ఆధ్యాత్మిక బాబా ముసుగులో 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడనే వార్త దేశాన్ని కుదిపేసింది. అతడి మొబైల్ ఫోన్ నుంచి ఒక్కొక్కటిగా వెలుగుచూసిన వందలాది వీడియోలు చూసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ జిలేబీ బాబా ఎవరు? ఇతడికి ఈ పేరు ఎలా వచ్చింది? ఇతడి గతం ఏంటి?
ఇతడు దైవాంశ సంభూతుడు కాదు. ఓ సాదాసీదా వ్యక్తి. ఇప్పుడు అందరూ జిలేబీ బాబా అని పిలుస్తున్న ఈ వ్యక్తి పేరు అమర్ వీర్. పంజాబ్ లోని మన్సా పట్టణం. భార్య చనిపోయింది. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల సంతానం.
భార్య చనిపోవడంతో మన్సా నుంచి తోహానాకు మకాం మార్చాడు. అక్కడ జిలేబీలు అమ్ముకునేవాడు. దాదాపు 13 ఏళ్లు అదే వృత్తిలో ఉన్నాడు. అదే టైమ్ లో ఓ తాంత్రికుడు ఇతడికి పరిచయమయ్యాడని చెబుతారు స్థానికులు.
ఆ మాంత్రికుడితో అమర్ వీర్ గుర్తుతెలియని ప్రదేశానికి పారిపోయాడు. అలా కొన్నేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఎక్కడైతే జిలేబీలు అమ్మాడో.. అక్కడే ఇల్లు కట్టాడు, అందులోనే గుడి పెట్టాడు. తన పేరును జిలేబీ బాబాగా మార్చుకున్నాడు.
స్వామీజీ అనగానే ఎగబడే జనం, ఈ జిలేబీ వైపు కూడా అలానే ఎగబడ్డారు. వాళ్లలోంచి మహిళల్ని ఎంపిక చేసుకున్నాడు ఈ బాబా. ఇతడిపై తొలి అత్యాచార ఆరోపణలు 2018లోనే వచ్చాయి. తనను బాబా అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ కేసుపెట్టింది. అయితే వెంటనే ఆ కేసులో బెయిల్ పొంది బయటకొచ్చాడు.
ఇక అక్కడ్నుంచి తన విశ్వరూపం చూపించాడు జిలేబీ. ఏకంగా 120 మంది మహిళలపై దారుణానికి తెగబడ్డాడు. అత్యాచారం చేసిన ప్రతి మహిళను వీడియో తీశాడు. అలా తీసిన వీడియోలను సదరు మహిళ పేరిట ఫోల్డర్ ఓపెన్ చేసి మరీ సేవ్ చేశాడు.
ఆ తర్వాత అవే వీడియోలతో మహిళలను బెదిరించడం మొదలుపెట్టాడు. పదేపదే అత్యాచారాలకు తెగబడ్డాడు. ఎట్టకేలకు అతడి పాపం పండింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. వీడియోలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.