ప్రపంచంలో భారతదేశానికి తప్ప, మరే ఇతర దేశానికి వారి స్వదేశంలో (ఆ దేశానికి చెందిన సొంత భాషలో) ఒకపేరు- ఇంగ్లిషులో మరొక పేరు ఉండడం అంటూ జరగదు. అది ఎంత క్లిష్టంగా ఉన్నా సరే.. ఆ దేశంయొక్క అధికార (సొంత) భాషలో ఉండే పేరునే ఇంగ్లిషులో కూడా పలికేలాగా స్పెల్లింగు తయారుచేసుకుంటారు.
కానీ.. భారతదేశానికి మాత్రం.. స్వదేశీ భాషల్లో భారత్ అంటారు.. ఇంగ్లిషులో ‘ఇండియా’ అంటారు. మనదేశంలో ప్రధానంగా ఉత్తరాదిలో చాలా మంది ఈ దేశం పేరును ‘హిందుస్తాన్’ గా ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మోడీ సర్కారు.. ఇండియా అనే ఇంగ్లిషుపేరును మార్చేసి.. దానిని కూడా ‘భారత్’ గా నామకరణం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ అతిథులకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వారికి పంపిన ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం గమనించిన కాంగ్రెస్ ఇప్పటినుంచే యాగీ ప్రారంభించింది. ఈ ప్రయత్నాన్ని రాష్ట్రాల సమాఖ్య మీద జరుగుతున్న దాడిగా కాంగ్రెసు పార్టీ అభివర్ణిస్తోంది.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక దేశానికి రెండు పేర్లుతో చెలామణీలో ఉండడాన్ని అవమానంగా ఎందుకు అనుకోవడం లేదు. ఈ దేశానికి సొంతమైన భాషలో ఉండే పేరును ప్రపంచమంతా చెప్పుకోడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు. ఈ మీ దేశం పట్ల, మీ సంస్కృతి, మీదైన భాష పట్లో మీలో ఉండే చులకన భావం కాదా? అనే ప్రశ్న ఈ చర్యను సమర్థించే వారినుంచి వినవస్తోంది.
భారతదేశం యొక్క పేరు ఇండియా అని ఉన్నది గనుక.. ఆ పేరులోంచి రాజకీయ లాభం పొందాలనే వక్రమైన ఆలోచనను కాంగ్రెసు పార్టీ చేసింది. రాహుల్ గాంధీ తన అపారమైన తెలివితేటలు ఉపయోగించి.. విపక్షాల కూటమికి.. యూపీఏ అనే పాతపేరును తొలగించేసి ఇండియా అని కొత్త నామకరణం చేశారు. INDIA అనే పొడి అక్షరాలను ముందుగానే పేర్చుకుని.. వాటికి తోచిన రీతిలో వివరణను తయారుచేసుకున్నారు.
అప్పటినుంచి ఇండియాను గెలిపించడం అంటే.. మోడీని ఓడించడం అంటూ ఊదరగొడుతున్నారు. అక్కడికేదో మోడీని ఓడిస్తే తప్ప.. ఈ దేశం గెలిచినట్టు కాదు అనే వక్రమైన కుయుక్తుల ఆలోచనలను ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మోడీ సర్కారు దేశం పేరును భారత్ అని మార్చడానికి ప్రయత్నిస్తున్నదని తెలియగానే.. తమ కుయుక్తులు మంటగలిసిపోతున్నాయని.. కాంగ్రెసుపార్టీ మరియు రాహుల్ వందిమాగధులు భయపడుతున్నట్టుగా ఉంది.
ఆ మాటకొస్తే.. దేశం యొక్క పేరును భారత్ అని కూడా మార్చేసి.. హిందుస్తాన్ అని పెడితే.. ఈ లౌకికవాదులంతా గగ్గోలు పెట్టాలి. అప్పుడు వారు ఆవేదన చెందితే అర్థముంది. అంతే తప్ప.. భారత్ అనే పేరు అంతర్జాతీయంగా కూడా చెలామణీలోకి వచ్చేలాగా మార్పు చేస్తే దాని గురించి చింతించడం అంటే.. రాజకీయ కుట్రబుద్ధి మాత్రమే అనిపిస్తోంది.