ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రామోజీ మృతిపై జగన్ వెలబుచ్చిన నివాళి ప్రకటన ఏంటో చూద్దాం.
“రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”
మీడియాతో పాటు వివిధ రంగాల ప్రముఖుడైన రామోజీరావుకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. రామోజీ మృతి సహజంగానే సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే రాజకీయంగా రామోజీ, వైఎస్సార్ కుటుంబం మధ్య తీవ్రస్థాయిలో దశాబ్దాల తరబడి పోరు నడిచింది. ఈ దఫా ఎన్నికల సందర్భంలో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా పత్రికా విలువలన్నింటిని పక్కన పెట్టేసి, తీవ్రస్థాయిలో అక్షర దాడి చేశారు.
దీంతో రామోజీని దుష్టచతుష్టయంలోని వ్యక్తిగా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం గురించి, ఈనాడు పత్రిక తన మొదటి పేజీలో నియంత మట్టి కరిచాడని రాసుకొచ్చింది. దీంతో రామోజీరావు మృతిపై జగన్ నివాళి ప్రకటన చర్చనీయాంశమైంది.