సమాధానం లేని ప్రశ్న ఇది. సినిమా థియేటర్ లోకి ఆహారాన్ని అనుమతించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తారు. అలా చేస్తే తమ బిజినెస్ ఏం కావాలంటూ థియేటర్ యాజమాన్యాలు ప్రశ్నిస్తాయి. కొన్ని చోట్ల నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లకు అనుమతి ఉంది. మరికొన్ని చోట్ల మంచి నీళ్లను కూడా అనుమతించని మల్టీప్లెక్సులు ఉన్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించింది. థియేటర్ యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన బెంచ్ ఈ మేరకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఆరోగ్యకరమైన భోజనం తినడానికి సినిమా హాల్, జిమ్ కాదు. అది వినోదం కోసం ఉద్దేశించిన కేంద్రం. పైగా అది ప్రైవేట్ ప్రాపర్టీ. తన ప్రాంగణంలో రూల్స్ విధించుకునే హక్కు ఓనర్ కు ఉంటుంది. ఆయుధాలు అనుమతించకూడదని, లింగ-వర్ణ-కుల వివక్ష ఉండకూడదని మేం చెప్పగలం. అంతేతప్ప ఏ రకమైన ఆహార పదార్థాన్నయినా సినిమా హాల్ లోకి తీసుకెళ్లమని ఎలా చెప్పగలం.”
సినిమా హాళ్లలోకి ప్రేక్షకులు తమకు నచ్చిన పానీయాలు, ఆహార పదార్థాల్ని తీసుకెళ్లవచ్చంటూ జమ్ముకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఈ తీర్పును సమర్థిస్తే, రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్ లో నిమ్మకాయ నీళ్లు కలుపుకొని తాగుతాడని, జిలేబీ తిని వేళ్లను సీటుకు తుడుస్తాడని, తందూరీ చికెన్ తిని ఎముకలు సీట్లో వేస్తాడని, అలాంటి సందర్భాల్లో క్లీనింగ్ కు ఎవ్వర్ని బాధ్యుల్ని చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. పైగా దీని వల్ల తర్వత షోకు వచ్చే ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడతారని, ప్రైవేట్ పాపర్టీ అపరిశుభ్రం అవుతుందని తెలిపింది.
సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టమని, ఒక్కసారి థియేటర్ లోకి అడుగుపెడితే మాత్రం యాజమాన్యం విధించిన రూల్స్ పాటించాల్సిందేనని తెలిపింది ధర్మాసనం. అదే సమయంలో చిన్నారుల కోసం నీళ్లు, ఆహారాన్ని మాత్రం అన్ని థియేటర్లు అనుమతించాలనే తమ పాత ఆదేశాన్ని గుర్తుచేసింది. ప్రతి ప్రేక్షకుడికి తాగడానికి ఉచితంగా నీళ్లు అందించాలనే నిబంధనను కూడా గుర్తుచేసింది.
థియేటర్ ప్రాంగణంలో తినుబండారాలు కొనమని అడగడంలో తప్పులేదని, ప్రేక్షకుడికి నచ్చితే కొనుక్కుంటాడని తెలిపిన ధర్మాసనం.. కచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కొని తినాలనే రూల్ ను విధించే హక్కు మాత్రం థియేటర్ యాజమాన్యానికి లేదని స్పష్టం చేసింది.