అమ్మ పుట్టిన రోజు నాడు వైఎస్ జగన్ శుభాకాంక్షల ట్వీట్ వేయలేదు. అదే మహాపరాధం. దాన్ని పట్టుకుని బాబుగారి 'సామాజిక' మీడియా కిందా మీదా అయిపోతోంది.
అమ్మకు కోక కొనని వాడు ఊరికి ఉపకారం చేస్తాడా అంటూ సామెతలు వల్లె వేస్తోంది. చంద్రబాబుకు చెప్పారు. వాళ్లకి చెప్పారు..వీళ్లకు చెప్పారు. కానీ అమ్మకు మాత్రం ట్వీట్ వేయలేదు అంటూ రుజువులు తీస్తోంది.
నిజమే ట్వీట్ వేసి వుండకపోవచ్చు. అంత మాత్రం చేత అమ్మకు శుభాకాంక్షలు చెప్పలేదని వీళ్లు ఎలా డిసైడ్ అయిపోతారు. అలా డిసైడ్ అయిపోయి, జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వార్తలు ఎలా వండి వార్చేస్తారు. కేవలం ఓ వ్యక్తిని బదనామ్ చేయడం కోసం మరీ ఇంత దిగజారుడా?
ఇప్పుడు ఒక వేళ తన కొడుకు తనకు ఫోన్ లో శుభాకాంక్షలు చెప్పాడని విజయలక్ష్మి చెబితే ఈ సో కాల్డ్ మీడియా జనాలు తలలు ఎక్కడ పెట్టుకుంటారు.
జగన్ కుటుంబాన్ని పూర్తిగా పట్టించుకుంటే, కుటుంబపాలన అని విమర్శించము, వార్తలు రాయము అని చెప్పగలరా? షర్మిలకు ఎమ్మెల్సీ, విజయలక్ష్మికి ఎంపీ, బావకు ఏదో ఒక పోస్ట్ ఇస్తే ఇదే మీడియా ఏం చేస్తుంది.
ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులను పట్టించుకోలేదు అంటూ నానా హడావుడి. ఈ మీడియా ఇప్పుడు అచ్చంగా అదేదో సినిమాలోని బలగం పొట్టి సీతయ్యల మాదిరిగా వ్యవహారిస్తోంది. ఇలా అయితే అలా రాద్దాం…అలా అయితే ఇలా రాద్దాం అనేలా ఫిక్స్ అయిపోయింది.