కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హీరో సూర్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జై భీమ్ సినిమా హిట్ టాక్ రావడంతో ఎక్కడ చూసినా హీరో సూర్యతో పాటు అందులో నటించిన వారి గురించే చర్చ.
బాధితుల పక్షాన లాయర్‌గా సూర్య నటించడం కాకుండా జీవించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో సూర్య కన్నీళ్లు ఆపుకోలేని ఓ సందర్భం ఎదురైంది. ఇటీవల ఆకస్మిక మృతి చెందిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ సూర్య మనసు తల్లడిల్లింది.
పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతి దక్షిణాది చిత్ర పరిశ్రమను విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. పునీత్‌కు దక్షిణాది నటీనటులంతా ఘనంగా తుది వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలకు హాజరు కాని వారు ఇప్పుడు నేరుగా బెంగళూరు వెళ్లి నివాళులర్పిస్తున్నారు. అలాగే పునీత్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతున్నారు.
ఈ నేపథ్యంలో పునీత్ సమాధిని హీరో సూర్య శుక్రవారం సందర్శించారు. పునీత్ సమాధి దగ్గర ఆయనకు నివాళులర్పించే సందర్భంలో ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. చిన్న వయసులోనే పునీత్ అందనంత దూరాలకు వెళ్లిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
పునీత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు రాల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.