విశాఖలో రివెంజ్ పాలిటిక్స్ కి అల్లల్లాడిపోతున్నారు వైసీపీ నేతలు. నిన్నటిదాకా బుగ్గ కార్లలో దర్జాగా తిరిగిన వారు ఇపుడు అరెస్టు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణం ఏమి ముంచుకు వస్తుందో అని ఒక మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆయన మీద భూ కబ్జా ఆరోపణలతో సహా అనేకం ఉన్నాయి. అవన్నీ వెలికి తీస్తామంటూ అధికార కూటమి హెచ్చరిస్తోంది.
మరో మాజీ మంత్రి మీద ఇదే రకంగా వార్నింగులు వెళ్తున్నాయి. ఆయన కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ కే ఎసరుపెడుతున్నారు. అలాగే మాజీ ఎంపీ ఆయన సన్నిహితులకు అరెస్ట్ భయం వెంటాడుతోంది. దీనికి అంతటికీ కారణం ఎవరు అని వైసీపీలో చర్చ సాగుతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే అంతర్మధనం సాగుతోంది.
గతంలో విశాఖలో ఇటువంటి ఘటనలు ఎపుడూ లేవు అని అంటున్నారు. పార్టీలు అధికారాన్ని కోల్పోవడం సహజం. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం తన పని తాను చేసుకుంటూ పోయే వ్యవస్థ ఉండేది. ఇపుడు అలా కాకుండా ఉనికిలో లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇలా ఎందుకు జరిగింది అంటే వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా గతంలో వచ్చిన ఒకాయన దూకుడు చర్యల ఫలితమే ఇదంతా అని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారుట. ఆయన వారూ వీరూ అని చూడకుండా టీడీపీ నేతల మీద మాజీ మంత్రులు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల ఆస్తుల మీద దాడులు చేయించారని, ఆక్రమణల పేరుతో కూల్చివేతలకు తెర లేపారని గుర్తు చేసుకుంటున్నారు.
ఆయన ఇపుడు ఇక్కడ లేరు. బంగారంలా తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆయన నాడు రగిల్చిన చిచ్చు మాత్రం సెగలై పొగలై వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీలో ఉన్న నేతలను దహించివేస్తోందని అంటున్నారు. విశాఖ పొలిటికల్ కల్చర్ కి విరుద్ధంగా నాడు చేసిన అతి ఉత్సాహం మితి మీరిన అధికార దౌర్జన్యం ఫలితంగానే ఇపుడు ఉన్న నేతలు అనుభవిస్తున్నారు అని నిట్టూరుస్తున్నారుట. అయితే ఎవరు ఏమి చేసినా శిక్ష తప్పదన్న తీరులో అధికార పార్టీ ముందుకు సాగుతోంది. దీంతో ఎపుడు ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ లో విశాఖ లోని కీలక నేతలు అంతా ఉన్నారని భోగట్టా.