కోడెల విగ్రహం: టీడీపీలో కొట్టుకోవడమొక్కటే తక్కువ!

బయటివారితో కొట్లాడడం సంగతి తరువాత.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తమలతో తాము కొట్టుకోవడానికే వారికి ఇప్పుడు సమయం చాలడం లేదు. తాజాగా నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు…

బయటివారితో కొట్లాడడం సంగతి తరువాత.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తమలతో తాము కొట్టుకోవడానికే వారికి ఇప్పుడు సమయం చాలడం లేదు. తాజాగా నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు విగ్రహం వ్యవహారంలో ఇప్పుడు పార్టీ నాయకుల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారిలో వారే పరస్పర విరుద్ధంగా మాట్లాడుకుంటున్నారు. తెదేపా నాయకులు వారిలో వారే కొట్లాడుకోవడం తప్ప.. అభిప్రాయ భేదాలు వ్యక్తం చేసుకుంటున్నారు.

నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో ఇటీవల కోడెల శివప్రసాదరావు అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికారంలో ఉన్నది తమ పార్టీనే కదా.. అని అనుకున్నారో ఏమోగానీ.. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అనుమతుల గురించి పట్టించుకోలేదు. అనుమతులు లేవంటూ మునిసిపల్ అధికారులు దానిని తొలగించడం కూడా జరిగింది.

నాయకుడి విగ్రహాన్ని తొలగించారు గనుక.. పైగా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు గనుక… సహజంగానే ఏర్పాటు చేసిన వారు దీనిని రాద్ధాంతం చేయడానికి ప్రయత్నించారు. కోడెల కుమారుడు శివరామ్ కూడా నిరసన వ్యక్తం చేశారు. తన తండ్రి తుదిశ్వాస వరకు పార్టీకోసం పనిచేసిన వ్యక్తి కాగా, ఆయన విగ్రహం తొలగింపు అనేది అధికారులు అత్యుత్సాహం అని ఆయన అంటున్నారు.

కోడెల విగ్రహం తొలగింపుపై స్పీకరు అయ్యన్నపాత్రుడు కూడా ఆగ్రహించారు. అక్కడ ప్రభుత్వాస్పత్రి ఏర్పాటుకోసం గతంలో కోడెల ఎంతో కష్టపడ్డారని, విదేశాల్లోని తన మిత్రుల నుంచి విరాళాలు తెచ్చి మరీ నిర్మించారని.. అలాంటి నేత విగ్రహం తొలగించడం కరెక్టు కాదని అయ్యన్నపాత్రుడు అన్నారు.

అయితే తెలుగుదేశంలోనే మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాత్రం విగ్రహం తొలగింపును సమర్థిస్తున్నారు. కోడెల వంటి నాయకుడి విగ్రహాన్ని దొంగచాటుగా అర్ధరాత్రి ప్రతిష్టించాల్సిన అవసరం లేదని, త్వరలోనే గౌరవప్రదంగా ప్రతిష్టిద్దామని నచ్చజెప్పే మాటలు మాట్లాడుతున్నారు. అయితే తొలగింపును సమర్థిస్తున్నారు. కొన్ని శక్తులు సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని మంత్రి గొట్టిపాటి హెచ్చరిస్తున్నారు.

ఈ సందర్భాన్ని వాడుకుని.. రచ్చరచ్చ చేయాలని కోడెల శివరామ్ వర్గం భావించడం సహజం. మంత్రి గొట్టిపాటి హెచ్చరిక వారికేనా అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. కోడెల శివప్రసాద్.. స్థానికంగా మంచి డాక్టరుగా ఎంత పేరు తెచ్చుకున్నారో… రాజకీయ నాయకుడిగా అంత వివాదాస్పదుడు అయ్యారు. ఫ్యాక్షన్ ను పెంచిపోషించిన వ్యక్తిగా ముద్రపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే.. చివరిదశలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడే ఆయనను పక్కకు పెట్టారు. అలాంటిది ఇప్పుడు ఆయన విగ్రహం గురించి పార్టీలో కుమ్ములాటలు జరుగుతుండడం గమనార్హం.

5 Replies to “కోడెల విగ్రహం: టీడీపీలో కొట్టుకోవడమొక్కటే తక్కువ!”

Comments are closed.