కుప్పంలో వైసీపీ రాంగ్ స్ట్రాట‌జీ!

కుప్పం మున్సిపాల్టీలో వైసీపీ రాంగ్ స్ట్రాట‌జీతో వెళుతోంది. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు విష‌యంలో మొద‌టి నుంచి అన‌వ‌స‌ర వివాదాల‌కు వైసీపీ కార‌ణ‌మ‌వుతోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. పార్టీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డే త‌రుణంలో కేవ‌లం…

కుప్పం మున్సిపాల్టీలో వైసీపీ రాంగ్ స్ట్రాట‌జీతో వెళుతోంది. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు విష‌యంలో మొద‌టి నుంచి అన‌వ‌స‌ర వివాదాల‌కు వైసీపీ కార‌ణ‌మ‌వుతోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. పార్టీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డే త‌రుణంలో కేవ‌లం ఒకే ఒక్క వార్డు కోసం చెడ్డ పేరు తెచ్చుకుంటోంద‌న్న ఆవేద‌న వైసీపీ శ్రేణుల్లోనూ ఉంది.

గ‌తంలో తిరుప‌తి కార్పొరేష‌న్‌లో 7వ డివిజ‌న్‌లో కూడా ఇలాంటి త‌ప్పే వైసీపీ చేసింది. దీంతో అక్క‌డ ఎన్నిక నిలిచిపోవ‌డంతో పాటు ప్ర‌స్తుతం కోర్టులో వ్య‌వ‌హారం నడుస్తోంది.

తిరుప‌తిలో జ‌రిగిన త‌ప్పే కుప్పంలో కూడా పున‌రావృతం అయ్యేలా ఉంది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులున్నాయి. ఇది చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డంతో ప్ర‌తిదీ రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇక్క‌డ వైసీపీ చాలా తెలివిగా ప్ర‌వ‌ర్తించాల్సి పోయి మొండిగా, మూర్ఖంగా ముందుకెళుతోంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 14వ వార్డు టీడీపీ అభ్య‌ర్థులు ప్ర‌కాశ్‌, ఆయ‌న భార్య తిరుమ‌గ‌ళ్ విత్‌డ్రా చేసుకున్నార‌ని, అక్క‌డ వైసీపీకి ఏక‌గ్రీవ‌మైన‌ట్టు ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌టించారు.

కానీ తాము కుప్పానికి దూరంగా ఉంటే, ఎలా ఉప‌సంహ‌రించుకుంటామ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే విష‌య‌మై టీడీపీ ఎమ్మెల్యే  నిమ్మ‌ల రామానాయుడు, మాజీ మంత్రి  అమ‌ర‌నాథ్‌రెడ్డి, ఇత‌ర నాయ‌కులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. ఒక ర‌కంగా కుప్పం ప‌ట్ట‌ణంలో టీడీపీ శ్రేణుల్లో ప‌ట్టుద‌ల‌, క‌సి పెంచేలా వైసీపీ చ‌ర్య‌లున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

ఏక‌గ్రీవ‌మైన‌ట్టు తాము ప్ర‌క‌టించామ‌ని, ఏదైనా ఉంటే న్యాయ‌స్థానంలో తేల్చుకోవాల‌ని ఎన్నిక‌ల అధికారి చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ ఒక్క వార్డును వైసీపీకి ఏక‌గ్రీవం చేయ‌డం వ‌ల్ల మున్సిప‌ల్ పీఠం ఆ పార్టీ సొంతం కాదు క‌దా? అలాంట‌ప్పుడు వైసీపీ దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతోంద‌న్న అప‌ప్ర‌ద ఎందుకు మూట క‌ట్టుకోవాల్సి వ‌స్తున్న‌దో ఆ పార్టీ నేత‌లు ఆలోచించాలి.

14వ వార్డును ఏక‌గ్రీవం చేసినంత మాత్రాన ఏదో జ‌రిగిపోతుంద‌న్న భ్ర‌మలు వీడాలి. ఎటూ దానిపై టీడీపీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తుంది. ఆ వార్డు వ‌ర‌కూ ఎన్నిక ఆగిపోవ‌డం ఖాయం. ఈ మాత్రం దానికి అన‌వ‌స‌ర రాద్ధాంతం దేనిక‌నేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. చెడ్డ‌పేరు వ‌చ్చినా పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లిగి ఉంటే అర్థం చేసుకోవ‌చ్చు. అవేవీ లేనప్పుడు అన‌వ‌స‌రంగా ఆ ఒక్క వార్డుపై దృష్టంతా కేంద్రీక‌రించ‌డం దేనికో వైసీపీ నేత‌ల‌కే తెలియాలి.