ఆర్టీసీ సమ్మె: జగన్ నేర్చుకోవాల్సిన పాఠం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలు, ఆది విఫలమైన తీరు, కేసీఆర్ అనుసరించిన నిరంకుశ విధానం చూస్తుంటే.. ఒక విషయం స్పష్టమవుతుంది. కార్మికులు కానీ, కొన్ని వర్గాల ప్రజలు కానీ గొంతెమ్మ కోర్కెలు కోరితే…

తెలంగాణ ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలు, ఆది విఫలమైన తీరు, కేసీఆర్ అనుసరించిన నిరంకుశ విధానం చూస్తుంటే.. ఒక విషయం స్పష్టమవుతుంది. కార్మికులు కానీ, కొన్ని వర్గాల ప్రజలు కానీ గొంతెమ్మ కోర్కెలు కోరితే ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించాలనే విషయాన్ని కేసీఆర్ నిరూపించారు. కనీసం ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడైనా కేసీఆర్ ఓ మెట్టు దిగలేదు. ఆ విషయంలో కేసీఆర్ కాస్త ఉదరంగా ఉండాల్సింది. కేసీఆర్ పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేం కానీ, ప్రజల నుంచి వచ్చే ప్రతి డిమాండ్ కు తలాడించేది లేదన్న ఆయన నిర్ణయం మాత్రం కొంతమంది ప్రశంసలు అందుకుంటోంది.

ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలను ఓసారి పరిశీలిస్తే.. కేసీఆర్ అంత మొండి వైఖరి జగన్ వద్ద కనిపించదు. నో అని చెప్పాల్సిన చాలా సందర్భాల్లో జగన్ ఆయా వర్గాలపై సింపతీ చూపించారు. ఎస్ అంటూ తలాడించారు. ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ముప్పేమీ లేదు కానీ ఇదే పద్ధతి అలవాటైతే రాబోయే రోజుల్లో చాలా వర్గాలు ప్రభుత్వాన్ని బెదిరించక మానవు. జగన్ సీఎం అయిన తర్వాత తొలిసారిగా రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని బెదిరించారు, వాలంటీర్ వ్యవస్థతో తమ ఉపాధికి గండి పడుతుందంటూ నిరసనలు, ధర్నాలు చేశారు. వాస్తవానికి రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు చేయాలని చూసిన జగన్ సర్కారు, వీరి బెదిరింపులకు వెనక్కు తగ్గింది.

తాజాగా డీలర్లు మరో పల్లవి అందుకున్నారు, తమకు కూడా జీతాలివ్వాలని లేకపోతే గ్రామ సచివాలయాల్లో ఓ సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి రేషన్ డీలర్లను అందులో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. ఇక ఆశా వర్కర్లు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, జీతాలు పెంచుతాం, కాస్త టైమ్ ఇవ్వండి అంటున్నా కూడా రోడ్లెక్కి ధర్నాలు చేశారు. గోపాల మిత్రలు కలెక్టరేట్ల వద్ద చేసిన ధర్నాలకు ప్రభుత్వం దిగొచ్చి సయోధ్య కుదుర్చుకుంది. మరోవైపు విద్యుత్ ఒప్పంద ఉద్యోగులు తమ సంగతేంటని అంటున్నారు, విద్యుత్ మీటర్ రీడర్లు సచివాలయ ఉద్యోగులతో తమ ఉపాధి పోతుందని విజయవాడలో ధర్నాకు సన్నాహాలు చేస్తున్నారు. ఆఖరికి ఆమధ్య అన్న క్యాంటీన్ ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని బెదిరించాలని చూశారు. 

జగన్ ఎవరినీ నొప్పించరు, ఎవరికీ లేదు అని చెప్పరు అనే పేరుంది కాబట్టే.. అందరూ ప్రభుత్వాన్ని బెదిరించి పనులు చేయించుకోవాలని చూస్తున్నారు. ఒకరకంగా ఇది బ్లాక్ మెయిలింగే. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ ఏవీ తనముందు పనిచేయవని కేసీఆర్ తెలంగాణలో ఓ ఇమేజ్ సృష్టించుకున్నారు. ఆర్టీసీ సమ్మె విఫలం కావడంతో.. ఇంకే ఉద్యోగీ అక్కడ విధులకు డుమ్మాకొట్టి రోడ్డెక్కే సాహసం చేయలేడు. కానీ ఏపీలో పరిస్థితి దీనికి పూర్తి రివర్స్. చెప్పిందల్లా చేసే సీఎం ఉండటంతో.. ఇక్కడ అవసరానికి మించి అడిగేవారు ఎక్కువయ్యారు.

జగన్ ఇకనైనా కొన్నింటికి “నో” చెప్పడం నేర్చుకోవాలి. ఖజానాపై పెరుగుతున్న భారాన్ని దించుకునే ఆలోచన చేయాలి. ఇది ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి కూడా మంచిది.