జీఆర్ మ‌హ‌ర్షిః దొంగ‌లంతా క‌ళాకారులే

ఏప్రిల్ 16 వ‌ర‌ల్డ్ ఆర్ట్ డే, ప్ర‌పంచ క‌ళా దినోత్స‌వం. ఒక ప‌నిని నైపుణ్యంగా చేయ‌డం క‌ళ‌. అత‌న్ని క‌ళాకారుడు అంటాం. ఇది కూడా వ్యంగ్యంగా వాడుతున్నాం. వాడు పెద్ద క‌ళాకారుడు అంటే నానార్థాలున్నాయి.…

ఏప్రిల్ 16 వ‌ర‌ల్డ్ ఆర్ట్ డే, ప్ర‌పంచ క‌ళా దినోత్స‌వం. ఒక ప‌నిని నైపుణ్యంగా చేయ‌డం క‌ళ‌. అత‌న్ని క‌ళాకారుడు అంటాం. ఇది కూడా వ్యంగ్యంగా వాడుతున్నాం. వాడు పెద్ద క‌ళాకారుడు అంటే నానార్థాలున్నాయి. మ‌న వాళ్లు 64 కళ‌లున్నాయ‌ని అన్నారు. దీంట్లో హ‌స్త‌లాఘ‌వం కూడా ఒక‌టి. వెనుక‌టికి కాంగ్రెస్ అవినీతికి పేప‌ర్ల‌లో హ‌స్త‌లాఘ‌వం హెడ్డింగ్ వాడేవాళ్లు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోనే లేదు. అధికారం లేకుంటే అవినీతి కూడా క‌ష్ట‌మే. హ‌స్తంలో అదృష్ట‌రేఖ మాయ‌మైంది. ప్ర‌శాంత్‌కిషోర్ గ‌ట్టెక్కిస్తాడా, తానే మునిగిపోతాడా చూడాలి.

క‌ళ‌ని గుర్తించ‌డం కూడా ఆర్ట్‌. ఈస్త‌టిక్‌సెన్స్. శూద్ర‌క మ‌హాక‌వి రాసిన మృచ్ఛ‌క‌టికం నాట‌కంలో చారుద‌త్తుడికి క‌ళాభిరుచి వుంది. శ‌ర్విల‌కుడు అనే దొంగ క‌న్నం వేసి హారం దొంగిలిస్తే , చారుద‌త్తుడు కొంచెం కూడా దొంగ‌త‌నానికి బాధ‌ప‌డ‌కుండా, క‌న్నం క‌ళాత్మ‌కంగా వేసాడ‌ని దొంగ‌ని పొగుడుతాడు. బొత్తిగా క‌ళాభిరుచి లేనిది మ‌న పోలీసుల‌కి. దొంగ‌ల క‌ష్టాన్ని గుర్తించ‌కుండా చావ‌బాద‌డ‌మే వాళ్ల ప‌ని. అయితే పోలీసుల‌కి క‌థ‌లు చెప్ప‌డం అనే క‌ళ కంఠ‌తా వ‌చ్చు. రైట‌ర్ అనే ఉద్యోగి రాసిన‌న్ని క‌థ‌లు ఏ ర‌చ‌యితా రాయ‌లేదు. గొంగ‌ళిపురుగు సీతాకోక‌చిలుకైన‌ట్టు దొంగ‌లు ఎదిగి ఎదిగి పారిశ్రామికవేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులుగా రూపాంత‌రం చెందుతారు.

చ‌లిత‌క యోగ‌ములు అని ఒక క‌ళ వుంది. మారువేషాల‌తో ఇంకో వ్య‌క్తిలా చెలామ‌ణి అవ‌డం. లోకంలో న‌డుస్తున్న అతిపెద్ద ఆర్ట్ ఇది. ఇహ‌లోకంతో సంబంధం లేద‌ని చెప్పే ఒక స్వామీజీ కోట్ల ఆస్తులు కూడ‌బెడుతూ వుంటాడు. అంటే అత‌ను మారువేషంలో ఉన్నాడ‌ని అర్థం. రాజ‌కీయాల్లో మొత్తం మారువేషాలే న‌డుస్తుంటాయి. తెల్లారిలేస్తే మ‌న‌మంతా మారువేష సంచారుల‌మే. బాస్ ద‌గ్గ‌ర పిల్లి వేషం, కింద వాళ్ల ద‌గ్గ‌ర పులివేషం.

ఈ మ‌ధ్య జ‌నంలోనే మారువేషాలు ఎక్కువ‌య్యే స‌రికి, సినిమాల్లో త‌గ్గాయి. ఒక‌ప్పుడైతే ఎన్టీఆర్ వీర‌విజృంభ‌ణే. మారువేషం లేకుండా ఒక్క సినిమా కూడా వుండేది కాదు. అప్పుచేసి పప్పుకూడులో షెర్వానీ, టోపీ పెట్టుకుని వ‌స్తే హీరోయిన్‌తో స‌హా ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌రు.

క‌థానాయ‌కుడులో న‌ల్ల‌టి అద్దాలు, కోటు వేసుకుని వ‌స్తే అప్ప‌టి వ‌ర‌కూ క్రూరంగా పంచ్ డైలాగ్‌లు చెప్పినా నాగ‌భూష‌ణం గుర్తు ప‌ట్ట‌డు. దేశోద్ధార‌కులులో ఇంకా ఘోరం. బుగ్గ‌మీద పులిపిరి క‌త్తిగాటుతో వ‌స్తే ఈ నాగ‌భూష‌ణ‌మే భ‌య‌ప‌డి చ‌స్తాడు. స్క్రీన్ మీద అన్ని మారువేషాలు వేసిన ఎన్టీఆర్ , రాజ‌కీయాల్లో మారువేషాల‌ని గుర్తు ప‌ట్ట‌లేక కుర్చీ దిగిపోయాడు.

వైజ‌యిక విద్య అని ఇంకో క‌ళ వుంది. విజ‌య‌సాధ‌నోపాయం తెలిసి వుండ‌డం. మ‌న మోదీ ఈ క‌ళ‌లో క‌ళాకారుడు. నోట్లు ర‌ద్దు చేసి గెల‌వ‌డం తెలుసు. రైతుల్ని ఢిల్లీ వీధుల్లో నిల‌బెట్టి గెల‌వ‌డం తెలుసు. రేపు ఏ కార్డుతో వెళ్తాడో అంద‌రికీ తెలుసు. ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌న‌ది సెక్యుల‌ర్ దేశం. మౌనాన్ని సాధ‌న చేస్తున్న దేశం.

కేశ‌మ‌ర్ద‌న కౌశ‌లం అనే క‌ళ వుంది. అంటే మాలిష్‌. లేదా మ‌సాజ్‌. రాజ‌కీయాల్లో ఎన్ని విద్య‌లొచ్చినా ఇది రాక‌పోతే వేస్ట్‌. ప్ర‌జ‌ల‌కి మెసేజ్ ఇచ్చే కాలం పోయి, అధినాయ‌కుల‌కి మ‌సాజ్ చేసే కాలం వ‌చ్చింది.

ఇంద్ర‌జాల విద్య గురించి చెప్పే ప‌నిలేదు. దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లు చాలా మంది ఉన్నారు. నిజానికి క‌ళ‌ల్ని ఇప్పుడు ఒక‌రు ప్రోత్స‌హించే ప‌నేలేదు. ఇత‌రుల క‌ళ‌ల్ని గుర్తించే టైమ్ కూడా ఎవ‌రికీ లేదు. సొంత క‌ళ‌ల‌కి సాన‌బెట్టుకంటూ, ఇత‌రుల‌కి పొగ‌పెడుతూ జీవించ‌డ‌మే. నిజానికి జీవిత‌మే ఒక పెద్ద క‌ళ‌!