జ‌స్టిస్ చంద్రుపై చంద్రం సార్ చిట‌ప‌ట‌

త‌మిళ‌నాడు హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్రుపై మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు సార్ చిట‌ప‌ట‌లాడారు. ప్ర‌పంచ మాన‌వ హ‌క్కుల దినోత్స‌వం నాడు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌స్టిస్ చంద్రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం…

త‌మిళ‌నాడు హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్రుపై మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు సార్ చిట‌ప‌ట‌లాడారు. ప్ర‌పంచ మాన‌వ హ‌క్కుల దినోత్స‌వం నాడు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌స్టిస్ చంద్రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. 

ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని జ‌స్టిస్ చంద్రు మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం త‌న ప్ర‌త్య‌ర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.

అలాగే అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇవ్వ‌డంపై కూడా జ‌స్టిస్ చంద్రు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తిలో ఇంటి స్థ‌లాలు తీసుకున్న ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు మూడు రాజ‌ధానుల‌పై విచారించే త్రిస‌భ్య ధ‌ర్మాస‌నంలో ఉండ‌డంపై ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింద‌ని, అయినా ఆ కేసును తామే విచారిస్తామ‌ని స‌ద‌రు జ‌డ్జిలు చెప్ప‌డాన్ని కూడా జ‌స్టిస్ చంద్రు త‌ప్పు ప‌ట్టారు.  జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్య‌ల‌పై ఒక వ‌ర్గం మీడియా, టీడీపీ దాడికి దిగింది.

ఈ నేప‌థ్యంలో జ‌స్టిస్ చంద్రును టార్గెట్ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రం సారే రంగంలోకి దిగ‌డం విశేషం. అమ‌రావ‌తిలో టీడీపీ కార్యాల‌యంలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ జ‌స్టిస్ చంద్రుపై విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

‘ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు!. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా?. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు. ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా!. ఒక నేరస్తుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చా!. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జ‌స్టిస్ చంద్రుతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌పై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. బ‌హుశా న్యాయం, అన్యాయం గురించి చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా వాళ్ల‌కు తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల మాట్లాడారేమో! 

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌మే ఒక కుగ్రామ‌మైన వేళ‌… ఇంకా ఎక్క‌డి నుంచో వ‌చ్చి అలా మాట్లాడారు, ఇలా విమ‌ర్శించార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇదే జ‌గ‌న్ గురించి రాష్ట్రేతురులు విమ‌ర్శిస్తే మాత్రం…అప్పుడు చూశారా ఏపీ ప‌రువు తీస్తున్నాడ‌ని చంద్ర‌బాబు అన‌డం మ‌నంద‌రం వింటున్నాం.

ఇప్పుడు జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్య‌ల విష‌యానికి వ‌స్తే…వాటిని ఖండించ‌డం ద్వారా మ‌రెవ‌రి మెప్పు పొందాల‌నే ఉత్సాహం చంద్రబాబులో క‌నిపిస్తోంది. పోనీ ఇక్క‌డి వాళ్లైనా విమ‌ర్శ‌లు చేయొచ్చ‌ని చంద్ర‌బాబు అంగీక‌రిస్తారా? త‌మ‌కు భిన్న‌మైన అభిప్రాయాలు వెల్ల‌డిస్తే చాలు ఓ ప‌థ‌కం ప్ర‌కారం వివిధ మాధ్య‌మాల వేదికగా దాడి చేయ‌డం టీడీపీకి అల‌వాటుగా మారింది. 

జ‌స్టిస్ చంద్రు విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. కానీ నిజాలేంటో జ‌నానికి బాగా తెలుసున‌ని చంద్ర‌బాబు గ్ర‌హిస్తే మంచిది.