జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో రాజకీయ అలజడికి కారణమైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో పోరాటబాట పట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను కాదని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. వీరిలో అధికార పార్టీ నేతలు కూడా ఉండడం విశేషం.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రాజంపేట జిల్లా సాధన సమితి నేతలు హెచ్చరించారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వేకోడూరు, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విన్నవించారు. కానీ వారి విజ్ఞప్తులను సీఎం ఆలకించలేదు. చివరికి ప్రభుత్వం ప్రకటించినట్టుగానే తుది ప్రకటన వెలువడింది.
జిల్లా కేంద్రం పోయిందనే బాధ నుంచి రాజంపేట, రైల్వేకోడూరు ప్రజలను విముక్తి చేయడానికి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజంపేట నుంచి ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని జిల్లా కేంద్రమైన రాయచోటికి తరలించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటికి రాజం పేట నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని , రాజకీయంగా నష్ట నివారణలో భాగంగా ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది.