ఈ ‘మీడియా’ గోలేంటి చంద్రబాబు..?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు.. తాజాగా మరో పల్లవి అందుకున్నారు. వారం రోజుల నుంచి వరుసగా తమ అనుకూల మీడియాకు వత్తాసు పలుకుతూ జగన్…

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు.. తాజాగా మరో పల్లవి అందుకున్నారు. వారం రోజుల నుంచి వరుసగా తమ అనుకూల మీడియాకు వత్తాసు పలుకుతూ జగన్ పై విమర్శలు సంధిస్తున్నారు. అధికార పార్టీ తమ అనుకూల మీడియాను అస్సలు పట్టించుకోవట్లేదని, ప్రకటనలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఛానెల్స్  ప్రసారం కాకుండా మీడియాపై నియంత్రణ పెట్టారని శోకాలు పెడుతున్నారు బాబు.

పార్టీ గురించి, పార్టీ కార్యకర్తల గురించి కూడా చంద్రబాబు ఈమధ్యకాలంలో ఇంతగా దిగులు పడ్డ సందర్భం లేదు. ఏ జిల్లాకి వెళ్లినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా.. చంద్రబాబు మాట్లాడే అంశాల్లో ఇది ప్రధానంగా ఉంటోంది. విశాఖ నుంచి జిల్లా టూర్లు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు మీడియాపై దాడి జరుగుతోందంటూ ఆవేదన చెందుతున్నారు. అసలింతకీ చంద్రబాబుకి ఈ మీడియా పిచ్చి ఎందుకు పట్టుకొంది?

తొలి నుంచీ టీడీపీ అనుకూల ముద్ర వేసుకున్న ఓవర్గం మీడియా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మరింతగా రెచ్చిపోతోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణం అవుతోంది. ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల విషయంలో జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. పేపర్ లీకైందని, తమవారికే ఉద్యోగాలిప్పించుకుంటున్నారని, అర్హులకు అన్యాయం జరిగిపోతోందంటూ అసత్య కథనాలు రాసింది ఆ సెక్షన్ మీడియా. రివర్స్ టెండరింగ్ తో ప్రజాధనం ఆదా అవుతున్నప్పటికీ నాణ్యత లోపిస్తుందంటూ కథనాలు సృష్టిస్తోంది. చివరికి వైఎస్ఆర్ రైతుభరోసా పథకంలో కూడా రంధ్రాన్వేషణ వీడలేదు సదరు మీడియా.

ఓపికకు కూడా ఓ హద్దుంటుంది. ఇలా అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులెవరు. అందుకే ఈసారి జగన్ మీడియా విషయంలో కాస్త కఠినంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో చంద్రబాబు, బాబు అనుకూల మీడియాలో భయం మొదలైంది. ఇప్పటి వరకూ చేసిందే చాలా ఎక్కువ, ఇకపై ఇలాంటి ఆటలు సాగవని అర్థమైంది. అందుకే పరోక్షంగా జగన్ పై చంద్రబాబు మీడియాని అడ్డం పెట్టుకుని విమర్శల దాడి మొదలు పెట్టారు.