భూమి ఉన్న రైతులకు 'భరోసా' ఉంది. పొదుపు సంఘాలకు 'ఆసరా' ఉంది. వృద్ధులు, వితంతువులకు వైఎస్ఆర్ పింఛన్ ఉంది. విద్యార్థులకు అమ్మఒడి ఉంది. మరి భూమి లేని సాధారణ కూలీలు, నిరుపేదల పరిస్థితేంటి? వాళ్లకు బీమా, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు వర్తిస్తే సరిపోతుందా.. స్వావలంబన అక్కర్లేదా? ఇదే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకం జగనన్న జీవక్రాంతి.
తెలుగింటి ఆడపడుచులు తక్కువ శ్రమ, అతి తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకునేలా తయారుచేసిన పథకం ఇది. ఈ పథకం కింద 2.49 లక్షల యూనిట్ల గొర్రెలు, మేకల్ని అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక భారీ కార్యక్రమం ఈరోజు సీఎం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
ఒక్కో యూనిట్ లో 15 గొర్రెపిల్లలు లేదా మేకలు ఉంటాయి. వీటిలోనే సంతానోత్పత్తి కోసం పొట్టేలు కూడా ఉంటుంది. దీన్ని ఒక యూనిట్ గా లెక్కిస్తారు. ఈ యూనిట్ ఖరీదు 75వేల రూపాయలు.
ఇలాంటి యూనిట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మహిళా లబ్దిదారులకు అందించాలనేది జగన్ లక్ష్యం. దీనికోసం ప్రభుత్వం అక్షరాలా 1868 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
గ్రామీణాభివృద్ధికి, స్వయం సమృద్ధికి ఇంతకుమించిన కార్యక్రమం ఇంకోటి లేదు. ఏ గ్రామంలో ఉన్న మహిళలు ఆ గ్రామంలోనే లబ్ది పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల ఆ కుటుంబాలు బాగు పడ్డంతో పాటు మాంసం, పాలు, సేంద్రియ ఎరువు ఉత్పత్తిలో రాష్ట్రం కూడా గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది.
ఈ మేరకు అల్లానా ఫుడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మాంసం సరఫరాలో మెళకువలు నేర్పిస్తుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో సంస్థను స్థాపించిన ఈ కంపెనీ.. త్వరలోనే ఉత్తరాంధ్రలో బ్రాంచీలు ఏర్పాటుచేస్తుంది.
వచ్చే ఏడాది డిసెంబర్ లోపు 3 విడతలుగా అమలు కానున్న ఈ పథకంలో కూడా పూర్తిస్థాయిలో పారదర్శకతను పాటిస్తున్నారు. యూనిట్ల కొనుగోలు, పంపిణీ, నిర్వహణ అన్నీ పారదర్శకంగా ఉంటాయి. ఎవరైనా, ఎప్పుడైనా ఆ సమాచారాన్ని చూడొచ్చు. అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి నిర్థారణ చేసుకోవచ్చు.