ఏపీలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా విమర్శలు తీవ్రంగా చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ.. వర్షాకాలం ముగియగానే రోడ్ల రిపేరీ పనులు మొదలుపెడతామంటూ చెబుతూ వచ్చింది. ఈ మేరకు ఇప్పుడిప్పుడు ఏపీలో రోడ్ల రిపేరీ పనులు మొదలయ్యాయి. అటు కార్పొరేషన్ ల పరిధిలోనూ, స్టేట్ హైవేలు, ఆర్ అండ్ బీ రోడ్లు .. వేటి పరిధిలో అవి రిపేరీ పనులు మొదలయ్యాయి.
రాయలసీమలో గ్రామీణ, పట్టణ రోడ్ల పునర్నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో వివిధ రోడ్ల రిపేరీ సాగుతూ ఉంది. అలాగే అనంతపురం జిల్లాలోనూ రిపేరీ వర్కులు మొదలుకాగా, మరి కొన్ని ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉన్నాయి. అనంతపురం నగరానికి ఎంట్రీ లో నాలుగు రోడ్ల రహదారి నిర్మాణం శరవేగం సాగుతూ ఉంది. దశాబ్దాలుగా ఇరుకు రహదారిగా ఉన్న ఈ రోడ్డు ఇప్పుడు నాలుగు లైన్ల రహదారిగా మారుతూ ఉండటంతో నగరం రూపురేఖలు మారనున్నాయి. నగరంలోని కలెక్టర్ ఆఫీసు దగ్గర నుంచి.. ఎస్కే యూనివర్సిటీ పరిధి వరకూ.. దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల రహదారిని.. నాలుగు లైన్ల రహదారిగా మారుస్తున్నారు. భారీ బ్రిడ్జ్ నిర్మాణంతో సహా ఈ రోడ్డు నాలుగు రోడ్ల మార్గంగా మారబోతోంది. ఈ మార్పు అనంతపురంలోకి ప్రధాన ఎంట్రీని అందంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది.
అనంతపురానికి చుట్టూ రోడ్లు చక్కగానే ఉన్నా.. కదిరి, ధర్మవరం రహదారుల నుంచి నగరంలోకి ఎంట్రీ ఇచ్చే రోడ్డు దుస్థితి మాత్రం దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు ఆ రహదారి రూపు రేఖలే మారుతుండటం వాహనదారులకూ, ప్రజలకూ పెద్ద ఊరటగా మారుతోంది. డబుల్ లైన్ రహదారిని ఫోర్ వే గా మారుస్తూ ఉండటం మరింత ఊరటగా మారుతోంది.
రాయలసీమలో గత రెండేళ్లలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయ్యింది. అప్పటికే రోడ్ల నాణ్యత అంతంత మాత్రంగా ఉండటం, టీడీపీ హయాంలో కూడా వాటి నిర్మాణాలు ఏమీ జరగకపోవడం, టీడీపీ హయాంలో చినుకు రాలకపోవడంతో రోడ్లు అలాగే నెట్టుకొచ్చాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. టీడీపీ హయాంలో అంతంత మాత్రంగా ఉండిన రోడ్లు.. రెండేళ్లవ ర్షాలతో అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో గతుకుల రోడ్లలో ప్రయాణాలు చాలా ఇబ్బందికరంగా మారాయి. దీంతో విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు పనులు ప్రారంభం కావడంతో ఇబ్బందులు తీరనున్నాయి.
ఇక సీమలో పలు జాతీయ రహదారుల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. కొన్ని పట్టణాలనూ, సుదూరాలను కలుపుతూ కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదుగా కొన్ని జాతీయ రహదారులు ఉన్నాయి. వీటి నిర్వహణ అత్యంత దారుణంగా ఉంది. స్టేట్ హైవేలు, ఆర్ అండ్ బీ రోడ్ల కన్నా.. జాతీయ రహదారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వీటిని బాగు చేసే నాథుడు మాత్రం కనిపించడం లేదు.
రహదారుల విషయంలో జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ కూడా విమర్శిస్తూ ఉంటుంది. మరి కమలనాథులకు జాతీయ రహదారుల పరిస్థితి కనపడదా? టోల్ గేట్లు పెట్టి వసూళ్లు చేసుకోవడం బాగానే ఉంది కానీ, నేషనల్ హైవేల్ దయనీయ స్థితి మాత్రం కేంద్రానికి పట్టనట్టుగా ఉంది. బీజేపీకి మిత్రపక్షం అయిన జనసేన రోడ్ల పరిస్థితిపై నిరసన తెలుపుతూ.. స్వయంగా రోడ్లను తవ్వి తీసింది.
రోడ్లను తామే ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు జనసేన కార్యకర్తలు. అంత పనెందుకు.. ఎంచక్కా జాతీయ రహదారుల వైపు వెళ్లి చూస్తే.. కావాల్సిన దుస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లా మీదుగా వెళ్తూ, కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో సాగే జాతీయ రహదారి, చిత్తూరు జిల్లాను చెన్నైతో కలిపే జాతీయ రహదారి వంటి వాటిల్లో ప్రయాణాలు అత్యంత దుర్భరంగా మారాయి. మరి వీటికి మోక్షం ఎప్పుడో!