ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలంతే?

పవన్ కల్యాణ్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఆయన తాజాగా విడుదల చేసిన ప్రకటన మరో ఉదాహరణ. అసలు పవన్ కల్యాణ్ ఏ హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారో ఆయనకే తెలియాలి. ఏపీ…

పవన్ కల్యాణ్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఆయన తాజాగా విడుదల చేసిన ప్రకటన మరో ఉదాహరణ. అసలు పవన్ కల్యాణ్ ఏ హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారో ఆయనకే తెలియాలి. ఏపీ డీజీపీని అకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేశారు, నాకు తెలియాల్సిందే, ప్రజలకు చెప్పాల్సిందేనంటూ ఎకాఎకిన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్. 

అసలు ప్రభుత్వం అలా బదిలీలకు కారణాలు చెబుతుందా…? కారణం చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతారు, ఎలాంటి పరిస్థితుల్లో చెబుతారు, అసలు పవన్ ఏ హోదాలో బదిలీకి కారణం అడుగుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన బదిలీల్లో దేనికైనా ఆయన కారణం అడిగారా..? ఇలా ఇప్పుడు పవన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియా తలెకెక్కింది..

పిచ్చి బాగా ముదిరింది, పైత్యం తలకెక్కింది అంటారు కదా. అలా పవన్ కల్యాణ్ కి ఇప్పుడు సోషల్ మీడియా బాగా తలకెక్కింది. సోషల్ మీడియాలో కనిపించే పుకార్లన్నీ ఆయన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. డీజీపీని బదిలీ చేయడానికి కారణం ఆనాడు ఉద్యోగుల 'చలో విజయవాడ' విజయవంతం కావడం అనే పుకారు  బాగా వినిపిస్తోంది. 

సీఎం కు కావాల్సిన ఓ ఉన్నతాధికారిని డీజీపీ పట్టించుకోలేదనే ఫేక్ న్యూస్ కూడా తిరుగుతోంది. అంతెందుకు.. ఆమధ్య అరెస్ట్ లతో లోకేష్ ని హీరో చేశారనే సిల్లీ ప్రచారం కూడా సాగింది. వీటన్నిటినీ చూసి, వీటిలో ఏదో ఒకటి నిజమనుకుని, నేరుగా సీఎం జగన్ ని నిలదీస్తూ జనసేన అధినేత హోదాలో  ఓ ప్రకటన విడుదల చేశారు పవన్.

ఎక్కడలేని సింపతీ తన్నుకొచ్చిందే..

నిన్న మొన్నటి వరకూ డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా.. ఇతర పోలీస్ అధికారులందర్నీ ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. సీఎం జగన్ కి తొత్తులా మారిపోయారని, ఆయన ఏం చెబితే అది చేస్తున్నారని విమర్శించాయి. ఆయన బదిలీ అయ్యారు, కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారనే వార్తలొస్తే మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయ్యయ్యో మా సవాంగ్ జీ ని బదిలీ చేశారే అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అకస్మాత్తుగా ఆయన్ని ఎందుకు బదిలీ చేశారంటూ లాజిక్ లు తీస్తున్నారు. ఆయనపై ఎక్కడలేని సింపతీ కురిపిస్తున్నారు.

సమస్యలపై ఫోకస్ పెట్టాల్సిన ప్రతిపక్షాలకు, సీఎం జగన్ అసలు పనే లేకుండా చేయడంతో ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయని అనుకోవాలి. లేకపోతే డీజీపీ బదిలీపై ఓ పార్టీ అధ్యక్షుడు లేఖ రాయడమేంటి..? సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ప్రస్తావించడమేంటి..? ఇకనైనా పవన్ ఎదగాలి, విస్తృతంగా ఆలోచించగలగాలి. అలా చేస్తేనే తనకూ ఆలీకి ఉన్న తేడా ఆయనకు కచ్చితంగా తెలిసొస్తుంది. లేకపోతే తన తోటివారంతా రాజకీయాల్లో ఎదుగుతుంటే, తాను మాత్రం ట్రాన్స్ ఫర్లపై ట్వీట్లు వేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది.