నేటి నుంచి జ‌నాల‌కు కొత్త వినోదం!

ఎప్పుడో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఎట్ట‌కేల‌కూ నేటి నుంచి మొద‌ల‌వుతోంది. షార్జా, దుబాయ్, అబుదాబీలు వేదిక‌గా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గ‌బోతోంది. క‌రోనా కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన వాటిల్లో క్రికెట్ మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ కూడా…

ఎప్పుడో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఎట్ట‌కేల‌కూ నేటి నుంచి మొద‌ల‌వుతోంది. షార్జా, దుబాయ్, అబుదాబీలు వేదిక‌గా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గ‌బోతోంది. క‌రోనా కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన వాటిల్లో క్రికెట్ మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ కూడా ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా ఈవెంట్ల నిర్వ‌హ‌ణ‌ను క‌రోనా తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. ఈ పాటికి ఒలింపిక్స్ కూడా జ‌ర‌గాల్సింది. అవి కూడా వాయిదా ప‌డ్డాయి. వీలైతే వ‌చ్చే ఏడాది, లేక‌పోతే ఈ సారికి వాటి ర‌ద్దు అనే ప్ర‌తిపాద‌న ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. 

అయితే ఎలాగైనా ఐపీఎల్ ను నిర్వ‌హించాల‌న్న బీసీసీఐ కోరిక నేటి నుంచి నెర‌వేరుతూ ఉంది. ప్రేక్ష‌కులు లేకుండానే మ్యాచ్ లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లూ వేదిక‌ల‌ను చేరుకున్నాయి. ఆట‌గాళ్ల‌ను క్వారెంటైన్లో ఉంచాయి యాజ‌మాన్యాలు. అప్ప‌టికీ ప‌లు టీమ్ ల స‌హాయ‌క సిబ్బందికి క‌రోనా సోకిన దాఖ‌లాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నేటి నుంచి మ్యాచ్ లు మొద‌లు కానుండ‌టంతో.. ఇక అంద‌రి దృష్టీ క‌రోనా మీద నుంచి మ్యాచ్ ల మీద‌కు మళ్ల‌నుంది.

ఎంతో ఆర్భాటంగా, అంగ‌రంగ వైభ‌వంగా మొద‌ల‌య్యే ఐపీఎల్ మ్యాచ్ లు ఎలాంటి సంద‌డి లేకుండా స్టేడియంలో 22 మంది ఆట‌గాళ్లు, ఇద్ద‌రు అంపైర్ల‌తో మాత్ర‌మే సాగ‌బోతున్నాయి. ఆఖ‌రికి బాల్ బాయ్స్ కూడా ఉండ‌రు! స్డాండ్స్ లోకి వెళ్లే బంతిని ఫీల్డ‌ర్డు వెళ్లి తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితుల్లో మ్యాచ్ లు జ‌ర‌గ‌బోతున్నాయి.

తొలి మ్యాచ్ ముంబై, చెన్నైల మ‌ధ్య‌న జ‌ర‌గ‌బోతోంది. నేటి రాత్రి ఏడున్న‌ర నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్ మూడు వ‌ర‌కూ లీగ్ మ్యాచ్ లు జ‌రుగుతాయి. ప్లేఫ్ మ్యాచ్ ల తేదీలు, వేదిక‌లు ప్ర‌క‌టించాల్సి ఉంది. నవంబ‌ర్ ప‌దిన ఐపీఎల్ ఫైన‌ల్ జ‌ర‌గ‌బోతోంది. మామూలుగా అయితే టీవీల ద్వారా ఐపీఎల్ కు విప‌రీత స్థాయి వీక్ష‌ణ ఉంటుంది.

అయితే ఆ టీవీల ప్ర‌త్యక్ష ప్రసారాల‌కు జోష్ ను ఇచ్చేది మాత్రం స్టేడియంలోని ప్రేక్ష‌కులే. వారు లేకుండా మ్యాచ్ లు జ‌ర‌గ‌డం అంటే కొంత వ‌ర‌కూ ఉప్పు లేకుండా ప‌ప్పు తిన‌డ‌మే. అయితే ఆ లోటు ఏమీ ఉండ‌ద‌ని.. మ్యాచ్ లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ టీవీ వీక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతాయ‌ని ఆట‌గాళ్లు కూడా భ‌రోసా ఇస్తున్నారు. ఈ కొత్త అనుభ‌వం భార‌తీయ క్రికెట్ అభిమానుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో!

జడ్జీల కూతుర్లు కూడా చట్టంముందు సమానులే