బీజేపీకి చెలగాటం.. టీఆర్ఎస్ కి ప్రాణ సంకటం

దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ పోరాట ఫలంతో ఊపుమీదున్న బీజేపీ.. ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నోముల నర్సింహయ్య మరణం కారణంగా వస్తున్న ఈ ఉప ఎన్నికలకు…

దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ పోరాట ఫలంతో ఊపుమీదున్న బీజేపీ.. ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నోముల నర్సింహయ్య మరణం కారణంగా వస్తున్న ఈ ఉప ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. అయితే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టేందుకు ఇష్టపడని తెలంగాణ బీజేపీ.. ఇప్పటినుంచి చేరికలతో హడావిడి సృష్టించడానికి సిద్ధమైంది.  

2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7771 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఉన్న ఊపు చూస్తే డిపాజిట్ కాదు.. ఏకంగా సీటే గెలిచేందుకు ప్లాన్ గీస్తోంది.

అంతా అనుకున్నట్టు జరిగితే.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతారు. కుదరకపోతే.. జానారెడ్డి తనయుడికి ఇది రాజకీయ అరంగేట్రం కూడా అయ్యే అవకాశముంది. మొత్తమ్మీద జానారెడ్డి కాంగ్రెస్ ని వీడే టైమ్ అయితే దగ్గర పడిందని తెలుస్తోంది. 

ఇక ట్రెండ్ ని బట్టి నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వాలా లేక, దుబ్బాక ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని, మరో బలమైన నేతని రంగంలోకి దింపాలా అనే ఆలోచనలో ఉంది టీఆర్ఎస్. కాంగ్రెస్ సంగతి సరేసరి. జానారెడ్డి పార్టీ మారితే అక్కడ కాంగ్రెస్ తరపున బరిలో దిగే బలమైన స్థానిక నాయకుడు ఎవరూ లేరు. పోనీ ధైర్యం చేసి ఎవరినైనా బరిలో దింపితే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవమే దక్కుతుందనే అంచనాలున్నాయి.

అటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్న తరుణం ఇది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార ఘట్టాన్ని మిస్ అయిన విజయశాంతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు కచ్చితంగా అందుబాటులోకి వస్తారు. ఆమె కూడా కలిస్తే.. ఇక బీజేపీకి మరింత జోష్ వచ్చినట్టే లెక్క.

మొత్తమ్మీద సాగర్ ఎన్నిక బీజేపీకి చెలగాటం, టీఆర్ఎస్ కి ప్రాణ సంకటంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

పవన్ మనసులో వున్నది ఆయనేనా?