'అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది'.
'రాజధానిని ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుంది. ఇది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశం'.
… ఈ రెండు వాక్యాల మతలబు ఏమిటి? కేంద్రం లోక్ సభలో అధికారికంగా రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ రెండు వాక్యాలు ఉన్నాయి. వీటి అర్థంలో మాత్రం.. జగన్ ప్రభుత్వానికి మోడీ సర్కారు చేరవేయదలచుకున్న సందేశం.. సంకేతంగా కనిపిస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు.
మూడు రాజధానుల అంశాన్ని శాసనసభలో ఆమోదించిన జగన్ సర్కారు.. దాన్ని చట్టంగా తెచ్చే ప్రయత్నంలో ఉంది. మహా అయితే కొంత ఆలస్యం కావొచ్చు తప్ప.. రాజధాని విశాఖకు తరలకుండా ఎవ్వరూ ఆపలేరని జగన్ సచివులు ప్రకటిస్తున్నారు. రాజకీయం అంతా వేడి మీద ఉంది. సాంకేతికంగా ఈ సమస్యను అధిగమించే విషయంలో జగన్ ప్రభుత్వానికి అనుభవ రాహిత్యం ఉన్నదనే అభిప్రాయాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. అందువల్లనే శాసనమండలిలో సులువుగా గట్టెక్కలేకపోయారని, ఈ డిలే జరుగుతోందనే అభిప్రాయాలూ ఉన్నాయి.
కేంద్రం లోక్ సభలో చేసిన ప్రకటన గమనిస్తే జగన్ సర్కారుకు వారు ప్రేమతో సంకేతం పంపినట్లుగా కనిపిస్తోంది. అమరావతి రాజధానిగా నోటిఫై అయి ఉందని వారు అన్నారు. అంటే ముందుగా.. అమరావతి రాజధాని అనే అంశాన్ని డీ నోటిఫై చేయాల్సి ఉంటుంది. శాసనమండలి రూపేణా ఎదురైన సాంకేతిక సమస్యను అధిగమించేలోగా ప్రభుత్వం ఈ పర్వం కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆవిషయాన్నే ఈ ప్రకటన ద్వారా చెప్పారని అనిపిస్తోంది.
మొత్తానికి కేంద్రం మాటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతాయనే అనుకోవాలి. అమరావతి రైతులు ఢిల్లీ వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతిని ఇంకా పలువురిని కలిసి పితూరీలు చెబుతున్న తరుణంలోనే.. ‘మా చేతిలో ఏం లేదు’ అన్నట్లుగా ప్రకటన రావడం యాదృచ్ఛికమే కావొచ్చు.