వేసవి వచ్చిందంటే సెలవులు మొదలవుతాయి. దీంతో ప్రతి హిందువూ తిరుమలకు వెళ్లాలని కోరుకుంటారు. సమ్మర్ స్టార్ట్ అయితే చాలు తిరుమల ఏడు కొండలు కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో ఒక్కోసారి భక్తులను అదుపు చేయడం కష్టసాధ్యమవుతోంది. రెండు రోజుల క్రితం తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద యుద్ధవాతావరణం తలపించింది. దీంతో పెద్ద ఎత్తున టీటీడీపై విమర్శలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలో కొత్త దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల వెళ్లారు. దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో నేరుగా మాట్లాడి వసతులు, దర్శన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మధ్య తోపులాట జరగడాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. గత విధానం వల్ల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు 20 నుంచి 36 గంటల సమయం పట్టేదన్నారు.
టైం స్లాట్ విధానం వల్ల భక్తులు రెండు, మూడు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. టీటీడీ అధికారులతో చర్చించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇటీవల భక్తుల మధ్య తొక్కిసలాట జరగడం వాస్తవమే అన్నారు. అయితే గంట వ్యవధిలోనే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చెయ్యడం దిగజారుడు తనమని వ్యాఖ్యానించారు.