చంద్రబాబు కల్చర్‌కు 2.0 వెర్షన్ సోము నామినేషన్!

నామినేషన్ కోసం ఏకంగా రెండు ప్రత్యేక విమానాలు పనిచేశాయన్నమాట. బహుశా ఒక ఎమ్మెల్సీ పదవి కోసం ఇంత ఖరీదైన నామినేషన్ వేయడం చరిత్రలోనే ఎక్కడా ఉండదని అంతా అనుకుంటున్నారు.

ఎన్నికలలో నామినేషన్ల గడువు ముగిసి పోయేవరకు అభ్యర్థులను టెన్షన్ పెట్టి, చివరి క్షణాలలో వారికి బీఫారాలను అందజేసి ఉరుకులు పరుగులు పెట్టించడంలో చంద్రబాబు నాయుడు ది ప్రత్యేకమైన శైలి. నామినేషన్లు వేసేసి స్క్రూటినీ ముగిసేలోగా బీఫారం సమర్పించడం కోసం హైదరాబాదులో పార్టీ ఆఫీసులో నిరీక్షిస్తూ గడిపి, చివరి క్షణంలో చంద్రబాబు నుంచి కాగితాలు అందుకుని, ప్రత్యేక హెలికాప్టర్లలో వెళ్లి అధికారులకు సమర్పించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.

అయితే అటువంటి కల్చర్ కు కొనసాగింపు అన్నట్లుగా, 2.0 వెర్షన్ అన్నట్లుగా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ పర్వం నడిచింది. మొత్తానికి ఆయన గడువు సమయం ముగియడానికి 14 నిమిషాల ముందు ఎమ్మెల్సీ పదవి కోసం తన నామినేషన్ సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్న సంగతి అందరికీ తెలుసు. అన్ని స్థానాలు కూడా కూటమి పార్టీల పరంకానున్నాయి. ఒకటి జనసేన కి చెందిన నాగబాబు కోసం ప్రత్యేకంగా కేటాయించినప్పటికీ, మిగిలిన నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ వారే ఉంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే చివరి రోజున భారతీయ జనతా పార్టీ తమకు కూడా ఒక ఎమ్మెల్సీ సీటు కావాలని అడిగి పుచ్చుకుంది. దీంతో చంద్రబాబు నాయుడు కేవలం ముగ్గురి పేర్లను ప్రకటించి ఊరుకున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఆ ఒక్క స్థానం కోసం సోము వీర్రాజుని ఎంపిక చేసింది.

అయితే నామినేషన్ వేయడానికి అవసరమైన ఏ బి ఫారాలు ఏపీ బీజేపీ కార్యాలయంలో లేవు అని కాస్త ఆలస్యంగా గుర్తించారు. అప్పటికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో ఉన్నారు. తెలంగాణ పార్టీ కార్యాలయంలో అవసరమైన ఫారాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వాటిని తీసుకుని ఒక వ్యక్తి ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చారు.

అదే సమయంలో మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగుస్తుంది- అనగా ఉదయం 10.30కు రాజమహేంద్రవరంలో బయలుదేరి అసలు నామినేషన్ వేయాల్సిన సోము వీర్రాజు ఉరుకులు పరుగుల మీద విజయవాడకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో మరొకరికి సంతకం చేయడానికి ఆథరైజేషన్ ఇచ్చినప్పటికీ.. స్వయంగా సంతకం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ నుంచి మరొక ప్రత్యేక విమానం మాట్లాడుకుని విజయవాడ వచ్చారు.

అంటే నామినేషన్ కోసం ఏకంగా రెండు ప్రత్యేక విమానాలు పనిచేశాయన్నమాట. బహుశా ఒక ఎమ్మెల్సీ పదవి కోసం ఇంత ఖరీదైన నామినేషన్ వేయడం చరిత్రలోనే ఎక్కడా ఉండదని అంతా అనుకుంటున్నారు.

10 Replies to “చంద్రబాబు కల్చర్‌కు 2.0 వెర్షన్ సోము నామినేషన్!”

Comments are closed.