భారతీయ జనతాపార్టీకి ఇది ఎంతో అవమానం. దేశమంతా అసహ్యించుకుంటున్న హాథ్రస్ నిందితులకు మద్దతుగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించాడు. ఇప్పుడిది దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో దళిత యువతి హత్యాచారానికి గురి కావడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో నిందితులకు మద్దతుగా ఆ రాష్ట్రంలో అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్సింగ్ పహిల్వాన్ ఆదివారం హాథ్రస్లోని తన ఇంట్లో సమావేశం నిర్వహించాడు.
బాధితురాలి ఇంటికి 9 కిలోమీటర్ల దూరంలో జరిగిన సమావేశానికి స్థానికులు భారీగా హాజరు కావడం గమనార్హం. అంతేకాదు, ఈ సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం మరింత ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చిన వాళ్లంతా దుర్ఘటనను సమర్థిస్తున్నట్టుగా సదరు మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నట్టున్నాడు.
దీంతో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ హత్యాచారానికి పాల్పడిన నిందితులకు అండగా నిలిచాడు. హత్యాచార నిందితులకు న్యాయం జరగాల్సిందేనని ఆయన గట్టిగా డిమాండ్ చేశాడు. సదరు మాజీ ఎమ్మెల్యే మరింత దూకుడుగా మాట్లాడుతూ హత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టుబట్టాడు.
ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీబీఐ విచారణకు సిఫార్సు చేయడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే అన్నాడు. దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.
నిందితులను కాపాడుకునేందుకు న్యాయపరమైన మార్గాలను వెతుకుతున్నట్టు తెలిపాడు. కాగా ఈ సమావేశం అగ్రవర్ణాల భేటీ అనే వార్తలను మాజీ ఎమ్మెల్యే కుమారుడు మన్వీర్సింగ్ ఖండించాడు. అన్ని వర్గాల ప్రజలు సమావేశంలో పాల్గొన్నారని చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో …. తాజాగా నిందితులకు మద్దతుగా సమావేశం నిర్వహించడం మరింత డ్యామేజీ కలిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది