రాజ‌కీయాల్లో లాబీయిస్టుల‌కే భ‌విష్య‌త్‌!

రాజ‌కీయాల్లో సేవ చేసే వాళ్ల‌కు ప‌దవులు ద‌క్కుతాయ‌నేది గ‌తం. వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ మాత్రం లాబీయిస్టుల‌దే.

రాజ‌కీయాల్లో సేవ చేసే వాళ్ల‌కు ప‌దవులు ద‌క్కుతాయ‌నేది గ‌తం. వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ మాత్రం లాబీయిస్టుల‌దే. ముఖ్యంగా చంద్ర‌బాబు చేతికి టీడీపీ ప‌గ్గాలు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ఆలోచ‌న‌లు విభిన్నంగా వున్నాయి. రాజ‌కీయాల్ని డ‌బ్బు శాసించ‌డం మొద‌లైన త‌ర్వాత‌, కార్పొరేట్ శ‌క్తులు, వ్యాపార‌స్తులు రాజ‌కీయ నాయ‌కుల అవ‌తారం ఎత్తారు. ఇందులో భాగంగా సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేశ్ త‌దిత‌రులు చంద్ర‌బాబు క‌ళ్లు, చెవులు అయ్యార‌నే చ‌ర్చ లేక‌పోలేదు.

ఇప్పుడు లోకేశ్ సార‌థ్యం టీడీపీలో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. సానా స‌తీష్‌, కిలారి రాజేశ్ త‌దిత‌రులదే రాజ్యం. వాళ్లు చెప్పిందే శాస‌నంగా మారింద‌ని టీడీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇందుకు వైసీపీ మిన‌హాయింపేమీ కాదు. అయోధ్య రామిరెడ్డి, విక్రాంత్‌రెడ్డి, ఇంకా పైకి క‌నిపించ‌ని చాలా మంది బ‌డాబాబులు వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా న‌డిపిస్తున్నారు. జ‌గ‌న్ చుట్టూ రాజ‌కీయాలు తెలిసిన వాళ్లకంటే, పారిశ్రామిక‌వేత్త‌లే ఎక్కువ కనిపిస్తారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌తో సంబంధాలుండి, పోరాటాలు చేసే వాళ్ల‌కు ప‌ద‌వులు వ‌స్తాయ‌ని అనుకుంటే పొర‌పాటే. ఇవేవీ చేయ‌క‌పోయినా, ప‌ద‌వుల్ని కొనుక్కోవ‌చ్చ‌నే కొత్త సంప్ర‌దాయానికి అన్ని పార్టీలు తెర‌లేపాయి. కాక‌పోతే, ఎక్కువ‌, త‌క్కువ …తేడాలింతే.

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేమీ మిన‌హాయింపు కాదు. ఈ పార్టీల‌ను న‌డిపించేదే లాబీయిస్టులు. అదానీ, అంబానీల పేర్లు నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటాయి. దీనికి కార‌ణం ఏంటో ప్రత్యేకంగా చ‌ర్చించుకోవాల్సిన ప‌నిలేదు. దేశ సంప‌ద‌ను లాబీయిస్టుల‌కు దోచి పెట్ట‌డ‌మే ప‌నిగా పాల‌న సాగుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతూనే వుంటాయి. అధికారంలో ఎవ‌రున్నా, న‌డిపించేది మాత్రం కార్పొరేట్ దిగ్గ‌జాలే అన‌డంలో సందేహం లేదు.

రాజ‌కీయాలు, నాయ‌కుల‌పై ఇష్టాన్ని పెంచుకుని క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు ఆస్తుల్ని, జీవితాల్ని కూడా త్యాగం చేస్తుంటారు. కొంద‌రు వాస్త‌వాల్ని తెలుసుకునే లోపు పుణ్య‌కాలం కాస్త మించిపోయి వుంటుంది. మ‌రికొంద‌రు ఎప్ప‌టికీ నిజాలు తెలుసుకోలేక జీవితాల్ని ముగిస్తుంటారు. అందుకే ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో అప్ర‌మ‌త్తంగా వుండాల్సింది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే.

9 Replies to “రాజ‌కీయాల్లో లాబీయిస్టుల‌కే భ‌విష్య‌త్‌!”

Comments are closed.