అంతా ఊహించినట్లుగానే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్య తెలివితేటలను, అనుభవాన్ని చక్కగా వాడుతున్నారు. కీలకమైన వాటి విషయంలో తాను బాధ్యత తీసుకోకుండా అడుగులు వేస్తున్నారు. ఏదైతే తనకు ఎక్కువ కీర్తిని, లాభాన్ని కట్టబెడుతుందో ఆ పనులు మాత్రమే చేయాలని ఆయన కోరుకుంటున్నారు. శ్రమతో ప్రయాసతో కూడిన బాధ్యతలను పక్కకు నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీలో జాతీయ మీడియాతో ముచ్చటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల అంతరార్థం గమనిస్తే మనకు అదే అనిపిస్తుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను చంద్రబాబు నాయుడు ఇక తాను తీసుకోదలచుకోలేదని అర్థమవుతోంది. ఆయన ఢిల్లీ విలేకరులతో మాట్లాడుతూ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ గురించి చెప్పుకొచ్చారు. తమ నిర్మాణ వైఫల్యం కాకుండా, జగన్ పాలనలో నిర్లక్ష్యం వల్లనే దెబ్బతిన్నట్లుగా అభివర్ణించారు. ఇంతకంటె వేరే రకంగా ఆయన చెప్తారని ఆశించలేం.
అయితే ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గతంలో పెట్టిన ఖర్చు కంటే రెట్టింపు అవుతుందని ఆయన ముందే హింట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం స్థాయికి తాము ఇంకా రాలేదని, జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే ఆ విషయం చూసుకుంటుందని చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రత్యేకంగా గమనించాలి.
అది జాతీయ ప్రాజెక్టు అనే సంగతి 2014 తర్వాత పరిపాలన సాగించినప్పుడు ఆయనకు తెలియదా? ఆ బాధ్యత మొత్తం అప్పుడే కేంద్రం మీద పెట్టి ఉంటే ఇప్పుడున్నంతటి దుర్మార్గమైన పరిస్థితులు అసలు ఉత్పన్నం అయ్యేవే కాదు కదా! లంచాలు, స్వాహా పర్వం కొనసాగడానికి కేంద్రం నిధులతో నిర్మాణం తాను చేస్తానంటూ ముందుకు వచ్చి- అవకతవకలుగా చేసిన ఫలితమే కదా ఇప్పుడు పోలవరం అనుభవిస్తున్నది.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అమరావతి విషయం తప్ప- పోలవరం విషయాన్ని పట్టించుకునేలా కనిపించడం లేదు. అమరావతి వైబ్రేన్సీని పెంచడమే లక్ష్యంగా తాము పని చేస్తామని.. అమరావతిలో 135 ప్రభుత్వ ఆఫీసులు వస్తాయని, వాటితో పాటు రోడ్లు, బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన సమస్త నిర్మాణాలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చంద్రబాబు అంటున్నారు. ఇవి త్వరగా నే జరిగే అవకాశం ఉంది. కానీ ఐకానిక్ భవనాలుగా ఆయన ప్రకటించిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఎప్పటికి పూర్తవుతాయనేది హామీ ఇవ్వలేకపోతున్నారు.
ఏది ఏమైనా అమరావతి నిర్మాణాల మీద చూపుతున్న శ్రద్ధ.. పోలవరం ప్రాజెక్టు గురించిన మాటలలో కనిపించడం లేదు. చూడబోతే ఆ బరువును తెలివిగా మోడీ మీదకి నెట్టేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నట్లు గా కనిపిస్తోంది.