నామినేటెడ్ వాటాలపై జనసేనలో అసంతృప్తి!

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడే పరిపాలనలో కుదురుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో.. నామినేటెడ్ పదవుల పందేరంపై చంద్రబాబునాయుడు దృష్టి పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో పదిరోజుల్లోగా తొలివిడత నామినేటెడ్…

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడే పరిపాలనలో కుదురుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో.. నామినేటెడ్ పదవుల పందేరంపై చంద్రబాబునాయుడు దృష్టి పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో పదిరోజుల్లోగా తొలివిడత నామినేటెడ్ పోస్టుల పంపకం జరుగుతుందని వినిపిస్తోంది.

అయితే భాగస్వామి పార్టీలు జనసేన, బిజెపిలకు 18 నుంచి 20 శాతం నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వాటా పట్ల జనసేన నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి రేగుతోంది.

ఎన్నికల్లో పోటీ చేసిన దామాషాలోనే నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇలాంటి వాటాల విభజన న్యాయం కాదని భాగస్వామి పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో జనసేన, బిజెపి ఇద్దరికీ కలిపి చంద్రబాబు తొలుత 30 స్థానాలే కేటాయించారు. ఆ 30 స్థానాలు జనసేనకు అని ప్రకటించినప్పుడే ఆ పార్టీలో అసంతృప్తులు చెలరేగాయి.

తర్వాత బిజెపి కూడా జట్టులోకి వచ్చినప్పటికీ.. సీట్ల సంఖ్యను మాత్రం చంద్రబాబు పెంచలేదు. తనకు కేటాయించిన 30లోనే 10 భాజపాకు ఇచ్చారు పవన్! మొత్తానికి చంద్రబాబు నుంచి మరొక్క సీటు ఎక్స్ ట్రా తీసుకోగలిగారు. అలా రెండు పార్టీలు కలిసి 31 సీట్లలో పోటీచేశాయి. ఆ ప్రకారం లెక్కవేస్తే అంతా కలిపి 18 శాతం అవుతుంది. అంతకు మించి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరాదని చంద్రబాబు అనుకుంటున్నారట. మహా అయితే 20 శాతం వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట.

అయితే ఈ దామాషాల విభజన అక్రమం అని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో తమ రెండు పార్టీలకు 31 సీట్లు దక్కాయంటే దాని అర్థం.. మిగిలిన 144 సీట్లు తమ పార్టీల వారు త్యాగం చేసినట్టు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

నామినేటెడ్ పోస్టులు ఇచ్చేప్పుడు.. ఎన్నికల్లో సీట్లు పంచుకున్న శాతాల్లో కాదని, సీట్లు వదులుకున్న త్యాగాల దామాషాలో చూడాలని వారు అంటున్నారు. అలాగని తమకు 80 శాతం పోస్టులు ఇవ్వకపోయినా.. లెక్కలతో నిమిత్తం లేకుండా.. కీలకంగా త్యాగాలుచేసిన బలమైన నాయకులు అందరికీ పదవులు దక్కేలా చూడాలని కోరుతున్నారు.

ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీద.. ఎక్కువ నామినేటెడ్ పోస్టుల కోసం డిమాండ్ చేసేలా ఒత్తిడి పెరుగుతోంది. మరి పవన్ తమ పార్టీ కార్యకర్తల అభీష్టాన్ని మన్నిస్తారో.. లేదా, సీట్ల మాదిరిగానే చంద్రబాబు ఎన్ని ఇస్తే అన్నే చాలు.. అదే మహాప్రసాదం అని ఊరుకుంటారో వేచిచూడాలి.

12 Replies to “నామినేటెడ్ వాటాలపై జనసేనలో అసంతృప్తి!”

  1. ఈ ఆర్టికల్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ. జనసేన కి ఇప్పటికే చాల గౌరవం పదవులు ఇచ్చారు. బాబు గారు ఇంకా ఇవ్వచ్చు అది అయన ఉదార వైఖరి… కానీ నా అభిప్రాయం ఏంటంటే .. ఆల్రెడీ ఎక్కువిచ్చారు అని. వీళ్ళ కున్న ఏమ్మెల్యే లు పన్నెండు శాతం. కానీ పదవులు మాత్రం ఇంకా ఎక్కువే అడుగుతున్నారు.

      1. నేను CBN కి లోకేష్ కి ప్రతినిధి ని కాను. టీడీపీ మీద వున్నా అభిమానం అంతే. ఇది నా అభిప్రాయం. అసలు బాబు గారు ఈసారి సొంతంగా వెళ్లి ఉండవలసింది. 2029 కి రాష్ట్రము లో ఒకే పార్టీ ఉండేది అంతే.

Comments are closed.