బురద బకెట్లతో గులాబీ దళాలు సిద్ధం!

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్న అరుదైన సందర్భం ఇది. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు సీఎంలు ఇద్దరూ భేటీ అవుతున్న లక్ష్యం వేరు. ఏపీ సీఎం నారా చంద్రబాబు…

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్న అరుదైన సందర్భం ఇది. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు సీఎంలు ఇద్దరూ భేటీ అవుతున్న లక్ష్యం వేరు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఇవాళ సాయంత్రం ప్రజాభవన్ లో భేటీ కాబోతున్నారు.

ఈ ఇద్దరు నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణం, స్నేహ సంబంధాలే ఉన్నాయి గనుక, ఈ భేటీలో విభజన చట్టంలో పెండింగ్ ఉండిపోయిన కొన్ని అంశాలు ఇవాళ ఒక కొలిక్కి వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎలాంటి అంతిమ నిర్ణయాలు జరిగినప్పటికీ కూడా అటు చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డి మీద కలిపి బురద చల్లాలని గులాబీ దళాలు ముందే ఫిక్స్ అయిపోయాయి.

సాయంత్రం భేటీ తర్వాత ఇద్దరు నాయకులూ కలిసి విలేకరులతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ భేటీలో నిర్ణయాలు ఏం తీసుకున్నట్టుగా వారు చెప్పినా, అవి తెలంగాణ సమాజానికి విపరీతమైన ద్రోహం చేస్తాయనే ప్రచారం సాగించాలని కేసీఆర్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పెండింగ్ ఉండిపోయిన అంశాల గురించి చర్చించుకోవడానికి, పదేళ్లుగా తెగని విషయాలను ఒక కొలిక్కి తీసుకురావడానికి మాత్రమే భేటీ అవుతున్నారు. అయితే పెండింగ్ ఉన్న విషయాలు అంత తొందరగా తెగేవి కాదు!

వీరి భేటీ అజెండా పరిమితమైనదే అయినప్పటికీ కృష్ణా జలాలు వంటి ఎన్నటికీ తెగే అవకాశం లేని వివాదాలను, భద్రాచలం ముంపు సమస్య వంటి ఊహాజనితమైన సమస్యలను తెరమీదకు తెచ్చి ఈ ఇద్దరు నాయకులు అవన్నీ తేల్చేయాలని ఇప్పటికే వారి భేటీ పై ఒత్తిడి పెంచడం ప్రారంభం అయింది.

అయితే తమ భేటీలో ముందు ప్రకటించినట్టుగా విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగకుండా మిగిలిపోయిన అంశాలకు, 9- 10 షెడ్యూళ్లలోని విషయాలకు తప్ప మరొక అంశం జోలికి వెళ్లకుండా ఈ ఇద్దరు నాయకులు నియంత్రణ పాటిస్తే కనీసం భేటీకి ఒక ప్రయోజనం నెరవేరుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

విభజన చట్టంలోని అంశాలు ఎప్పటికైనా తేలాల్సిందే. అయితే పదేళ్లుగా ఆ పని జరగడం లేదు. మొదట వాటి సంగతి తేల్చేస్తే ముందు ముందు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ మళ్లీ భేటీ అయి, విభజన తర్వాత రేకెత్తిన ఇతర వివాదాలను గురించి మాట్లాడుకుని పరిష్కారాలు అన్వేషించే ప్రయత్నం బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు