టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడిని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని టీడీపీ చేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. పట్టాభిపై దాడి కేంద్రంగా బాబు అండ్ కో తెరకెక్కించిన దాడి సినిమా అట్టర్ ప్లాప్ అయింది. దీనికి ప్రధాన కారణం పట్టాభి నోటి దురుసు, ప్రజలతో సంబంధం లేని మీడియా నాయకుడే కావడమేనని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి.
నోటి కొచ్చినట్టు ప్రత్యర్థులపై నిందారోపణలు చేయడం తద్వారా మీడియాలో ప్రచారం పొందుతూ లీడర్‌గా అవతరించాలనే పట్టాభి వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది.
పట్టాభిపై దాడి స్వయంకృతాపరాధమేనని టీడీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. కుక్కతోకను పట్టుకుని గోదారిని ఈదిన చందంగా …. ప్రజల్లో పలుకుబడి లేని నాయకుడిపై దాడిని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మాలనే ప్రయత్నాలు వృథా ప్రయాస అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పైగా పంచాయతీ ఎన్నికల ముంగిట పట్టాభిపై దాడిని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి టీడీపీ డ్రామా ఆడుతోందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. ఎందుకంటే పట్టాభి “అతి” గురించి వార్తా చానళ్లను చూసిన వారెవరికైనా తెలుసునని వారు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా ఒక వ్యక్తిపై దాడి జరిగిందంటే … రాజకీయాలు, పార్టీలకు అతీతంగా “అయ్యో పాపం” అని అంటుంటారు. కానీ పట్టాభిపై దాడి విషయంలో అలాంటి కనీస సానుభూతి కూడా వ్యక్తం కావడం లేదంటే, ఆయన రాజకీయ పంథాపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతుండడం గమనార్హం.
దుండగుల దాడిలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయని తన సొంత మీడియా ద్వారా చంద్రబాబు తనకు తెలిసిన సినిమాటిక్ సీన్‌ను క్రియేట్ చేసేందుకు యత్నించారు. అయితే తీవ్ర గాయాలైన పట్టాభి ఆస్పత్రిలో కాకుండా ఇంట్లో ఎలా ఉన్నారని, బాబు పట్టాభి ఇంటికి వెళ్లి పరామర్శించడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గోరింతను కొండంతలు చేసి, పట్టాభి, టీడీపీ పబ్బం గడుపు కోవాలంలే కుదరదని, ఇది సోషల్ మీడియా కాలమని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలైతే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వ్యక్తి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడపడం ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
పట్టాభిపై దాడికి సీఎం సమాధానం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను స్థాయి మరిచి దిగజారుడు మాటలు మాట్లాడుతూ, జగన్‌ను కూడా తన స్థాయికి దిగజారాలని బాబు కోరుకుంటున్నట్టుగా ఉందంటున్నారు. తనను కూడా చంపండంటూ చంద్రబాబు వ్యాఖ్యలు హైడ్రామాలో హైలెట్‌గా నిలిచాయని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.