అమాయక ఉన్మాదం

ఏ భావోద్వేగం అయినా సరే మోతాదుకు మించి వ్యక్తం అయితే అది ఉన్మాదమే! ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, చివరికి భక్తి కూడా కావచ్చు.

భక్తి, ఆధ్యాత్మికత కూడా ఉన్మాదరూపం దాలుస్తున్న నవీనయుగంలో మనం ఉన్నాం. సాంకేతికత ఎంతగా కొత్త పుంతలు తొక్కుతూ జనజీవన సరళి ఎన్నెన్ని కొత్త హంగులు అద్దుకుంటుందో అనే భయాలు పుట్టిస్తున్న రోజుల్లోనే.. మూఢభక్తి అనేది అంతగా వెర్రితలలు వేస్తూ పోతున్న రోజులివి. భక్తి, ఆధ్యాత్మిక ఉన్మాదం అంటే కేవలం ఒక దేవుడి పట్ల భక్తితో ఒకే మతంలోని మరొక దేవుడిని, మరొక మతానికి చెందిన దేవుడిని దూషించడం మాత్రమే కాదు. ఒకేమతంలోని ఒక దేవుడి పట్ల అపరిమితంగా, అనుచితంగా ప్రదర్శించడం కూడా! తమకు తెలియకుండానే అలాంటి ఉన్మాదంలో అమాయకంగా చిక్కుకుపోయిన ప్రజలే.. మరణానంతరం వైకుంఠప్రాప్తి దక్కుతుందనే ఆశతో వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రయత్నిస్తూ పరమపదించారు. వీరిది అమాయకమైన ఉన్మాదం. ఒక్క భక్తిలోనే కాదు.. అనేక రంగాల్లో ఇలాంటి అమాయక ఉన్మాదం ఒక అలవాటుగా మారిపోతున్నది. ఆ పోకడల మీద ఆలోచన రేకెత్తించే ప్రయత్నమే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘అమాయక ఉన్మాదం’!

వ్యక్తులలో ఉన్మాదం రకరకాలుగా ఉంటుంది. మతమో ప్రాంతమో ఏదోక పేరు చెప్పి రెచ్చిపోతూ ఉండే, మానవ హననం సాగిస్తూ ఉండే ఉగ్రవాదులను.. ప్రేమను అంగీకరించని కారణానికి అమ్మాయిలపై యాసిడ్ పోసే వారిని.. తల్లిదండ్రులను చితక్కొట్టి వీధుల్లోకి గెంటేసే వారిని.. ఇలా అనేక రకాలకు చెందిన వారిని కూడా ఉన్మాదులు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. అందువలన ఉన్మాదం అనేది చాలా తీవ్రమైన పదంగా, నిందగా, తిట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ముందే చెప్పుకున్నట్టు ఉన్మాదం అనేది రకరకాలుగా ఉంటుంది. అలాంటి వాటిలో అమాయక ఉన్మాదం కూడా ఒకటి! వీరికి ఉన్మాదం యొక్క తీవ్ర రూపాలు తెలియవు. కానీ, ఉన్మాదుల మాదిరిగానే వ్యవహరిస్తారు. సాధారణ ఉన్మాదుల మాదిరిగా సంకుచిత స్వార్థ ప్రయోజనాలు వీరికి ఉండవు. అందుకే వీరిని ‘అమాయక ఉన్మాదం’ అనే సరికొత్త వర్గంలో పరిగణించాలి.

ఏ భావోద్వేగం అయినా సరే మోతాదుకు మించి వ్యక్తం అయితే అది ఉన్మాదమే! ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, చివరికి భక్తి కూడా కావచ్చు. ఆ భక్తి ఉన్మాదం యొక్క వికృత ఫలాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూశాం. తిరుమల వెంకటేశ్వర స్వామిని సరిగ్గా వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడే దర్శించుకోవాలని తద్వారా పురాణాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పే వైకుంఠ ప్రాప్తిని సునాయాసంగా దక్కించుకోవాలని అమాయకంగా నమ్మిన భక్తులు వాళ్ళు. అనూహ్యంగా జరిగిన తొక్కేసలాటలో తమ ప్రాణాలనే దేవుడికి బలి పెట్టారు.

సాధారణంగా ‘చెడు’ అందరికీ చేరినంత సులభంగా, వేగంగా, స్థిరంగా ‘మంచి’ చేరదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ అమాయకపు భక్తి ఉన్మాదం విషయంలో కూడా అదే జరుగుతోందనే అభిప్రాయం కలుగుతోంది. పర్వదినాలకి, ప్రత్యేకమైన రోజులకు ఉండే ప్రాశస్త్యం గురించి సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తోంది? ఇదంతా కేవలం ప్రవచనకారుల పుణ్యం. నిజానికి ప్రవచన కారులు ధర్మానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారని మనం అనుకుంటాం. నిజమే. ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాలలో సామాన్యులకు అర్థం కాని భాషలో ఉండే అనేక అంశాలను వారు విపులంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెబుతూ ఉంటారు. తమ విస్తృతమైన గ్రంథ పఠనం ద్వారా దక్కిన అదనపు జ్ఞానాన్ని, అవగాహనను కూడా జోడించి ధార్మిక విషయాలకు తమదైన భాష్యం చెబుతుంటారు.

ఇలా భాష్యం చెప్పడంలోనే ప్రవచనకర్తల స్థాయి భేదాలు, నిమ్నోన్నతాలు నిర్ణయం అవుతుంటాయి. ఎందుకంటే ఒక గ్రంథంలో ఒక అంశం గురించి ఒక శ్లోకం ఉన్నప్పుడు దాని అర్థం, భావం ఎవరు చెప్పినా ఒకే రకంగా ఉంటాయి, ఉండాలి. అదే దాని అన్వయింపుల గురించి భాష్యం చెప్పే సమయంలో ప్రవచనకర్త కర్త యొక్క అవగాహన జ్ఞాన సంపద వ్యక్తం అవుతుంది వారు ఎంతటి రుజుమార్గంలో సమాజాన్ని తీసుకెళ్లడానికి ప్రవచనం చెబుతున్నారో మనకు తెలిసి వస్తుంది.

లాజిక్ అనే మాటకు అందని దుర్మార్గమైన పద్ధతిలో ధార్మిక విషయాలను చెప్పేవారు కొందరు ఉంటారు. వీరికి వైకుంఠ ఏకాదశి అంటూ పరమ పవిత్రంగా అందరూ అనుకునే ప్రత్యేకమైన రోజులే అక్కర్లేదు. ఏరోజు వారు ప్రవచనం చెబుతున్నా సరే.. ఆ రోజుకు ఒక పవిత్రతను, ప్రత్యేకతను ఆపాదించేయగలరు. అంతటి ఔద్ధత్యం వారికి ఉంటుంది. వారు చెప్పే ప్రవచనాలు చాలా కామెడీగా ఉంటాయి. ఫరెగ్జాంపుల్ ఇలా సాగుతుంది. ‘ఇవాళ పుష్క మాసం కృష్ణపక్షం చవితి తిథి. ఈ రోజుకు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని ఒక ప్రత్యేకత ఉంది.

ఇవాళ దాంపత్య సమస్యలను పరిష్కరించుకోవడానికి అద్భుతమైన మార్గం చూపించే రోజు. మీరు ఇవాళ తలస్నానం చేసి.. ఆకుపచ్చ ఎరుపు రంగులు కలిసి ఉన్న దుస్తులు ధరించి.. శుభ్రమైన పత్తినుంచి వడికిన నూలు దారం తీసుకుని.. అడవి మామిడి చెట్టు మొదలు వద్ద నదీజలంతో శుభ్రం చేసి.. ఆ దారాన్ని పసుపులోను గంధంలోను తడిపి ఆ చెట్టు మొదలు చుట్టూతా 401 చుట్లు చుడితే గనుక.. మీ దాంపత్యంలో ఉన్న సమస్యలన్నీ చిటికెలో మాయమైపోతాయి. అదే దారాన్ని స్వచ్ఛమైన ఆవునెయ్యిలో కూడా తడిపి చుడితే గనుక.. మీకున్న రుణబాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దానిని 401 కాకుండా 534 చుట్లు చుడితే గనుక.. మీ సంతానం విషయంలో వారి అభివృద్ధి దివ్యంగా ఉంటుంది…’ ఇలా ఎంత పొడవుగానైనా అల్లుకుపోవచ్చు.

వారు చెప్పే ఏ ఒక్క సూచనకైనా సరే.. ‘ఎందుకు’ అనే ప్రశ్నను సంధిస్తే వారి వద్ద సమాధానం ఉండదు. మహా అయితే ప్రపంచంలో ఎక్కడా ఉండని పురాణ రహస్యాల గ్రంథంలో ఇలా ఉన్నది.. అని ఒక్కమాటతో ముగించేస్తారు అంతే. లక్షల మంది ఆధ్యాత్మిక చింతన పరులు ఆయన చెప్పేవి చాలా శ్రద్ధగా వింటారు. వందల వేల మంది మూర్ఖంగా దానిని ఆచరించే ప్రయత్నం చేస్తుంటారు. అలా చేసినా సరే.. దాంపత్య కష్టాలు తీరకపోతే గనుక.. పత్తినుంచి వడికేటప్పుడు దారం తెగిందని, గంధంలో పూర్తిగా తడవలేదని అందుకే కష్టాలు తీరలేదని తమను తాము ఆత్మవంచన చేసుకుంటూ బతికేస్తారు.

ఇలా దారితప్పించేవాళ్లు కొందరైతే.. ఆచరణాత్మక దృక్పథంతో సదవగాహన కలిగించే గరికపాటి వంటి వారు కూడా ఉంటారు. ముక్కోటి ఏకాదశినాడే వెళ్లి వైష్ణవాలయాన్ని సందర్శించుకోవాలనే నియమమేమీ లేదని, భగవంతుడు అలా ఏం మనకు నిర్దేశించలేదని ఆయన వంటి వారు చెబుతుంటారు.

కానీ ముందే చెప్పుకున్నాం. చెడు చేరినంత సులువుగా, మంచి నలుగురిలోకీ వ్యాపించదు. అందుకే వైకుంఠద్వారా దర్శనం పుణ్యానికి షార్ట్ కట్ కాదు అనే భావన ఎక్కువ మందికి చేరదు. ఆ రోజు కోసం ఎగబడే వాళ్లే ఎక్కువగా ఉంటారు.

భక్తుడి నిర్వచనం దేవుడికి వర్తించదా?

‘దేవుడిని చేరుకోగలిగే మంచి భక్తుడు ఎవడు?’ అనే ప్రశ్నకు జవాబుగా భగవద్గీతలో గీతాకారుడు అనేక లక్షణాలను ప్రవచిస్తాడు. ‘సర్వత్ర సమబుద్ధయః’ అంటూ అన్నింటి పట్ల సమానమైన బుద్ధి కలిగి ఉండే భక్తుడు తనన చేరుకుంటాడని చెబుతాడు కృష్ణుడు!

అన్నింటి పట్ల సమామైన భావన ఉండాలనేది మంచి భక్తుడికి ఉండవలసిన లక్షణంగా దేవుడే చెప్పాడు. మరి ఆ లక్షణం దేవుడికి ఉండదా? వైకుంఠ ఏకాదశి అంటే మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని భావించే భక్తుడు.. భగవద్గీతలో ఉన్నది అబద్ధం, చెత్త అని నమ్ముతున్నట్టే కదా? భగవద్గీత నిజమైతే.. ఒకరోజుకు ప్రత్యేకత ఆపాదించడం ఒక మోసం, వంచన, వ్యాపార కిటుకు అని భావించాలి కదా! అనేది ఒక సందేహం.

నిర్దిష్టంగా ఒక మాసాన్ని గానీ, ఏదైనా ఒక ప్రత్యేకమైన తిథిని గానీ, వారంలో ఒక రోజును గానీ.. ప్రత్యేకంగా ఇష్టపడితే అసలు అతను దేవుడు ఎందుకవుతాడు? అన్ని రోజులనూ అన్ని జీవులనూ సమానంగా ప్రేమించని తత్వం దైవత్వం అనిపించుకుంటుందా? ఫలానా రోజున వచ్చి తనను సేవించుకున్న వాడిని మాత్రమే కాస్త ఎక్స్ ట్రా గా కరుణిస్తాను అని అనే దేవుడిని తన ముఠాను కాపాడుకోవాలని తన జట్టులో చేరిన వారి బాగుకోసం మాత్రమే ప్రయత్నించే రాజకీయ నాయకుడితో సమానంగా చూడగలం తప్ప.. దేవుడిగా ఎలా పరిగణించగలం.

తన గుడికి వచ్చే వారిని మాత్రమే కరుణించాలనే ఉద్దేశం దేవుడికి ఉంటుందా? ఇలా అనుకోవడం దేవుడిని అవమానించడం కాదా? అనేది భక్తులు ఆలోచించాలి.
గతిలేకగానీ, వ్యవధి లేక గానీ, నమ్మకమే లేకపోవడం వల్ల గానీ.. జీవితంలో ఒక్కసారి కూడా దైవ దర్శనానికి ఆలయానికి వెళ్లని ఎంతో మంచి వాడైన వ్యక్తి, తన పని తాను చేసుకుంటూ ఉండే వ్యక్తి, ఇతరులకు కించిత్తు కీడు తలపెట్టని, పొల్లుమాటలాడని వ్యక్తి ఎక్కడైనా ఒక మారుమూల కుగ్రామంలో బతుకుతూ ఉంటే అతనికి ఎప్పటికీ మోక్షం రాదా? తన వద్దకొచ్చి ఎప్పుడూ దర్శించుకోలేదు గనుక అతడి మీద పగబట్టి.. దేవుడు నరకానికి పంపిస్తాడా? ఇలాంటి లాజిక్ ను కూడా భక్తులు ఆలోచించుకోవాలి.

సెలబ్రిటీలు మహా దుర్మార్గులు, అవిశ్వాసులు!

ఖర్మానుగతంగా కొందరికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. వారు మంత్రులు, సినీ నటులు, బాబాలు, పీఠాధిపతులు అయిపోతారు. అలాంటి వారందరికీ కూడా దేవుడిని ఈ రోజే చూడాలనిపిస్తుంది. ఒక్కటే ఒక్కరోజు దేవుడికి ప్రత్యేకమైనదని.. ఆరోజున దేవుడు ప్రత్యేకంగా కరుణిస్తాడని నమ్ముతున్న ప్రపంచంలో.. అదే రోజుకు ఉండే 24 గంటల్లో కొన్ని గంటల దేవుడి సమయాన్ని తాము కాజెయ్యడానికి వారు సిగ్గుపడరు. దానివలన.. అదేరోజున దేవుడిని దర్శించుకోవాలని తపనపడి క్యూలైన్లలో చేరి ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకునే లక్షలాది మంది భక్తుల ఉసురు పోసుకుంటున్నామనే స్పృహ కూడా వారికి ఉండదు.

ఉదాహరణకు ఇవాళ్టి సందర్భాన్నే తీసుకుందాం. రెండురోజుల కిందట ఆరుగురు అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి దుర్భరమైన స్థితి గురించి కోట్ల మంది కన్నీళ్లు పెట్టుకున్నారు జాలి పడ్డారు. అలాంటి నేపథ్యంలో.. ఇవాళ.. తిరుమలేశుని సేవించుకున్న ప్రముఖులు అంటూ.. రాజకీయ సినీ ఆధ్యాత్మిక మహామహులంతా దడికట్టినట్టుగా ఆలయంలోంచి వెలుపలికి వస్తూ టీవీ చానెళ్లలో చూస్తూ ఉంటే.. నిన్న విలపించిన లక్షల మందికి కడుపు మండుతుందా మండదా? ఇలాంటి ధూర్తులనా మనం సెలబ్రిటీలు చేసినది అనే ఆవేశం పొంగుతుందా? పొంగదా?

ఇంకో కోణంలో గమనిస్తే.. ఈ సెలబ్రిటీలు అనే బూటకపు అవకాశవాద భక్తులు.. తిరుమలేశునికి నిజమైన భక్తులే కాదు. స్పష్టమైన పదాలతో చెప్పాలంటే వీరు ‘అవిశ్వాసులు’! వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తరద్వారా గుండా వెళ్లి దర్శించుకుంటే డైరక్టు వైకుంఠ ప్రాప్తి అని కదా వారు నమ్ముతున్నారు. మరి ఒక ఏడాది అలా దర్శించుకున్న వారికి డైరక్టు వైకుంఠం వెళ్లడానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే కదా? మళ్లీ మరో సంవత్సరం వారు అదే రోజున దర్శనానికి ఎందుకు వస్తున్నట్టు? అంటే ఒకసారి వైకుంఠంద్వారం ద్వారా వెళ్లినంత మాత్రాన వైకుంఠం దక్కుతుందని వారికి కూడా నమ్మకం లేదు. వీలైన ప్రతిసారీ వెళితే.. ఏదో ఒకటి వర్కవుట్ అవుతుందని ఆశ. వీరు దేవుడిని పరిశుద్ధమైన మనసుతో నమ్ముతున్నారని ఎలా అనుకోగలం? ఇలాంటి వారికి ఖచ్చితంగా అమాయక ఉన్మాద భక్తుల ఉసురు తగులుతుంది.

భక్తి మాత్రమే కాదు..

ఇలాంటి అమాయక ఉన్మాదం కేవలం ఒక్క భక్త విషయంలో మాత్రమే కాదు. ఇంకా అనేక రంగాల్లో మనకు కనిపిస్తుంటుంది. సినిమాల కోసం ఎగబడడం కూడా ఇలాంటిదే. రాజకీయ సభలకు ఎగబడ్డం కూడా ఇలాంటిదే. పవన్ కల్యాణ్ సభ పెడితే.. ఎగబడి వచ్చే ప్రయత్నంలో ఇద్దరు చచ్చిపోయారు. పుష్ప సినిమా కోసం ఎగబడి ఒకామె అసువులు బాసింది. పెద్ద వివాదమే అయింది. ఇవాళ తిరుమల దేవుడి వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఏకంగా ఆరుగురు చనిపోయారు గనుక.. ఇది పెద్దదిగా లెక్కతేలి.. ఇంతగా చర్చకు వస్తోంది. కాకపోతే.. ఇవన్నీ కూడా ఒకే రకమైన అమాయక ఉన్మాదాలు.

సినిమా సంగతే తీసుకుందాం. ఒక సినిమాను ‘భారీ’ అనే ముసుగులో మూడు నుంచి మూడున్నర సంవత్సరాల పాటూ తీస్తూనే ఉన్నారు. అన్ని సంవత్సరాల పాటు దానికోసం ఎదురుచూసిన అభిమాన గణాలు.. విడుదల తేదీ ప్రకటించిన తర్వాత.. మరో పదిరోజులు నిరీక్షించలేరా? బెనిఫిట్ షోనే చూస్తే తప్ప.. వారికి ఆ సినిమా చూసినట్టు అనిపించదా? బెనిఫిట్ షోలకు ఎగబడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు? ఆ ఒక్క షో అని కాదు.. టికెట్ల ధరలు అమాంతం పెంచేసి అభిమానుల నుంచి దండుకోవాలని ప్రయత్నించేది.. ఈ అమాయక ఉన్మాదాన్ని ఆసరా చేసుకునే కదా. ఒక సినిమాకోసం మూడున్న ర సంవత్సరాలు నిరీక్షించిన వారు.. మరో పదిరోజులు ఆగి, సాధారణ ధరలకే సినిమా చూద్దాం అనుకుంటే.. ఈ వేలం వెర్రి పోకడలు ఉంటాయా? ఉండవు కదా?

ఒకరిని చూసి ఒకరు.. అనుకరించే ప్రయత్నంలో కొందరు.. మొత్తంగా రకరకాల రూపాల్లో సమాజంలో అమాయక ఉన్మాదం విశృంఖలం అవుతోంది. మనుషుల్లో తార్కిక ఆలోచన అనేది కనిపించకుండా పోతోంది.

ఓరిమి ఉన్న గొడ్డు తేట నీరు తాగుతుందని సామెత! ఈ అమాయక ఉన్మాదులందరూ ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఈ సామెత తమ జీవితాలకు రక్ష అని కూడా తెలుసుకోవాలి.

– ఎల్. విజయలక్ష్మి

15 Replies to “అమాయక ఉన్మాదం”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ఈ ఆర్టికల్ రాసిన నీకు దండంరా అయ్య…. మనుషులు ఇంకా పూర్తి స్థాయిలో అరాచకాలు చెయ్యకుండా ఉండటానికి కారణం దేవుడు ఉన్నాడు అనే భయం… చేసిన తప్పునే కర్మ అంటారు… తెలిసి చేసిన తెలియక చేసిన కర్మ ఎవరిని వదలదు..

    నీకు ఖాళీ సమయం ఉంటే రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమాలు చూడు.. కానీ ఇలాంటి ఆర్టికల్స్ మాత్రం రాయకు

  3. మొన్న “ అదే ja*** హయాం లో .. అయితే “ అని టైటిల్ పెట్టి తెగ గింజుకున్నావు, ఇప్పుడు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి??

  4. మొన్న “ అదే ja*** హయాం లో .. అయితే “ అని టైటిల్ పెట్టి తెగ గింజుకున్నావు, ఇప్పుడు నిన్ను ఏ చె*ప్పుతో కొ*ట్టాలి?

  5. మరి జగ్నొన్మాదం?

    ఒక 17 CBI/ED కె.-.సులున్న వాడిని, ఇప్పుడు ఆగమెఘాల మీద మళ్ళి వెంటనె సి.ఎం చెయకపొతె, ఎదొ ఉపద్రవం వచ్చినట్టు ఇక్కడ గుండెలు బాదుకుంటూ రొజూ రాస్తున్నారె! మరి ఇది ఎమి ఉన్మాందం !!

    కరుడుగట్టిన ఈ జగనొన్మాదులతొనె అసలు ముప్పు!

Comments are closed.