కర‌ణ్ వ్యాపారంలో స‌గం అమ్మ‌కం.. వెయ్యి కోట్ల‌కు!

సినీ నిర్మాణ సంస్థ‌లు అంటే గ‌తంలోలా ఏదో డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి, ఫైనాన్షియ‌ర్ల నుంచి డ‌బ్బులు తెచ్చి సినిమాలు తీసేసి, న‌ష్ట‌మో-లాభ‌మో పొందేవి కావు! గతంలో పెద్ద సినిమాలు తీసిన వారు ఆ త‌ర్వాత ఒక‌టీ…

సినీ నిర్మాణ సంస్థ‌లు అంటే గ‌తంలోలా ఏదో డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి, ఫైనాన్షియ‌ర్ల నుంచి డ‌బ్బులు తెచ్చి సినిమాలు తీసేసి, న‌ష్ట‌మో-లాభ‌మో పొందేవి కావు! గతంలో పెద్ద సినిమాలు తీసిన వారు ఆ త‌ర్వాత ఒక‌టీ రెండు ఫ్లాప్ ల‌తో దెబ్బ‌లు తిన్న దాఖ‌లాలు క‌నిపిస్తాయి. ఏదో స్టూడియోలు, స్థ‌లాలు పొందితే త‌ప్ప‌.. పేరున్న బ్యానర్లు నిల‌దొక్కుకునే ప‌రిస్థితి ఉండేది కాదు. అలాంటి వారు కూడా సినిమాలు తీయ‌డం ఆపేశారు. అయితే మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసిన కొంద‌రు మాత్రం సంపాద‌న‌లో తిరుగులేకుండా సాగిపోతూ ఉన్నారు. అలాంటి వారిలో క‌ర‌ణ్ జొహార్ ఒక‌డు.

తండ్రి స్థాపించిన బ్యాన‌ర్ ను భారీ స్థాయికి తీసుకెళ్లాడు. ఇత‌డి ని గేలి చేసే వాళ్లు, కమేడియ‌న్ త‌ర‌హాలో చూసే వారు, విమ‌ర్శించే వాళ్లు చాలా మందే ఉన్నా.. ఇప్పుడు క‌ళ్లు చెదిరే డీల్ తో క‌ర‌ణ్ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. క‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో స‌గ భాగాన్ని అమ్మారు. అది కూడా వెయ్యి కోట్ల రూపాయ‌ల‌కు.

త‌న నిర్మాణ సంస్థ‌లో 50 శాతం వాటాను త‌నే మిగుల్చుకుంటూ కూడా క‌ర‌ణ్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ను ఇప్పుడు సంపాదించుకున్నాడు. అది కూడా ఈ మ‌ధ్య‌కాలంలో ఇత‌డి సినిమాలు కొన్ని డిజాస్ట‌ర్లు కావ‌డం వ‌ల్ల ఇలా అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ట‌, అయిన‌ప్ప‌టికీ క‌ర‌ణ్ ముప్పై యేళ్ల సినిమా కెరీర్ కు ఇది గొప్ప విష‌యంగా చెప్ప‌వ‌చ్చు. వెయ్యి కోట్ల రూపాయ‌ల మొత్తం స‌మ‌కూర‌డ‌మే కాకుండా, మిగిలిన 50 శాతం అంటే ఇంకో వెయ్యి కోట్ల రూపాయ‌ల సామ్రాజ్యం అతడి చేతిలోనే ఉంటుంది.

క‌ర‌ణ్ తండ్రి య‌శ్ జొహార్ ఈ బ్యాన‌ర్ ను స్థాపించాడు. తండ్రి వార‌సత్వం ఆధారంగా సినిమాల్లోకి వ‌చ్చిన క‌ర‌ణ్ ముందుగా ద‌ర్శ‌కుడిగా స‌త్తా చూపించుకున్నాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం క‌న్నా నిర్మాణం మీదే దృష్టి పెట్టాడు. ప్రాంతీయ భాష‌ల్లో హిట్టైన సినిమాల‌ను హిందీలో రీమేక్ చేయ‌డంతో పాటు, స్టార్ల పిల్ల‌ల్నీ ఇంట్ర‌డ్యూస్ చేస్తూ త‌న సినిమాల‌కు క్రేజ్ పెంచుకున్నాడు. చాలా శ్ర‌ద్ధ వ‌హించి త‌న సినిమాల‌ను సూప‌ర్ హిట్స్ గా మ‌లుచుకున్నాడు. ఈ గ‌మ‌నంలో క‌ర‌ణ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. స్టార్ల పిల్ల‌లతోనే సినిమాలు తీస్తాడ‌నే విమ‌ర్శ‌లు గ‌ట్టిగా వ‌చ్చాయి. అయితే వ్యాపారం తెలిసిన క‌ర‌ణ్ వాటిని ప‌ట్టించుకోలేదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన బ్రహ్మాస్త్ర క‌ర‌ణ్ ను దెబ్బ‌తీసిన‌ట్టుగా ఉంది.

వ్యాపారం తెలిసిన‌వాడు కాబ‌ట్టి ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో స‌గ‌భాగాన్ని అమ్మేసుకున్న‌ట్టుగా ఉన్నాడు. ముందుగా రిల‌య‌న్స్ ఈ కొనుగోలు చేస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చినా బిజినెస్ టైకూన్ అడార్ పునావాలా ఈ డీల్ ను పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ సంస్థ సినిమాల‌తో పాటు, వెబ్ సీరిస్ లు, టీవీ షోల నిర్మాణంలో ఉంది.