జ‌గ‌న్‌ను నిల‌దీస్తార‌ని ఆశిస్తే…ఇదేంద‌య్యా!

రెండున్న‌రేళ్ల త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టిసారిగా జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చారు. అందులోనూ వ‌ర‌ద కార‌ణంగా స‌ర్వం కోల్పోయిన బాధిత జ‌నం వ‌ద్ద‌కు వెళుతున్న జ‌గ‌న్‌పై శాప‌నార్థాలు పెడ‌తార‌ని ఎల్లో బ్యాచ్ ఆశించింది.  Advertisement…

రెండున్న‌రేళ్ల త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టిసారిగా జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చారు. అందులోనూ వ‌ర‌ద కార‌ణంగా స‌ర్వం కోల్పోయిన బాధిత జ‌నం వ‌ద్ద‌కు వెళుతున్న జ‌గ‌న్‌పై శాప‌నార్థాలు పెడ‌తార‌ని ఎల్లో బ్యాచ్ ఆశించింది. 

క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిన త‌మ‌కు సాయం అందించ‌కుండా గాలికి వ‌దిలేశార‌ని జ‌గ‌న్‌ను నిల‌దీస్తార‌ని ఎల్లో మీడియా కెమెరాల‌న్నీ ముఖ్య‌మంత్రి వైపు ఎక్కు పెట్టాయి. వ‌ర‌ద ప్రాంతాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై అధికార పార్టీ శ్రేణులు కూడా ఒకింత ఆందోళ‌న‌లోనే ఉన్నాయి.

క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెండురోజుల పాటు ప‌ర్య‌టించారు. ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా ఆశించిన‌ట్టు జ‌గ‌న్‌ను నిల‌దీయ‌లేదు. పైగా ఇంత‌కు ముందులా జ‌గ‌న్‌పై ఆద‌రాభిమానాలు ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేకున్నాయి. 

వ‌ర‌ద బాధితులే కాదు, ఏ బాధితులైనా ఆత్మీయుల ప‌ల‌క‌రింపు కోరుకుంటారు. ఆ ప‌ల‌క‌రింపుతో ఓదార్పు పొందుతారు. జీవితంపై భ‌రోసా నింపుకుంటారు. రేపు అనేది ఒక‌టుంద‌ని, జీవితంలో వెలుగుచీక‌ట్లు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని స‌ర్ది చెప్పుకుంటారు.

మ‌న అనుకున్న వాళ్ల ప‌ల‌క‌రింపున‌కు నోచుకోక‌పోతే, అంత‌కంటే న‌ష్టం మ‌రొక‌టి ఉండ‌ద‌ని మ‌న‌సు బాధ పెడుతూ వుంటుంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టిన జ‌గ‌న్‌… క‌ష్టాల్లో ఉన్న జ‌నంలోకి వెళ్లారు. వారి ఘోష విన్నారు. తాను వున్నానంటూ భ‌రోసా క‌ల్పించే హామీలిచ్చారు. పాద‌యాత్ర‌లో ఎలాగైతే ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యారో, తాజా ప‌ర్య‌ట‌న నాటి సంగ‌తుల్నే గుర్తు చేసింది. 

ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి శ్రీ‌కృష్ణాన‌గ‌ర్ వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న స‌మ‌యంలో…రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ఓ న‌ర్సు జ‌గ‌న్‌ను చూడాల‌నే ఆకాంక్ష‌ను త‌న కుమార్తె ద్వారా ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా జ‌గ‌న్ నేరుగా బాధిత మ‌హిళ ద‌గ్గ‌రికెళ్లి ఓదార్చిన తీరు ముచ్చ‌టేసింది. జ‌గ‌న్‌పై ప్రేమ‌, గౌర‌వం పెంచేలా చేసింది.

ఇంత‌కంటే జ‌నం మ‌రేది కోరుకోరు. జ‌నం కోరుకుంటున్న‌దే జ‌గ‌న్ చేశారు, మున్ముందు కూడా చేస్తారు. ఇక జ‌గ‌న్‌పై విమ‌ర్శలంటారా… అవి ఎప్పుడూ ఉంటాయి. జ‌గ‌న్ ఏది చేసినా చెడ్డే అంటున్న ప్ర‌తిప‌క్షాలు, వాటిని మోసే మీడియా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ జ‌నం వ‌ద్ద‌కెళ్లి అక్కా, అన్నా, అమ్మా, అవ్వాతాతా.. అని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ వ‌ర‌ద సాయం అందిందా అని ఆరా తీసిన తీరు ప్ర‌జానీకాన్ని క‌ట్టి ప‌డేసింది. 

ఇక మీద‌ట జ‌గ‌న్ జ‌నం మ‌ధ్య గ‌డ‌ప‌డానికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. పాల‌న‌లో లోపాల‌ను స‌రిదిద్దుకోడానికి, నేరుగా ప్ర‌జ‌ల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే అంత‌కంటే కావాల్సింది ఏముంది?