ఉత్తరాంధ్ర అంటే అలుసా వలసలకు కేరాఫ్ అడ్రసా అని ప్రజా సంఘాల నాయకులు మేధావులు నిలదీస్తున్నారు. ఉత్తరాంధ్రను కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖలో మేధావులు ప్రజా సంఘాల నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఉత్తరాంధ్ర గురించి తెలియని వారు అంతా వచ్చి ప్రజా ప్రతినిధులుగా మారారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్ర ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసలకు పోతూంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాజకీయంగా సెటిల్ అవుతూ సెటిల్ మెంట్లు చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర భూములు సహజ వనరులు దోపిడీ యధేచ్చగా సాగుతోందని అన్నారు.
ప్రభుత్వాలు సైతం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల నిర్లక్షం వహిస్తున్నాయని అన్నారు. ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూడడం అందులో భాగమే అని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర ను కాపాడుకోవడానికి నదీ జలాలలో తగిన వాటా పొందడానికి అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని రౌండ్ టేబిల్ సమావేశంలో నిర్ణయించారు.
చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలోని గంగవరం పోర్టుని ప్రైవేట్ పరం చేస్తే జగన్ వచ్చి అమ్మేశారని ఇదంతా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమీ అనరు అన్న భావనతోనే అని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర కోసం ఉద్యమానికి కార్యాచరణను తొందర్లోనే రూపొందిస్తామని ప్రకటించారు.
ఉత్తరాంధ్రలో ఆదివాసీలు మూలవాసుల హక్కులను కాపాడుకుంటామని ఆ నేలపైన పుట్టిన వారి ప్రయోజనలాను కాపాడుతామని అంటున్నారు. ఉత్తరాంధ్రలో మొదలైన ఈ ఉద్యమం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారుతోంది.