోటీ చేస్తార‌ని చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. దీంతో…

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇక్క‌డ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు పోటీ చేస్తార‌ని చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. దీంతో త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌ని మ‌న‌స్తాపం చెందిన మాజీ ఎమ్మెల్యే క‌ల‌వ‌పూడి శివ‌రామ‌రాజు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇటీవ‌ల ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు త‌న‌తో మాట్లాడేందుకు రావాల‌ని శివ‌రామ‌రాజుకు ఆహ్వానం ప‌లికారు. కానీ ఆయ‌న ఖాత‌రు చేయ‌లేదు. పోటీలో వుండ‌డానికి నిర్ణ‌యించ‌కున్నాన‌ని, ఇక బాబుతో మాట్లాడేది ఏమీ లేద‌ని ఆయ‌న తెగేసి చెప్పారు. తాజాగా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పేరు ఉండి తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న టీడీపీలో చేరారు.

దీంతో ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన రామ‌రాజును త‌ప్పించి, ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తార‌ని విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ మేర‌కు సిటింగ్ ఎమ్మెల్యేకు చంద్ర‌బాబునాయుడు ప‌రోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. రామ‌రాజుకు కాద‌ని, ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేద‌ని టీడీపీ శ్రేణులు హెచ్చ‌రించాయి. మ‌రోవైపు రామ‌రాజు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాను పోటీలో వుంటాన‌ని సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు తేల్చి చెప్పారు. టీడీపీ టికెట్ వ‌చ్చినా, రాకున్నా పోటీ మాత్రం ఖాయ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డంతో టీడీపీ ఇరుకున ప‌డింది. టీడీపీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో తాజా ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే రెబ‌ల్ అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేసుకుంటుండ‌డం, ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఇస్తే, రామ‌రాజు కూడా మాజీ ఎమ్మెల్యే బాట‌లో న‌డిస్తే, అంతిమంగా వైసీపీ ల‌బ్ధి పొందుతుంద‌ని టీడీపీ పెద్ద‌లు భ‌య‌ప‌డుతున్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తి సీటూ గెలుపొంద‌డం ఎంతో ముఖ్యం. అలాంటిది కంచుకోట అయిన ఉండి నియోజ‌క‌వ‌ర్గాన్ని చేజేతులా పోగొట్టుకుంటామ‌నే ఆందోళ‌న ఆ పార్టీ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు మాట‌ల్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి టీడీపీలో కొర‌వ‌డింది.