పిల్లలను ఉపేక్షించరు.. పీఏను ప్రోత్సహిస్తారా?

అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏడునెలలుగా జగదీష్ దందాలు సాగిస్తోంటే, అవన్నీ తన పేరిట జరుగుతున్నాయనే సంగతి గ్రహించకుండానే అనిత ఇంతకాలం ఉన్నారా?

హోంమంత్రి వంగలపూడి అనిత తన పీఏ తొలగింపు వ్యవహారాన్ని సమర్థించుకునేందుకు పాపం విఫలయత్నం చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడునెలల కాలంలో ఏ మంత్రి కూడా అభాసుపాలు కాని స్థాయిలో హోంమంత్రి పేషీ బజారుకెక్కింది. ఆమె ప్రైవేట్ పీఏ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు పార్టీ వారే ఫిర్యాదు చేయడం సంచలనం అయింది.

వ్యవహారం చాలా కాలం సాగిన తరువాత ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆగ్రహించడంతో, మొత్తానికి వంగలపూడి అనిత సదరు ప్రైవేట్ పీఏను తొలగించారు. ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత జగదీష్ అనే ఆ వ్యక్తిని తొలగించడమే పెద్ద ఘనకార్యం అన్నట్టుగా అనిత సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

‘ప్రభుత్వానికి గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ నష్టం జరుగుతుందని భావిస్తే నా పిల్లలనైనా పక్కన పెడతాను,’ అని వంగలపూడి అనిత అంటున్నారు. అయితే ఇలా చెప్పుకుంటున్న సందర్భంలో ఆమె చెప్పిన మాటలు ప్రజలకు మరిన్ని కొత్త అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. ఈ మాటలు ఆమె చిత్తశుద్ధిని, నిజాయితీని విశ్వసించేలా చేయలేకపోవడం గమనార్హం.

‘జగదీష్ అనే వ్యక్తి నా ప్రైవేట్ పీఏ. నా సొంత డబ్బుతో జీతం ఇచ్చా. అతడిపై ఆరోపణలొచ్చాయి. అతన్ని హెచ్చరించా. అయినా ఫిర్యాదులు ఆగకపోవడంతో పది రోజుల కిందటే విధులనుంచి తొలగించా,’ అని అనిత చెప్పుకుంటున్నారు.

ఇలాంటి దందాలు సాగించడంలో ఆరితేరిన వ్యక్తిని ‘తన సొంత సొమ్ము వేతనంగా ఇచ్చి’ మరీ తన పీఏగా నియమించుకోవడం అనేదే పెద్ద అనుమానాస్పద వ్యవహారం. ఎందుకంటే, ప్రభుత్వం మంత్రులకు పీఏలను సమకూరుస్తుంది. మంత్రులు వారి ఆప్షన్‌తో కూడా తీసుకోవచ్చు. వారు ప్రభుత్వోద్యోగులు అయి ఉంటే వారికి కనీసం కొంత జవాబుదారీతనం ఉంటుంది.

ప్రభుత్వోద్యోగులు అయినంత మాత్రాన పరిశుద్ధాత్మస్వరూపులై ఉంటారని కాదు గానీ, కనీసం తాము చేస్తున్న తప్పులు బయటపడితే శాఖపరమైన చర్యలుంటాయనే ఆలోచన వారిని కాస్త ఆపుతుంది. కానీ, విచ్చలవిడి అవినీతి తిమింగలం వంటి వ్యక్తిని ప్రైవేట్ పీఏగా సొంత సొమ్ముతో ఎందుకు నియమించుకున్నట్టు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏడునెలలుగా జగదీష్ దందాలు సాగిస్తోంటే, అవన్నీ తన పేరిట జరుగుతున్నాయనే సంగతి గ్రహించకుండానే అనిత ఇంతకాలం ఉన్నారా? అనేది ప్రజల అనుమానం.

పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలకు పదేపదే ఫిర్యాదు చేసి వ్యవహారం బాగా భ్రష్టు పట్టిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక అనిత తొలగించారే తప్ప, తనంతగా తాను తీసుకున్న నిర్ణయం కాదని ఇప్పుడు దానిని సమర్థించుకోవడంలోనే ఆమె దొరికిపోయేలా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

అయినా, ఏడునెలలపాటూ అవినీతికి పాల్పడ్డాడని స్వయంగా మంత్రి ఒప్పుకుంటున్న నేపథ్యంలో జగదీష్ మీద పోలీసు కేసులు పెట్టించి విచారణ జరిపించకపోతే, ఆమె చిత్తశుద్ధిని నమ్మలేం అని కూడా అంటున్నారు.

3 Replies to “పిల్లలను ఉపేక్షించరు.. పీఏను ప్రోత్సహిస్తారా?”

Comments are closed.