కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టంలో ఆసక్తిదాయకమైన క్లాజులను చేరుస్తున్నట్టుగా సమాచారం. యడియూరప్ప ప్రభుత్వం తీసుకురాని ఈ యాంటీ కన్వర్షన్ బిల్ లో .. ప్రధానంగా మతం మారిన వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అనర్హులుగా ప్రకటించనుందట బొమ్మై ప్రభుత్వం. ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
మరి ఆయా కులాలకు అందే సంక్షేమ పథకాలు మాత్రమే అందకుండా చేస్తారా? లేక మతం మారిన వారికి అన్నిరకాల సంక్షేమ పథకాల అమలూ లేదంటారో చూడాల్సి ఉంది. ఉదాహరణకు మతం మారిన ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలపైనే ఈ పథకం కొరడా ఝలిపించనుంది. ఇక ఈబీసీ కేటగిరిలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు పొందే వారు కూడా మతం మార్చుకుంటే ఇలాంటి పథకాల లబ్ధికి దూరం కావొచ్చు.
మతం మారిన వారికి సంక్షేమ పథకాల లబ్ధిని ఆపేయడం ద్వారా.. మత మార్పిడిలను నివారించాలని బొమ్మై ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది. కేవలం ఆ కులాలకు అందే సంక్షేమ పథకాలే వారికి అందవా, లేక మొత్తంగానే వారు ఏ ప్రభుత్వ పథకానికీ అనర్హులు అవుతారో బిల్లును సభ ముందు పెడితే కానీ క్లారిటీ రాకపోవచ్చు.
ఇక మతం మారిన వారికి రిజర్వేషన్లు అంశం మాత్రం.. స్టేట్ లో తేలే అంశం కాదు. సుప్రీం కోర్టులో తేలాల్సిన అంశం అది. మతమార్పిడులకు పాల్పడే వారికి కూడా కఠిన శిక్షలను ఈ బిల్లులో పేర్కొననున్నారట. కనీసం మూడేళ్ల జైలు, ఎక్కువగా మార్పిడులు చేస్తే మరింత కఠినమైన శిక్షలు వేయనున్నారట. ఇక ఎవరైనా తమను బలవంతంగా మతం మార్పించారు.. అని చెబితే వారికి ఐదు లక్షల పరిహారాన్ని కూడా ఇవ్వనున్నారట. మతం విషయంలో వారిని బాధితులుగా గుర్తించి, వారికి ఐదు లక్షల రూపాయలను ఇవ్వనున్నారట!
మరి .. ఐదు లక్షలు వస్తాయంటే, చాలా మంది ఇప్పుడు లేచి రావొచ్చు. తాము ఎవరి బలవంతం మీదనో మతం మారినట్టుగా చెబితే చాలు, ఐదు లక్షలు వస్తాయంటే.. ఇప్పటికిప్పుడు మళ్లీ మతం మారడానికి వెనుకాడని వారు ఎంతో మంది ఉండవచ్చు.