టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడాయనకు స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు దారి కనిపించడం లేదు. అలాగని లాక్‌డౌన్ లేదు. ఏపీకి వెళ్లేందుకు పర్మిషన్ అవసరం లేదు. కానీ వెళ్లలేని నిస్సహాయ స్థితి. రా రమ్మని ఆంధ్రప్రదేశ్ ఆప్యాయంగా పిలుస్తున్నా…ఊహూ అని వెళ్లేందుకు బాబు మొరాయిస్తున్నారు.
ఎల్లకాలం ఇంట్లోనే ఉంటూ జూమ్‌లో పనికానిచ్చేందుకు , బాబేమీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగి కాదు. ప్రజలతో నేరుగా సంబంధా లున్న రాజకీయ రంగంలో ఉన్నారాయన. మరోవైపు వెళుదామంటే కరోనా మహమ్మారి ఏం చేస్తుందోననే భయాందోళన. ప్రాణాలతో ఉంటే బలిసాకైనా తిని బతుకుదామని సర్ది చెప్పుకున్నా….రాజకీయం అనేది బతుకు సమస్య కాకపాయ. ఇదో అధికార, ఆర్థిక సమస్య. రాజకీయాల్లో నాయకుడన్న వాడు ప్రజల మధ్య లేకపోతే…ప్రజలు కూడా వారిని అంతే సులభంగా మరిచిపోతారు. ప్రజల్లోకి వెళ్లకపోతే రాజకీయ మరణ శాసనం తప్పదు.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది బాబు ముందు అతి పెద్ద సవాల్‌గా నిలిచింది. లాక్‌డౌన్ విధించిన సమయంలో ఏదోలా మేనేజ్ చేశాడు కానీ, ఇప్పుడు అలా కుదరడం లేదు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగితే…మృతులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాయడం, అక్కడి నుంచి సహజంగానే సానుకూల స్పందన రాకపోవడంతో….నింద మోడీ సర్కార్ నెత్తిన వేయగలిగారు.
ఇప్పుడు విజయవాడలో రమేశ్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి పది మంతి మృత్యువాత పడితే కనీసం పరామర్శించేందుకు పోలేని దుస్థితి. దీనికి లాక్‌డౌన్, పర్మిషన్ లాంటి సమస్యలేవీ లేవు. కానీ తప్పు తమ కులపోళ్లది కావడంతో బాబు నోటికి తాళం పడింది. ఇక రాజధాని తరలింపుపై రెండు రోజులకో సారి జూమ్ వీడియా కాన్ఫరెన్స్‌లో మీడియా తో మాట్లాడుతున్నప్పటికీ స్పందన కరువైంది.
ఈ నేపథ్యంలో విజయవాడకు వెళ్లి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలు చేయడానికి మార్గమేది? హైదరాబాద్‌లోనే ఎన్నాళ్లిలా? ఓ ఆరు నెలలు ఏపీకి వెళ్లకపోతే టీడీపీ పరిస్థితి ఏంటి? మరోవైపు బీజేపీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు దూకుడుగా పోతోంది. టీడీపీ నుంచి భారీ వలసలకు ప్లాన్ చేస్తున్న బీజేపీని నిరోధించడం ఎలా? అప్పుడప్పుడు విజయవాడ వెళుతూ రెండు మాటలు మాట్లాడే జనసేనాని పవన్‌కల్యాణ్, అమెరికా నుంచి ఏడాదికో రెండేళ్లకో వచ్చి పోయే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు తనకు తేడా ఏంటనే అంతర్మథనం బాబులో మొదలైనట్టుంది.
మీడియా మేనేజ్‌మెంట్‌తో ఎంత కాలమని రాజకీయాలు చేస్తారు. అయినా మీడియా మేనేజ్‌మెంట్‌తో ప్రజల్ని మేనేజ్ చేయడానికి ఇదేమి ఎన్టీఆర్ నాటి కాలం కాకపాయ. ఇది సోషల్ మీడియా కాలం. నూనెతో కాకుండా నీళ్లతో దీపాలు వెలి గిస్తున్న కాలం. తెలివి అందరి సొత్తైంది. అరచేతిలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓ మీడియా యజమాని అయిన పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో బాబు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రాజకీయాలు చేసే దారేది దేవా? ఇంత బతుకు బతికీ కరోనాకు భయపడడమా? కరోనాను ధిక్కరించి ఆంధ్రాకు వెళ్లడమా? ఈ రెండింటిలో బాబు ఎంచుకునే ప్రత్యామ్నాయ మార్గం ఏది? అదేదో బామ్మర్ది బాలకృష్ణ సినిమా డైలాగ్… సమయం లేదు మిత్రమా మరణమా? శరణమా? అన్నట్టు బాబుకు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.